నామినేషన్ల పరిశీలనలో ప్రైవేటు వ్యక్తి హల్‌చల్‌ | private person interferes in panchayat election nomination scrutiny | Sakshi
Sakshi News home page

నామినేషన్ల పరిశీలనలో ప్రైవేటు వ్యక్తి హల్‌చల్‌

Nov 22 2026 12:54 PM | Updated on Nov 22 2026 1:06 PM

private person interferes in panchayat election nomination scrutiny

అనంతపురం: స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో శనివారం నిర్వహించిన నామినేషన్ల పరిశీలనలో ప్రవేటు వ్యక్తి హల్‌చల్‌ చేశారు. అంతా తానై నామినేషన్లు తరస్కరించామని సంతకం తీసుకెళ్లాలంటూ సర్పంచ్‌ అభ్యర్థులను బెదిరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వివరాలు.. గుమ్మనూరు వర్గీయుల గుండాయిజంతో పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుతో నామినేషన్‌ వేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఈనేపథ్యంలో  బీబీఎస్‌ సోదరులు బీ రుక్మాన్, బీ ఆసిఫ్‌ వైఎస్సార్‌సీపీ మద్దతుతో ఎన్నికల్లో పోటీ చేయాలని భావించారు.

హైకోర్టు ఆదేశాలతో ఈనెల 18న నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం రోజునే అనంతపురం డీఎస్పీ కరుణాకర్‌ నేతృత్యంలో సీఐ బీ మనోహర్, పోలీసుల ఎస్కార్ట్‌తో బీ రుక్మాన్‌ భార్య  బీ తహేర, బీ ఆసిఫ్‌ భార్య బీ అమ్రిన్‌ పామిడి సర్పంచ్‌ స్థానానికి ఒక్కో సెట్‌ చొప్పున నామినేషన్‌ వేశారు.  భర్తలైన వారే తమ భార్యల అభ్యరి్థత్వాన్ని బలపర్చగా, వారి కుమారుడు బీ ఇమ్రాన్‌ సాక్షిగా సంతకాలు చేశారు. అందులో వారు తమ ఇంటి రశీదు, ఆస్తి సమగ్ర డాక్యుమెంట్లతో కూడిన నామినేషనపత్రాలను సమర్పించారు. చెక్‌లిస్ట్‌లో సైతం అన్నీ ఉన్నట్లు నామినేషన్‌ స్వీకరణ అధికారులు టిక్‌ చేసుకున్నారు. 

నామినేషన్‌ పత్రాలు మాయం.. 
నామినేషన్ల పరిశీలన సందర్భంగా పోలీస్‌ ఎస్కార్ట్‌ ఇవ్వాలని బీ రుక్మాన్, బీ ఆసిఫ్‌ స్థానిక పోలీసులను కోరారు. అయితే సీఐ మనోహర్‌ మాత్రం మీ ఇద్దరు అన్నదమ్ములు మినహా ఎవరైనా ఇద్దరు కుటుంబ సభ్యులను మీ ఆడవారివెంట పంపాలని చెప్పారు. దీంతో వారు తమ కుమారుడు బీ ఇమ్రాన్, అల్లుడు తోసిఫ్‌ను వారి వెంట పంపారు. అయితే నామినేషన్ల పరిశీలనలో ఓ ప్రైవేటు వ్యక్తి సాక్షి సంతకాలు, ఇంటి రశీదు, ఆస్తి సమగ్ర వివరాలు సరిగా లేవని నామినేషన్‌ తిరస్కరిస్తున్నట్లు ప్రకటించడంతోపాటు సంతకం చేసి నామినేషన్‌ పత్రాలు తీసుకోవాలంటూ బెదిరించాడు. చివరకు వారితో బలవంతంగా సంతకాలు చేయించుకుని అక్కడి నుంచి పంపేశాడు. 

గుంతకల్లు నియోజకవర్గ పోలీసులకు రూ.2కోట్లు ఎర?  
గుంతకల్లు నియోజకవర్గంలో ప్రాదేశిక, పంచాయతీ ఎన్నికల్లో అధికార పారీ్టకి పూర్తిగా సహకరించాలని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పోలీసులకు రూ.2 కోట్లు ఇచ్చినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఒక్కో పోలీస్‌స్టేషన్‌కు రూ.20 లక్షల చొప్పున చేరినట్లు తెలుస్తోంది. ఈక్రమంలోనే పోలీసులు అధికార పార్టీకి పూర్తిగా సహకరిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement