సాక్షి,న్యూఢిల్లీ: ఎస్‌ఐఆర్ రద్దు, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని ఆకాశవాణి భవన్ వద్ద కాంగ్రెస్ నేతలు చేపట్టిన నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంక గాంధీ వాద్రా ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు గత 9 గంటలుగా నిరసన దీక్షను కొనసాగిస్తున్నాయి.

మంగళవారం సాయంత్రం ఆకాశవాణి భవన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో, పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. నిరసన విరమించాలని పోలీసులు హెచ్చరించినప్పటికీ, వారు వెనక్కి తగ్గకపోవడంతో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు పలువురు ప్రముఖ కాంగ్రెస్ నేతలను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకుని తరలించారు.

ఈ పరిణామంతో ఆకాశవాణి భవన్ పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసుల చర్యను ఖండిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు.
ఇదీ చదవండి : మీ ఓటు గల్లంతు కానుందా?.. ఎస్‌ఐఆర్ పేరుతో అసలు ఏం జరుగుతోంది?


