స్క్రూటినీకి వెళ్లిన జనసేన నేతలపై రాళ్లతో వెంటపడ్డ టీడీపీ మూకలు
పరుగులు తీస్తూ గుండెపోటుకు గురై కుప్పకూలిన జనసేన కార్యకర్త
ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి
మృతదేహంతో రోడ్డుపై బైఠాయించిన బంధువులు, పార్టీ శ్రేణులు
లాఠీలతో చితకబాదించిన డీఎస్పీ మురళీనాయక్
చక్రాయపేట( వైఎస్‌ఆర్ కడప జిల్లా): పదవుల దాహంతో టీడీపీ గూండాలు చేసిన అరాచకానికి జనసేన కార్యకర్త బలయ్యాడు. వివరాల్లోకెళ్తే.. సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా వైఎస్సార్ కడప జిల్లా, చక్రాయపేట మండలంలోని సురభి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా జనసేన మద్దతుదారుడిగా జలపాతి నాగమల్లయ్య నాగలగుట్టపల్లె సచివాలయంలో నామినేషన్ వేశాడు. టీడీపీ మండల ఇన్‌చార్జ్ మహేశ్వరరెడ్డి నామినేషన్ పరిశీలనకు బీటెక్ రవి, ఎమ్మెల్యే రామగోపాల్‌రెడ్డిలను రప్పించుకొని నామినేషన్ కేంద్రం వద్ద హల్‌చల్ చేశాడు.
దీంతో ఉదయం నుంచి టీడీపీ గూండాలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని వైఎస్సార్‌సీపీ మద్దతుదారుడితో పాటు జనసేన నేతలను కూడా రానివ్వకుండా వారి నామినేషన్‌ను ఏకగ్రీవం చేసుకునేందుకు కుట్ర పన్నారు. సాయంత్రం జనసేన నేతలు పరిస్థితిని పార్టీ నాయకులకు చెప్పడంతో పార్టీ నేతలు నామినేషన్ కేంద్రం వద్దకు వచ్చారు. దీంతో టీడీపీ నేతలు రాళ్లతో వారి వెంట పడ్డారు.
జనసేన సర్పంచ్ అభ్యర్థి బంధువు ముంతల వీరాంజనేయులు(55) పరుగుతీస్తుండగా ఆయనకు గుండెపోటు వచ్చింది. దీంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలించే క్రమంలో మార్గమధ్యలో మృతి చెందాడు. మృతదేహాన్ని రోడ్డుపై ఉంచి బంధువులు, జనసేన కార్యకర్తలు ధర్నాకు దిగారు. చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

పోలీసుల లాఠీచార్జ్
వీరాంజనేయులు మృతదేహంతో నాగలగుట్టపల్లె రోడ్డుపై బైఠాయించిన జనసేన శ్రేణులపై పులివెందుల డీఎస్పీ మురళీనాయక్ ఆధ్వర్యంలో పోలీసులు విచక్షణా రహితంగా లాఠీచార్జ్ చేశారు. జాతీయ రహదారిపై ఎలా కూర్చుంటారంటూ జనసేన జిల్లా అధ్యక్షుడు సుంకర శ్రీనివాసులుపై దాడి చేసి, బలవంతంగా అరెస్టు చేశారు. పవన్ కళ్యాణ్ మాటలను నమ్మి పొత్తులో ధర్మంగా టీడీపీకి సహకరిస్తున్నందుకు మా బూట్లతో మేమే కొట్టుకుంటున్నాం అంటూ జనసేన రాజంపేట ఇన్‌చార్జి హరిరాయల్ తన కాలి బూట్లతో తానే కొట్టుకున్నాడు.
ఇదీ చదవండి: లోకేశ్ పోస్టుకు తమిళ మంత్రి పంచ్


