పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై సమీక్షలో మాట్లాడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్‌లో వేగవంతమైన కొత్త తరహా రవాణా వ్యవస్థపై సర్కారు కసరత్తు
డ్రైవర్ లేకుండా పూర్తిగా ఆటోమేటెడ్ పద్ధతిలో నడిచే పాడ్ ట్యాక్సీలు/కార్లు
వేళలంటూ ఉండవు.. ప్రయాణికులకు అవసరం అయినప్పుడు బుక్ చేసుకోవచ్చు
కూకట్‌పల్లి నుంచి బయో డైవర్సిటీ వరకు ఓ పీఆర్‌టీఎస్
బేగంపేట మెట్రో స్టేషన్ నుంచి రాణిగంజ్ వరకు మరొకటి
తొలిదశ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై సీఎం రేవంత్‌కు అధికారుల వివరణ
నెక్లెస్ రోడ్డు, రాయదుర్గ్, పీపుల్స్ ప్లాజా పరిసరాల్లో డిపోల నిర్మాణానికి సీఎం సూచన
మూసీ పునరుజ్జీవం, రేడియల్ రోడ్లు, ఇతర అభివృద్ధి పనుల తీరుపై అసంతృప్తి
ఎన్నికలకు ఏడాదిలోపే ఈ పనులన్నీ పూర్తి చేయాలన్న ముఖ్యమంత్రి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహా నగరంలో ట్రాఫిక్ సమస్యను అధిగమించడంలో భాగంగా పర్సనల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (పీఆర్‌టీఎస్) అనే కొత్త తరహా రవాణా వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. తొలిదశలో రెండు రూట్లలో పీఆర్‌టీఎస్ ప్రాజెక్టును చేపట్టే ప్రతిపాదనలు పరిశీలిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంగళవారం రాత్రి ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలోని బోధి పెవిలియన్‌లో రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై నిర్వహించిన సమీక్షలో.. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సాంకేతిక, ఆర్థిక సాధ్యాసాధ్యాలను (టెక్నో, ఎకనమిక్ ఫీజబిలిటీ) ఆయనకు అధికారులు వివరించారు.
కూకట్‌పల్లి నుంచి రాయదుర్గ్ మీదుగా బయో డైవర్సిటీ వరకు ఒక రూటు, బేగంపేట మెట్రో స్టేషన్ నుంచి సెక్రటేరియట్, బషీర్‌బాగ్ మీదుగా రాణిగంజ్ వరకు మరో రూటుతో పీఆర్‌టీఎస్ తొలిదశ చేపట్టేలా ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు తెలిపారు. తొలి రూట్‌ను ట్యాంక్‌బండ్ చుట్టూ 11 కి.మీ.ల నిడివితో నిర్మించనున్నట్టు వెల్లడించారు.
కాగా నెక్లెస్ రోడ్డు, రాయదుర్గ్, పీపుల్స్ ప్లాజా పరిసరాల్లో పీఆర్‌టీఎస్ డిపోలను నిర్మించేందుకు అనువైన స్థలాలను గుర్తించి, సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆదేశించారు. డిపోల పరిసరాల్లో మల్టీ లెవెల్ పార్కింగ్ సదుపాయంతో పాటు రూట్లు, డిపోల నిర్మాణం, ఇతర అంశాలపై పూర్తిస్థాయి అధ్యయనం చేసి ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.
పీఆర్‌టీఎస్ అంటే ఏమిటి?
పీఆర్‌టీఎస్ అనేది డ్రైవర్ లేకుండా పూర్తిగా ఆటోమేటెడ్ పద్ధతిలో పనిచేసే ఒక ఆధునిక ప్రజా రవాణా వ్యవస్థ. వీటిని సాధారణంగా పాడ్ ట్యాక్సీలు లేదా పాడ్ కార్లు అని పిలుస్తారు. రోడ్డుపై ఉండే ట్రాఫిక్ రద్దీతో సంబంధం లేకుండా, ప్రత్యేకంగా నిర్మించిన ఎలివేటెడ్ ట్రాక్‌లపై (గైడ్‌వేలపై) ఇవి ప్రయాణిస్తాయి.
వ్యవస్థ ఎలా పనిచేస్తుంది?
సాధారణ బస్సులు లేదా మెట్రో రైళ్లలా నిరీ్ణత సమయాల్లో కాకుండా, ప్రయాణికులకు అవసరమైనప్పుడు మాత్రమే ఇవి అందుబాటులో ఉంటాయి. స్టేషన్‌లోని కియోస్క్ లేదా మొబైల్ యాప్ ద్వారా ప్రయాణికులు తాము వెళ్లాల్సిన స్టేషన్‌ను ఎంచుకుని టికెట్ బుక్ చేసుకోవాలి. ఒక్కో పాడ్‌లో సాధారణంగా 4 నుండి 6 మంది (కొన్ని పెద్ద మోడళ్లలో 20–25 మంది వరకు) ప్రయాణించేందుకు వీలుంటుంది.
అంటే ఇది ఒక వ్యక్తిగత ట్యాక్సీలా పనిచేస్తుంది. మధ్యలో వచ్చే స్టేషన్లలో ఆగకుండా నేరుగా ఎంచుకున్న గమ్యస్థానానికి తీసుకెళ్తుంది. పాడ్ ట్యాక్సీ ప్రధాన ట్రాక్‌కు కాస్త పక్కగా స్టేషన్లు ఉంటాయి. ఒక పాడ్ ట్యాక్సీ స్టేషన్‌లో ఆగినప్పుడు, వెనుక వచ్చే ఇతర పాడ్‌లు ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రధాన ట్రాక్ మీదుగా గమ్యస్థానానికి వెళతాయి.
సెంట్రల్ కమాండ్ సిస్టమ్‌తో సురక్షితంగా..
ఈ వాహనాలు పూర్తిగా బ్యాటరీ లేదా విద్యుత్‌తో నడుస్తాయి. ఇవి అత్యాధునిక సెన్సార్లు, కంప్యూటర్ సెంట్రల్ కమాండ్ సిస్టమ్‌తో ముందున్న వాహనానికి సురక్షిత దూరం పాటిస్తూ, ప్రమాదాలకు ఆస్కారం లేకుండా వేగంగా ప్రయాణిస్తాయి. మెట్రో స్టేషన్ల నుండి ఆఫీసులు లేదా నివాస ప్రాంతాలకు చేరుకోవడానికి ఇది అత్యంత అనువైనది.
(ఉదాహరణకు హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో మెట్రోకు అనుసంధానంగా దీనిని ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది). మధ్యలో స్టాపులు ఉండవు కాబట్టి ప్రయాణ సమయం చాలా తగ్గుతుంది. పూర్తిగా విద్యుత్ లేదా బ్యాటరీతో నడవడం వల్ల కాలుష్యం, శబ్దం ఉండవు.
పనుల మందగమనంపై సీఎం అసంతృప్తి
క్యూర్, ప్యూర్ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులు నిదానంగా జరగడంపై సమీక్షలో సీఎం రేవంత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం మూడేళ్లు పూర్తి చేసుకుని నాలుగో ఏడాదిలో అడుగుపెట్టబోతోందని, పనులన్నీంటినీ ఈ ఏడాదిలోగా పూర్తి చేయాల్సిందేనని అధికారులకు స్పష్టం చేశారు. ఎన్నికలకు ముందు ఐదో ఏడాది పనులు పూర్తి చేసినా ప్రయోజనం ఉండదని అన్నారు. ప్రధానంగా మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు తొలిదశతో పాటు రేడియల్ రోడ్ల నిర్మాణం పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు.
మూసీ పునరుజ్జీవం తొలిదశలో భాగంగా హిమాయత్‌సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 9.20 కి.మీ ప్రాంతాన్ని జోన్–1ఏగా, ఉస్మాన్‌సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 11.8 కి.మీ ప్రాంతాన్ని జోన్–1బీగా విభజించి పనులు చేపట్టనున్నట్లు అధికారులు వివరించారు.
టెండర్ల ప్రక్రియ ప్రారంభమైందని, 2027 జనవరిలో పనులు మొదలు పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. మీరాలం ట్యాంక్ అభివృద్ధి పనుల్లో పురోగతిపై సీఎం ఆరా తీశారు. 2028 జనవరి నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు అధికారులు తెలిపారు. రేడియల్ రోడ్ల నిర్మాణం, భూసేకరణ పురోగతిని వివరించారు. గండిపేట వద్ద నిర్మాణంలో ఉన్న ఆధునిక గోశాల పనులను 2027 మార్చి నాటికి పనులు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు.
కోహెడ ఇంటిగ్రేటెడ్ ఫ్రూట్ మార్కెట్ నిర్మాణంలో నాణ్యత విషయంలో రాజీ పడొద్దని స్పష్టం చేశారు. సీఎంసీ పరిధిలో ఐఐఐటీ జంక్షన్ వద్ద ఫుట్ బ్రిడ్జికి సంబంధించిన డిజైన్లను ముఖ్యమంత్రి పరిశీలించి పలు సూచనలు చేశారు. ఫుట్ బ్రిడ్జి సమీపంలో మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ ఏర్పాటు చేయాలని కోరారు.
చెరువుల పునరుద్ధరణ, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ పురోగతిని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వివరించారు. చెరువుల పునరుద్ధరణలో భాగంగా అవసరమైన చోట ఎస్టీపీల ఏర్పాటును వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. నగరంలో మెట్ల బావుల పునరుద్ధరణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.


