ఎల్‌నినో సృష్టించనున్న కల్లోలం ఇదేనా? | How one of the strongest El Ninos became a global disaster | Sakshi
Sakshi News home page

ఎల్‌నినో సృష్టించనున్న కల్లోలం ఇదేనా?

Oct 6 2026 8:50 PM | Updated on Oct 6 2026 8:53 PM

How one of the strongest El Ninos became a global disaster

ప్రస్తుత ఎల్‌నినో గతంలో నమోదైన అత్యంత తీవ్రమైన ఎల్‌నినోలను మించి ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే భూమి అధిక ఉష్ణోగ్రతలతో ఉన్న పరిస్థితుల్లో ఈ వాతావరణ పరిణామం చోటుచేసుకోవడంతో కరువు, భారీ వర్షాలు, వరదలు, వేడి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. ప్రస్తుత ఎల్‌నినో 1877 నాటి రికార్డును అధిగమించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.    

ఎల్‌నినో అనేది వేల సంవత్సరాలుగా కొనసాగుతున్న సహజ వాతావరణ పరిణామం. పెరూ తీర ప్రాంతంలో సాధారణంగా చల్లగా ఉండే పసిఫిక్‌ సముద్ర జలాలు కొన్ని సంవత్సరాలకు ఒకసారి వేడెక్కడాన్ని స్థానిక మత్స్యకారులు గమనించారు. 1600లలో దీనికి ‘ఎల్‌నినో డి నావిడాడ్‌’ అని పేరు పెట్టారు. స్పానిష్‌లో దీని అర్థం ‘క్రిస్మస్‌ బాలుడు’. సాధారణంగా 2 నుంచి 7 సంవత్సరాల మధ్య ఈ పరిణామం సంభవిస్తుంది.  

ఎల్‌నినో సమయంలో పసిఫిక్‌ సముద్రంలోని వెచ్చని నీరు తూర్పు వైపు కదులుతుంది. దీంతో ఆ ప్రాంతాల్లో వర్షాలు పెరగగా, చల్లని నీరు ఉన్న ప్రాంతాల్లో పొడి పరిస్థితులు ఏర్పడతాయి. ప్రపంచ వాతావరణ వ్యవస్థలు పరస్పరం అనుసంధానమై ఉండటంతో 1 నుంచి 2 డిగ్రీల సముద్ర ఉష్ణోగ్రత మార్పు కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపగలదు. 1877లో సంభవించిన తీవ్రమైన ఎల్‌నినో కారణంగా భారత్‌, ఉత్తర చైనా, ఈశాన్య బ్రెజిల్‌, ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి.

కరవు, ఆహార కొరత, వ్యాధులు 
కరవు, ఆహార కొరత, వ్యాధుల కారణంగా సుమారు 5 కోట్ల మంది మరణించినట్లు అంచనా. పంటల వైఫల్యం ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా అంతర్జాతీయ వాణిజ్యం ద్వారా ప్రపంచవ్యాప్తంగా సంక్షోభంగా మారింది. ప్రస్తుతం ప్రభుత్వాలు, సహాయ సంస్థలు గతంతో పోలిస్తే విపత్తులను వేగంగా ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంచుకున్నాయి.

అయినప్పటికీ ఎల్‌నినో ఆహార ఉత్పత్తి, రవాణా, సరఫరా వ్యవస్థలపై ప్రభావం చూపుతోంది. పనామా కాలువలో నీటి మట్టాలు తగ్గడంతో నౌకల రాకపోకలను తగ్గించాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. వాతావరణ మార్పుల కారణంగా ఇప్పటికే వేడెక్కిన ప్రపంచంలో ఎల్‌నినో ప్రభావం మరింత తీవ్రంగా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు.

అయితే వేడెక్కుతున్న వాతావరణం తీవ్రమైన ఎల్‌నినోలను మరింత తరచుగా కలిగిస్తుందా అనే అంశంపై శాస్త్రవేత్తలు ఇంకా అధ్యయనం చేస్తున్నారు. ఎల్‌నినో ప్రభావం, వాతావరణ మార్పులతో కలసి 2027ను రికార్డుల్లోనే అత్యంత వేడి సంవత్సరంగా మార్చే అవకాశం ఉందని అంచనా ఉంది. ఎల్‌నినోను ఆపడం సాధ్యం కాకపోయినా ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, ఆహార నిల్వలు, ప్రజల రక్షణ చర్యలు, విపత్తుల నిర్వహణ ద్వారా దాని ప్రభావాన్ని తగ్గించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement