రాజకీయ పంతమా?.. కూతురి పెళ్లి ముఖ్యమా? | Sharmila Issue Social Media Comments Viral | Sakshi
Sakshi News home page

రాజకీయ పంతమా?.. కూతురి పెళ్లి ముఖ్యమా?

Nov 22 2026 12:33 PM | Updated on Nov 22 2026 12:57 PM

Sharmila Issue Social Media Comments Viral

సాక్షి, తాడేపల్లి: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల వ్యవహారం మరోసారి రాజకీయ చర్చకు దారితీస్తోంది. ఒకవైపు యలహంక ఆస్తి వివాదం.. మరోవైపు చంద్రబాబుతో రాజకీయ సాన్నిహిత్యంపై విమర్శలు.. ఇంకోవైపు ‘చెట్టపట్టాల్‌’ అనే తెలుగు నుడికారం చుట్టూ రేగిన వివాదం.. ఇలా వరుస పరిణామాలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపుతున్నాయి.

కూతురి పెళ్లి వేళ వివాదాలెందుకు?
ప్రతి తల్లిదండ్రుల కల తమ పిల్లల పెళ్లిని ఎలాంటి వివాదాలు, ఆందోళనలు లేకుండా ప్రశాంతంగా, ఘనంగా జరిపించడం. ముఖ్యంగా కూతురి పెళ్లి విషయంలో తల్లిదండ్రులు ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తారు. అలాంటిది పెళ్లి సమయం దగ్గరపడుతున్న వేళ కుటుంబ వివాదాలు బహిరంగంగా రచ్చకెక్కడం, కోర్టు వ్యవహారాలు తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది.

షర్మిల కుటుంబంలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై సోషల్ మీడియాలో పలువురు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. కూతురి పెళ్లిని సంతోషంగా జరిపించాల్సిన సమయంలో వివాదాలకు ఎందుకు అవకాశం కల్పిస్తున్నారనే చర్చ సాగుతోంది. కుటుంబ సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోకుండా బహిరంగ వివాదాలుగా మార్చడం వల్ల ఇరు కుటుంబాల గౌరవం, పెళ్లి వేడుకపై ఎలాంటి ప్రభావం పడుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. వివాదాలు ఇలాగే కొనసాగితే పెళ్లి సంబంధానికి సంబంధించిన కుటుంబాల మధ్య అనవసరమైన ఒత్తిళ్లు ఏర్పడే అవకాశం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. కూతురి వివాహం జీవితంలో ఒక్కసారి వచ్చే అపురూపమైన వేడుక. అలాంటి సందర్భాన్ని రాజకీయ, కుటుంబ వివాదాలకు దూరంగా ఉంచి ఆనందంగా జరుపుకోవాలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

 

చంద్రబాబుతో సాన్నిహిత్యం..
మరోవైపు చంద్రబాబుతో షర్మిల రాజకీయ సాన్నిహిత్యంపై కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన షర్మిల.. ఇప్పుడు ఆయనకు అనుకూలంగా స్పందిస్తున్నారంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఒకప్పుడు చంద్రబాబును ఉద్దేశించి చేసిన ఘాటు వ్యాఖ్యలను గుర్తుచేస్తూ, ప్రస్తుత రాజకీయ వైఖరిలో మార్పు ఎందుకు వచ్చిందని నిలదీస్తున్నారు.

చంద్రబాబుకు రాజకీయంగా ఇబ్బందులు ఎదురైన సందర్భాల్లో షర్మిల స్పందిస్తున్న తీరు టీడీపీకి అనుకూలంగా మారుతోందా? ఈ పరిణామాల వల్ల చంద్రబాబుకు రాజకీయ ప్రయోజనం కలుగుతోందా? అనే కోణంలోనూ చర్చ జరుగుతోంది. యలహంక ఆస్తి వివాదం, చంద్రబాబుతో షర్మిల సాన్నిహిత్యంపై విమర్శలు, ‘చెట్టపట్టాల్‌’ వివాదం, మంత్రి లోకేశ్ మద్దతు.. ఇలా ఒక్కో అంశం మరో రాజకీయ చర్చకు దారితీస్తోంది. ఒక కుటుంబ వ్యవహారంగా మొదలైన వివాదం క్రమంగా రాజకీయ అంశంగా మారుతోంది.

ఈ నేపథ్యంలో షర్మిల తదుపరి అడుగుపై ఆసక్తి నెలకొంది. కోర్టు ఆదేశాలను గౌరవిస్తూ వివాదానికి దూరంగా ఉంటారా? కుటుంబ గౌరవానికి, కుమార్తె వివాహానికి ప్రాధాన్యత ఇస్తారా? లేక ఈ వ్యవహారం మరింత రాజకీయ చర్చకు దారితీస్తుందా? అన్నది చూడాలి. ఏదేమైనా, కుటుంబ సంతోషకరమైన వేడుకలు రాజకీయ వివాదాలకు వేదిక కాకూడదన్న అభిప్రాయం ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తోంది.

ఇదీ చదవండి: కుటుంబ గౌరవమా? బాబు రాజకీయ ప్రయోజనాలా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement