చెన్నై: తమ పెళ్లి సంబరాలను ఉద్యోగులతోనూ పంచుకున్నారు కావ్యా మారన్. ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్‌ను వివాహం చేసుకున్న సందర్భంగా సన్ గ్రూప్ ఉద్యోగులకు ఆమె అందించిన కానుకలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. చాక్లెట్లు, పెళ్లి ఆహ్వాన పత్రికతో పాటు ఏకంగా బంగారు ఉంగరాలను గిఫ్ట్‌గా అందించి ఉద్యోగులను ఆశ్చర్యపరిచారు.
ఓ ఉద్యోగి ఎక్స్‌లో షేర్ చేసిన వీడియోతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రత్యేకంగా రూపొందించిన గిఫ్ట్ బాక్సుల్లో చాక్లెట్లు, ఆహ్వాన పత్రిక, బంగారు ఉంగరం ఉన్నాయి. తొలుత తమకు బంగారు నాణేలు ఇస్తారని ఉద్యోగులు భావించారట. అయితే బాక్సులు తెరిచి చూడగానే ఉంగరాలు కనిపించడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
#KavyaMaran gifted gold ring to all the sun group employees. https://t.co/JbLPT2SpVr
— CineAura (@CineAuraX) November 20, 2026
ఇదే ఆహ్వాన పత్రికలో నవంబర్ 25న ఉద్యోగుల కోసం ప్రత్యేక విందు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అయితే ఉంగరాల బరువు, విలువ, ఎంతమంది ఉద్యోగులకు అందించారన్న వివరాలు వెల్లడికాలేదు. కావ్యా, అనిరుధ్ నవంబర్ 11న గ్రీస్‌లో పెరియార్ స్వాభిమాన వివాహ పద్ధతిలో ఒక్కటయ్యారు. ఈ వేడుకకు రజనీకాంత్, ఎంకె స్టాలిన్ సహా ప్రముఖులు హాజరయ్యారు. నవంబర్ 21న చెన్నైలో ఘనంగా రిసెప్షన్ నిర్వహించారు. సన్ టీవీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓ అయిన కావ్యా మారన్.. ఉద్యోగులకు ఇచ్చిన ఈ ప్రత్యేక కానుకలతో ఇప్పుడు మళ్లీ వార్తల్లో నిలిచారు.
ఇదీ చదవండి: ముందు అప్పులు.. ఆపై ప్రపంచ యాత్ర!


