5 సెకన్లలో ఐదుసార్లు చెంపదెబ్బలు | officer was allegedly assaulted and subjected to casteist slurs by a woman | Sakshi
Sakshi News home page

5 సెకన్లలో ఐదుసార్లు చెంపదెబ్బలు

Nov 22 2026 5:15 PM | Updated on Nov 22 2026 5:17 PM

  officer was allegedly assaulted and subjected to casteist slurs by a woman

హరియాణా: విధుల్లో ఉన్న మహిళా వ్యవసాయ అధికారిపై మరో మహిళ దాడికి పాల్పడింది. కేవలం 5 సెకన్ల వ్యవధిలో ఐదుసార్లు చెంపదెబ్బలు కొట్టడంతోపాటు కులం పేరుతో దూషించినట్లు బాధితురాలు ఫిర్యాదు చేసింది. హరియాణాలోని చర్ఖీ దాద్రీలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు ఇద్దరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదు.

పోలీసులకు అందిన ఫిర్యాదు ప్రకారం.. మహేంద్రగఢ్ జిల్లాకు చెందిన బాధితురాలు చర్ఖీ దాద్రీలోని లోహారు రోడ్డులో ఉన్న వ్యవసాయ శాఖ కార్యాలయంలో వ్యవసాయ అభివృద్ధి అధికారిగా పనిచేస్తున్నారు. ఆమె విధుల్లో ఉండగా ఝోజు కలాన్ గ్రామానికి చెందిన మమత అనే మహిళ ఓ న్యాయవాదితో కలిసి అక్కడికి వచ్చింది. కార్యాలయంలోనే బాధితురాలితో వాగ్వాదానికి దిగింది.

ఈ క్రమంలో మమత తనను అసభ్య పదజాలంతో దూషించిందని, కులాన్ని ప్రస్తావిస్తూ అవమానించిందని బాధితురాలు ఆరోపించారు. తాను కార్యాలయంలో కూర్చున్న సమయంలో తనను కొనగలనంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. మమత ప్రవర్తన, మాటతీరుపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆమె దాడికి దిగినట్లు తెలిపారు. సుమారు 5 సెకన్లలో ఐదుసార్లు చెంపదెబ్బలు కొట్టిందని వెల్లడించారు.

ఆసుపత్రికి తరలించి చికిత్స 
ఈ దాడిలో గాయపడిన అధికారికి వైద్య చికిత్స అవసరమైంది. ఘటన సమయంలో మమతతో పాటు వచ్చిన న్యాయవాది కూడా అక్కడే ఉన్నారని, ఆయన సైతం తనతో అనుచితంగా ప్రవర్తించారని బాధితురాలు ఆరోపించారు. అనంతరం ఆమెను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఆ తర్వాత పోలీసులను ఆశ్రయించి నిందితులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.

బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా చర్ఖీ దాద్రీ సిటీ పోలీస్ స్టేషన్‌లో మమత సహా ఇద్దరు పేర్లతో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఎస్సీ, ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టంలోని నిబంధనలతోపాటు ఇతర సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు వ్యక్తిగత వివాదమే కారణమని ప్రాథమికంగా పేర్కొంటున్నప్పటికీ, దాడి, కులపరమైన దూషణల ఆరోపణల నేపథ్యంలో పోలీసులు చట్టపరమైన చర్యలు చేపట్టారు.

సిటీ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ ఇన్‌స్పెక్టర్ దేవేందర్ మాన్ మాట్లాడుతూ.. కేసు నమోదు చేశామని, ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని తెలిపారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని, విచారణలో ఎవరికి బాధ్యత ఉన్నట్లు తేలినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. నిందితులను వీలైనంత త్వరగా అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తామని వెల్లడించారు. దర్యాప్తులో ఆరోపణలు నిర్ధారణ అవుతాయా? నిందితులపై తదుపరి చర్యలు ఎప్పుడు ఉంటాయన్నది వేచి చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement