సీఎం రేవంత్‌రెడ్డికి రూ.5.17 కోట్ల చెక్కును అందజేస్తున్న జున్నా సోలార్ సిస్టమ్స్ సీఎండీ శేఖర్‌రెడ్డి, సీఈవో అనిల్‌బాబు. చిత్రంలో పొంగులేటి
అత్యంత జాగ్రత్త వహించాలి: సీఎం రేవంత్‌రెడ్డి
బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్‌కు రెండు కంపెనీల ఆర్థిక సాయం
సీఎం సమక్షంలో హరేకృష్ణ ఫౌండేషన్‌కు చెక్కులు
సాక్షి, హైదరాబాద్: ‘బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్ జీవితకాలం కొనసాగే కార్యక్రమం. కాబట్టి అత్యంత జాగ్రత్త వహించాలి’అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బ్రేక్‌ఫాస్ట్ వల్ల విద్యార్థులు సమయానికి పాఠశాలకు చేరుకుంటారని అభిప్రాయపడ్డారు. అందుకే ఆహార నాణ్యత విషయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్ కోసం హరేకృష్ణ ఫౌండేషన్‌తో సీఎం సమక్షంలో జున్నా సోలార్ సిస్టమ్స్, చైన్ ల్యాబ్స్ ఇండియా శుక్రవారం ఒప్పందం చేసుకున్నాయి. ఆధునిక సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ల ఏర్పాటుకు ఈ సంస్థలు సహకారం అందిస్తున్నాయి.
నాగర్‌కర్నూల్‌లో కిచెన్ కోసం రూ.5.17 కోట్ల చెక్కును జున్నా సోలార్ సిస్టమ్స్ సీఎండీ శేఖర్‌రెడ్డి, సీఈవో అనిల్‌బాబు, వికారాబాద్‌లో కిచెన్ నిర్మాణం కోసం రూ.4 కోట్ల చెక్కును చైన్ ల్యాబ్స్ ఇండియా ప్రతినిధి సుమంత డే, వైస్ ప్రెసిడెంట్ బుగత సంతోష్ కుమార్ సీఎం చేతుల మీదుగా హరేకృష్ణ ఫౌండేషన్‌కు అందించారు. ప్రాంతాల వారీగా విద్యార్థుల అలవాట్లకు అనుగుణంగా బ్రేక్‌ఫాస్ట్ తయారు చేయాలని సీఎం సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల ట్రాక్ రికార్డును నిర్వహించాలని, విద్యార్థుల శారీరక పెరుగుదల, విద్యా పురోగతి వంటి అంశాలను ఎప్పటికప్పుడు రికార్డు చేయాలన్నారు.
ఆహారంలో ఇచ్చే పదార్థాల క్యాలరీలను లెక్కించడానికి యాప్‌లను ఉపయోగించుకోవాలని సూచించారు. సెంట్రల్ కిచెన్లను కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేస్తామని తెలిపారు. నవంబర్ 30లోగా సెంట్రల్ కిచెన్లు పూర్తి కావాలని స్పష్టంచేశారు. డిసెంబర్ 9న రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి సెంట్రల్ కిచెన్లను ప్రారంభిస్తామని చెప్పారు. ఈ కిచెన్లను విద్యార్థులు సందర్శించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్, హరేకృష్ణ ఫౌండేషన్ ప్రతినిధి సత్య గౌర చంద్రదాస్ స్వామీజీ పాల్గొన్నారు.


