తెలంగాణలో సేకరిస్తున్న టీజీఐఐసీ
ఇప్పటికే సంస్థ చేతికి 8,080 ఎకరాలు
హాట్‌బెల్ట్‌గా హైదరాబాద్, పొరుగు జిల్లాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా పరిశ్రమల స్థాపనకు అనుకూలంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి భారీఎత్తున భూ సేకరణకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మొత్తం 22 జిల్లాల్లో భూసేకరణ ప్రక్రియను ప్రారంభించింది. తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీజీఐఐసీ) 2023 డిసెంబర్ నుంచి 2026 జూన్ మధ్య రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 27,500 ఎకరాలకుపైగా భూమి కావాలంటూ రెవెన్యూ శాఖకు ప్రతిపాదించింది. ఈ రెండున్నరేళ్ల కాలంలో టీజీఐఐసీ మొత్తం 8,080 పైచిలుకు ఎకరాలను సేకరించింది.
డిమాండ్ హైదరాబాద్ చుట్టూ..
హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో పరిశ్రమల స్థాపనకు పెద్దఎత్తున భూములకు డిమాండ్ పెరిగింది. ఖరీదైనప్పటికీ ఈ ప్రాంతాల్లో స్థలం కోసం తయారీ, ఈ–కామర్స్, టెక్నాలజీ కంపెనీలు పోటీపడుతున్నాయి. డిఫెన్స్, ఏరోస్పేస్ సంస్థలకు విడిభాగాలను సరఫరా చేస్తున్న కంపెనీలతోపాటు ఫార్మా, ప్లాస్టిక్, ఎఫ్‌ఎంసీజీ రంగ సంస్థల నుంచి సైతం పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి.
ఈ–కామర్స్ కంపెనీలు భారీ స్థాయిలో గిడ్డంగులను నెలకొల్పుతున్నాయి. మరోవైపు డేటా సెంటర్ల స్థాపనకు దిగ్గజ సంస్థలు క్యూ కడుతున్నాయి. దీంతో రాష్ట్రంలో ఇతర జిల్లాలతో పోలిస్తే హైదరాబాద్‌కు చుట్టుపక్కల ఉన్న, రాజధానికి సమీపంలోని జిల్లాల్లో అధిక మొత్తంలో భూసేకరణకు టీజీఐఐసీ ప్రయత్నిస్తోంది. వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కలిపి 10,000కుపైగా ఎకరాలను సేకరిస్తోందంటే ఈ ప్రాంతంలో ఉన్న డిమాండ్‌ను అర్థం చేసుకోవచ్చు.
కంపెనీలకు 2,400 ఎకరాలు అప్పగింత
తెలంగాణలో 2023 డిసెంబర్ నుంచి 2026 జూన్ వరకు 1,140కిపైగా కంపెనీలు పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చాయి. ఇవి మొత్తం రూ.94 వేల కోట్లకుపైగా పెట్టుబడి ప్రతిపాదనలు చేశాయి. ఈ కంపెనీలకు 2,400 ఎకరాలను టీజీఐఐసీ అప్పగించింది. ప్రభుత్వం నుంచి భూమి పొందిన ఈ సంస్థలు 85 వేల మందికి ఉపాధి అవకాశాలను కల్పిస్తామని తమ పెట్టుబడి ప్రణాళికల్లో రాష్ట్రానికి ప్రతిపాదించాయి. పారిశ్రామిక పెట్టుబడులలో రంగారెడ్డి జిల్లా అగ్రస్థానంలో ఉంది. నల్లగొండ, సంగారెడ్డి, మేడ్చల్, భద్రాద్రి కొత్తగూడెం ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఫార్మాస్యూటికల్స్, కెమికల్స్ రంగంలో అధిక పెట్టుబడులు వచ్చాయి. ఆ తర్వాత సోలార్, ఇతర పునరుత్పాదక ఇంధనం, ఇండ్రస్టియల్ పార్కులు, ఐటీ భవనాలు, ఫుడ్ ప్రాసెసింగ్, ఇంజనీరింగ్ రంగం పోటీపడుతున్నాయి.
యూనిట్‌కు మూడింతలు
గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి రూ.10,237 కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయి. ఈ ఏడాది ఏప్రిల్–సెపె్టంబర్ మధ్య ఏకంగా రూ.16,384 కోట్ల విలువైన ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదించింది. ఈ ఏడాది ఇప్పటివరకు గరిష్టంగా 1,172 పారిశ్రామిక యూనిట్లు ఆమోదం పొందాయి. వీటి ద్వారా 30,511 మందికి ఉపాధి అవకాశాలు రానున్నాయి.
⇒ 2025–26లో 2,163 యూనిట్లకు గ్రీన్‌సిగ్నల్ లభించింది. వాటి ద్వారా 51,029 మందికి ఉపాధి లభించింది.
⇒ గత ఏడాది యూనిట్‌కు సగటు పెట్టుబడి రూ.4.7 కోట్లు ఉండగా, ఈ ఏడాది దాదాపు మూడింతలై రూ.13.9 కోట్లకు పెరిగింది. కాగా, మొత్తం రూ.79,032 కోట్ల పెట్టుబడులతో కూడిన మరో 1,178 ప్రతిపాదనలను తెలంగాణ స్వీకరించింది. వీటికి ప్రభుత్వం నుంచి ఇంకా ఆమోదం రాలేదు. ఇవి 87,863 మందికి ఉపాధి కల్పించే అవకాశం ఉంది.


