ఉత్తరప్రదేశ్‌లోని ఏటా జిల్లాలో సామూహిక వివాహ కార్యక్రమంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. తనకు విడాకులు ఇవ్వకుండానే భర్త మరో పెళ్లికి సిద్ధమయ్యాడంటూ మొదటి భార్య అక్కడికి చేరుకుని పెళ్లిని అడ్డుకుంది. దీంతో వివాహ వేడుక నిలిచిపోగా, 26 ఏళ్ల వరుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
సాకీత్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి తన కుమార్తెకు వివాహం చేసేందుకు ప్రభుత్వ సామూహిక వివాహ కార్యక్రమానికి దరఖాస్తు చేసుకున్నాడు. ఆన్‌లైన్ దరఖాస్తుతో పాటు అవసరమైన ఇతర ప్రక్రియలను కూడా పూర్తి చేశాడు. కార్యక్రమంలో భాగంగా పెళ్లి వేడుక ప్రారంభమై, వధూవరులు వేదికపై కూర్చున్నారు. వరుడు వధువు నుదుటన సింధూరం కూడా పెట్టాడు. ఇంతలో అక్కడికి చేరుకున్న ఓ మహిళ.. వరుడికి అప్పటికే తనతో వివాహమైందని, చట్టబద్ధంగా విడాకులు తీసుకోకుండానే మరో పెళ్లి చేసుకుంటున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అంతేకాకుండా ప్రభుత్వ సామూహిక వివాహ పథకం కింద లభించే ప్రయోజనాలను మోసపూరితంగా పొందేందుకు తన భర్త ప్రయత్నిస్తున్నాడని ఆరోపించింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే వివాహ వేదిక వద్దకు చేరుకుని వేడుకను నిలిపివేశారు. అనంతరం వరుడిని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.
వధువు తండ్రి ఈ ఘటనపై స్పందిస్తూ.. వరుడికి గతంలోనే వివాహమైందన్న విషయం తనకు తెలియదని తెలిపాడు. సుమారు ఐదేళ్ల క్రితం ఇరు కుటుంబాల మధ్య వివాహ సంబంధం గురించి చర్చలు జరిగాయని, అయితే కట్నం డిమాండ్ల కారణంగా ఆ సంబంధం ముందుకు సాగలేదని వివరించాడు.
మరోవైపు, తన భర్త మరహ్రా ప్రాంతానికి చెందిన వ్యక్తి అని భార్య వెల్లడించింది. 2021 నవంబర్ 14న తమకు వివాహమైనట్లు తెలిపింది. గత మూడేళ్లుగా కుటుంబ వివాదానికి సంబంధించి కోర్టులో కేసు నడుస్తోందని పేర్కొంది. ఇటీవల తన భర్త సామూహిక వివాహ కార్యక్రమంలో మరో పెళ్లికి సిద్ధమవుతున్నట్లు తెలుసుకుని, దాన్ని అడ్డుకునేందుకు అక్కడికి వచ్చినట్లు వివరించింది.
విడాకులు లేకుండానే రెండో వివాహానికి ప్రయత్నించడంతో పాటు ప్రభుత్వ పథకాన్ని దుర్వినియోగం చేసేందుకు భర్త యత్నిస్తున్నాడని ఆమె ఆరోపించింది. ప్రస్తుతం పోలీసులు వరుడిని విచారిస్తూ, మొదటి భార్య చేసిన ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ విచారణలో వివాహానికి సంబంధించిన వాస్తవాలు, ప్రభుత్వ పథకం ప్రయోజనాలను పొందేందుకు ఎలాంటి అక్రమాలకు పాల్పడ్డారనే అంశాలు తేలాల్సి ఉంది.


