మంగళగిరి–తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను ఆదేశించిన హైకోర్టు
వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థి పిటిషన్‌కు స్పందించిన న్యాయస్థానం
అన్ని డివిజన్లలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు..
ఎన్నికల ప్రక్రియను ఆద్యంతం వీడియోగ్రఫీ చేయించాలి
సీసీ ఫుటేజీని భద్రపరచాలని ఉత్తర్వులు జారీ
సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లాలోని మంగళగిరి–తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవికి జరిగే ఎన్నికలకు సంబంధించి, అక్కడి 62 డివిజన్లలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి, మొత్తం ఎన్నికల ప్రక్రియను వీడియోగ్రఫీ చేయించాలని వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థి కె.పున్నానాయక్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు స్పందించింది. పిటిషనర్ కోరుతున్న విధంగా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి, మొత్తం ఎన్నికల ప్రక్రియను వీడియోగ్రఫీ చేయించాలని ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. అంతేకాక ఎన్నికల పిటిషన్ దాఖలు చేసే గడువు ముగిసే వరకు ఆ ఫుటేజీని భద్రపరచాలని కూడా ఆదేశించింది.
ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ మండవ కిరణ్మయి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అంతకు ముందు పున్నా నాయక్ తరఫు న్యాయవాది సానేపల్లి రామలక్ష్మణరెడ్డి వాదనలు వినిపిస్తూ, అన్ని పోలింగ్ కేంద్రాల్లో, ఒకవేళ రీ–పోలింగ్ జరిగితే దానిని, ఓట్ల లెక్కింపును ఇలా మొత్తం ఎన్నికల ప్రక్రియను వీడియోగ్రఫీ చేయించాలని, ఇందుకు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరుతూ పిటిషనర్ ఎన్నికల సంఘానికి వినతి పత్రం సమర్పించారన్నారు.
అయితే ఆ వినతిపై అధికారులు ఏ రకంగానూ స్పందించలేదని తెలిపారు. ఎన్నికలను నిష్పాక్షికంగా నిర్వహించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌పై ఉందన్నారు. అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి, పిటిషనర్ కోరుతున్న విధంగా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి, మొత్తం ప్రక్రియను వీడియోగ్రఫీ చేసి దాని ఫుటేజీని భద్రపరచాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించారు.


