సబ్బులో ఇనుప బ్లేడ్.. స‍్నానం చేస్తుండగా కోసుకుని గాయాలు | Gwalior family finds iron blade inside soap | Sakshi
Sakshi News home page

సబ్బులో ఇనుప బ్లేడ్.. స‍్నానం చేస్తుండగా కోసుకుని గాయాలు

Nov 22 2026 9:28 PM | Updated on Nov 22 2026 9:28 PM

Gwalior family finds iron blade inside soap

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో డెట్టాల్ సబ్బులో ఇనుప బ్లేడ్ బయటపడిన ఘటనలో వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ కీలక తీర్పు ఇచ్చింది. సబ్బు తయారీ సంస్థ రెకిట్ ఇండియా రూ.50,000 పరిహారం చెల్లించాలని ఆదేశించింది. సంబంధిత దుకాణదారుడు, పంపిణీదారుడు (డిస్ట్రిబ్యూటర్) ఒక్కొక్కరు రూ.2,000 చొప్పున చెల్లించాలని స్పష్టం చేసింది. నాణ్యతా తనిఖీల్లో లోపాల కారణంగా చిన్నారి ఆరోగ్యానికి ముప్పు ఏర్పడిందని కమిషన్ అభిప్రాయపడింది.

గ్వాలియర్‌కు చెందిన అంగద్ సింగ్ తోమర్ 2025 మే 21న మోహిత్ కిరాణా దుకాణంలో డెట్టాల్ సబ్బు కొనుగోలు చేశారు. ఆయన మైనర్ కుమారుడు స్నానం చేస్తుండగా ఆ సబ్బుతో చెంపకు గాయమైంది. పరిశీలించగా సబ్బులో పదునైన ఇనుప బ్లేడ్ కనిపించింది. దీంతో తోమర్ దుకాణదారుడికి ఫిర్యాదు చేయగా, అతడు మరో సబ్బును ఇచ్చాడు. అయితే ఆ కొత్త సబ్బులోనూ మరో బ్లేడ్ కనిపించడంతో కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతికి గురయ్యారు.

ఈ విషయంపై 2025 మే 27న జాతీయ వినియోగదారుల సహాయ కేంద్రానికి తోమర్ ఫిర్యాదు చేశారు. సమస్యకు సరైన పరిష్కారం లభించలేదని పేర్కొంటూ అదే ఏడాది జూన్ 17న గ్వాలియర్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ను ఆశ్రయించారు. శారీరక, మానసిక ఇబ్బందులకు రూ.3.5 లక్షలు, న్యాయపరమైన ఖర్చుల కోసం మరో రూ.50,000 పరిహారం ఇవ్వాలని కోరారు.

దుకాణదారుడు తన వాదనలో తాను కేవలం సబ్బును విక్రయించానని, పంపిణీదారుడి నుంచి కొనుగోలు చేశానని తెలిపాడు. మరోవైపు తయారీ సంస్థ రెకిట్ ఇండియా తమ ఉత్పత్తి ప్రక్రియలో కఠినమైన నాణ్యతా తనిఖీలు నిర్వహిస్తామని పేర్కొంది. సబ్బుల్లో లోహపు వస్తువులను గుర్తించి తొలగించేందుకు రెండు మెటల్ డిటెక్టర్లను ఉపయోగిస్తున్నట్లు తెలిపింది. అదే బ్యాచ్‌కు చెందిన 21 సబ్బులను దుకాణదారుడి నుంచి కొనుగోలు చేసి, వాటిలో 14 సబ్బులను ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ గుర్తింపు పొందిన ప్రయోగశాలలో పరీక్షించగా ఎలాంటి లోపం కనిపించలేదని వాదించింది.

ఉద్దేశపూర్వకంగా చొప్పించి ఉండవచ్చు: సంస్థ 
అయితే సబ్బులోకి బ్లేడ్‌ను ఉద్దేశపూర్వకంగా చొప్పించి ఉండవచ్చని సంస్థ పేర్కొంది. ఈ వాదనను సమర్థించే విశ్వసనీయ ఆధారాలు లేవని కమిషన్ స్పష్టం చేసింది. ఫిర్యాదుదారుడికి విక్రయించిన నిర్దిష్ట సబ్బుపై నాణ్యతా పరీక్షలు నిర్వహించినట్లు తయారీ సంస్థ నిరూపించలేకపోయిందని పేర్కొంది. సబ్బును గడ్డకట్టించి, ప్యాకింగ్ చేసి విక్రయానికి సిద్ధం చేసిన తర్వాత తనిఖీలు నిర్వహించినట్లు కూడా ఆధారాలు సమర్పించలేదని తెలిపింది. అదే బ్యాచ్‌లోని ఇతర సబ్బులను పరీక్షించినంత మాత్రాన లోపం ఉన్న సబ్బులో ఇతర వస్తువు లేదని నిర్ధారించలేమని అభిప్రాయపడింది.

2026 నవంబర్ 17న వెలువరించిన తుది ఉత్తర్వుల్లో రెకిట్ ఇండియా 45 రోజుల్లో రూ.50,000 పరిహారం చెల్లించాలని కమిషన్ ఆదేశించింది. దుకాణదారుడు, పంపిణీదారుడు ఒక్కొక్కరు రూ.2,000 చొప్పున, తయారీ సంస్థ న్యాయపరమైన ఖర్చుల కింద మరో రూ.2,000 చెల్లించాలని పేర్కొంది. నిర్ణీత గడువులోగా పరిహారం చెల్లించకపోతే ఆ మొత్తాలపై ఏటా 6 శాతం వడ్డీ వర్తిస్తుందని స్పష్టం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement