ఎస్‌ఐఆర్ పేరుతో అసలు ఏం జరుగుతోంది? | what is special intensive revision in election | Sakshi
Sakshi News home page

ఎస్‌ఐఆర్ పేరుతో అసలు ఏం జరుగుతోంది?

Oct 6 2026 7:53 PM | Updated on Oct 6 2026 9:14 PM

what is special intensive revision in election

న్యూఢిల్లీ: ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటరు జాబితాయే పునాది. దేశంలో పారదర్శకమైన, నిష్పాక్షికమైన ఎన్నికలు జరగాలంటే ఓటరు జాబితా దోషరహితంగా ఉండటం అత్యంత ముఖ్యం. ఈ నేపథ్యంలోనే భారత ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ప్రక్షాళన కోసం ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ (ఎస్‌ఐఆర్‌) అనే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అయితే, ఏడాదో రెండేళ్లకో జరిగే సాధారణ వార్షిక సవరణలకు భిన్నంగా, ఏకంగా ఇంటింటి సర్వేతో కూడిన ఈ భారీ కసరత్తును ఇప్పుడు తెరపైకి తీసుకురావడంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అధికార, విపక్షాల మధ్య దీనిపై మాటల యుద్ధం నడుస్తోంది.

సాధారణంగా ప్రతి ఏటా ఓటరు జాబితా సవరణ తంతు నామమాత్రంగా సాగిపోతుంటుంది. కొత్త ఓటర్ల చేరిక, చనిపోయిన వారి తొలగింపు ఎప్పటికప్పుడు జరిగే ప్రక్రియే. అయితే, ఇప్పుడు దేశవ్యాప్తంగా దశలవారీగా ‘ఇంటెన్సివ్ రివిజన్’ పేరుతో కఠిన నిబంధనలను అమలు చేయడంపై విభిన్న వాదనలు వినిపిస్తున్నాయి

కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ వంటి విపక్షాలు ఈ ఎస్‌ఐఆర్ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పు  బడుతున్నాయి. ఓటర్ల జాబితాల ప్రక్షాళన ముసుగులో పేదలు, వలస కార్మికులు, మైనారిటీలు, తమకు వ్యతిరేకంగా ఓటు వేస్తారనే వర్గాల పేర్లను నియోజకవర్గాల వారీగా తొలగించేందుకు  ఈ కుట్ర జరుగుతోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. పత్రాల పేరుతో నిబంధనలు కఠినతరం చేసి, అర్హులైన సామాన్యులను ఓటు హక్కుకు దూరం చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు,ఈ విమర్శలను ఈసీ పూర్తిగా తోసిపుచ్చుతోంది. కాలం మారుతున్న కొద్దీ దొంగ ఓట్లు, ఒకే వ్యక్తికి వేర్వేరు ప్రాంతాల్లో ఓట్లు ఉండటం  భారీగా పెరిగిపోయాయని, ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలగాలంటే ఈ ప్రక్షాళన అత్యంత అనివార్యమని ఈసీ స్పష్టం చేస్తోంది. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారమే పారదర్శకత కోసం దీన్ని చేపట్టినట్లు చెబుతోంది.

అసలేమిటీ ఎస్ఐఆర్ ?
ఎస్‌ఐఆర్‌‌ అనగా ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’. ఇది భారత ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ఓటరు జాబితాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రక్షాళన చేయడానికి చేపట్టే సమగ్ర ప్రక్రియ. దీని ద్వారా బూత్ లెవల్ అధికారులు నేరుగా ప్రతి ఇంటికీ వెళ్లి ఓటర్ల వివరాలను సేకరిస్తారు, సరి చూస్తారు.

ఓటరు జాబితాలు ఎందుకు సవరిస్తారు?
ఓటరు జాబితాలను ఎల్లప్పుడూ ఖచ్చితంగా, పారదర్శకంగా ఉంచడానికి ఈ సవరణ చాలా ముఖ్యం. 
ఒకే వ్యక్తి పేరు వేర్వేరు చోట్ల ఉండటం లేదా మరణించిన వారి పేర్లు ఇంకా జాబితాలో కొనసాగడం వంటి లోపాలను సరిదిద్దడానికి.
ఉద్యోగాలు, ఉపాధి లేదా ఇతర కారణాల వల్ల శాశ్వతంగా వేరే ప్రాంతాలకు వలస వెళ్లిన వారి పేర్లను పాత జాబితా నుంచి తొలగించడానికి.
18 సంవత్సరాలు నిండిన కొత్త ఓటర్ల పేర్లను జాబితాలో చేర్చడానికి.
ప్రజాస్వామ్యంలో ప్రతి అర్హులైన పౌరుడికి ఓటు హక్కు కల్పించడం, అనర్హుల పేర్లతో జాబితా అస్తవ్యస్తం కాకుండా కాపాడడం దీని ముఖ్య ఉద్దేశం.

దీనికి సమాచారాన్ని ఎవరు ఇవ్వాలి?
బూత్ లెవల్ ఆఫీసర్ మీ ఇంటికి వచ్చినప్పుడు, ఇంటి యజమాని లేదా అర్హులైన ఓటర్లు తమ సరైన వివరాలను, పౌరసత్వాన్ని, నివాసాన్ని నిర్ధారించే పత్రాలను (ఎన్యుమరేషన్ ఫారంలో) అందించాలి. ఒకవేళ ఎవరైనా ఇతర ప్రాంతాల్లో నివసిస్తుంటే, ఎన్నికల సంఘం అధికారిక పోర్టల్ (voters.eci.gov.in) ద్వారా ఆన్‌లైన్‌లో కూడా తమ సమాచారాన్ని సమర్పించవచ్చు.

ఈసీ ఈ నిర్ణయం వెనుక అసలు ఉద్దేశం ఏమిటి?
కాలం మారుతున్న కొద్దీ ఉపాధి కోసం ప్రజలు గ్రామాల నుంచి పట్టణాలకు, ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి పెద్ద ఎత్తున వలస వెళ్తున్నారు. దీనివల్ల పాత ఓటరు జాబితాలలో చిరునామాలు తప్పుగా మారడం లేదా ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఓట్లు ఉండటం జరుగుతోంది. వీటిని సరిచేయడం ఈసీ ప్రధాన విధి.

సాధారణ వార్షిక సవరణల ద్వారా కేవలం దరఖాస్తు చేసుకున్న వారిని మాత్రమే మారుస్తారు. కానీ, క్షేత్రస్థాయిలో ఏళ్ల తరబడి అప్‌డేట్ కాని లోపాలను సరిదిద్దడానికి ఇంటింటి సర్వేతో కూడిన ఈ సమగ్ర సవరణ అత్యంత అవసరమని ఈసీ భావించింది. ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు నమ్మకం సడలకుండా ఉండాలంటే ఓటరు జాబితా దోషరహితంగా ఉండాలి. అక్రమంగా చొరబడిన విదేశీ వలసదారులు లేదా అనర్హుల పేర్లు జాబితాలో చేరకుండా నిరోధించడానికి ఈ ప్రక్షాళన దోహదపడుతుంది. ఎలాంటి తప్పులు లేని పవిత్రమైన ఓటరు జాబితా ఉంటేనే దేశంలో స్వేచ్ఛా యుతమైన, నిష్పాక్షికమైన ఎన్నికలు నిర్వహించడం సాధ్యమవుతుంది. అందుకే ఈసీ దేశవ్యాప్తంగా దశలవారీగా ఈ బృహత్తర కార్యక్రమాన్ని అమలు చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement