అంధుల ఆసియా కప్ ఫైనల్‌పై వివాదం
ప్రదానోత్సవాన్ని బహిష్కరించిన భారత్
ఢాకా: అంధుల ఆసియా కప్ టి20 టోర్నీ ఫైనల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. వర్షం కారణంగా శుక్రవారం భారత్, పాకిస్తాన్ మధ్య జరగాల్సిన ఫైనల్ ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయింది. అయితే టోర్నీలో మెరుగైన రన్‌రేట్ ఉందని చెబుతూ నిర్వాహకులు పాకిస్తాన్‌ను విజేతగా ప్రకటిస్తూ ట్రోఫీ అందజేశారు. దాంతో భారత బృందం నిరసనకు దిగింది. ప్రపంచ అంధుల క్రికెట్ మండలి (డబ్ల్యూబీసీసీ) టెక్నికల్ కమిటీ నిబంధన ప్రకారం వర్షంతో మ్యాచ్ రద్దయితే ఇరు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటించాలి.
అయితే డబ్ల్యూబీసీసీ అధ్యక్షుడు, పాక్ అంధుల క్రికెట్ అధ్యక్షుడు ఒకరే (సుల్తాన్ షా) కావడంతో రిఫరీపై ఒత్తిడి తెచ్చి ఇలా ప్రకటింపజేసారని భారత అంధుల క్రికెట్ సంఘం (సీఏబీఐ) ప్రధాన కార్యదర్శి శైలేంద్ర యాదవ్ తీవ్రంగా విమర్శించారు. నెట్‌రన్‌రేట్ లీగ్ దశకే పరిమితమని, మ్యాచ్ అసలు జరగని చోట ఈ నిబంధనతో విజేతను ఎలా తేలుస్తారని ఆయన ప్రశ్నించారు. తమ నిరసనను ప్రకటిస్తూ ఫైనల్ తర్వాత జరగాల్సిన ప్రదానోత్సవ కార్యక్రమాన్ని భారత్ బహిష్కరించింది.


