గృహిణి నుంచి జాతీయ అవార్డు వరకు.. ఎవరీ పుష్ప ప్రసాద్? | Bihar Teacher Pushpa Prasad Bags National Teachers Award | Sakshi
Sakshi News home page

గృహిణి నుంచి జాతీయ అవార్డు వరకు.. ఎవరీ పుష్ప ప్రసాద్?

Aug 22 2026 1:57 PM | Updated on Aug 22 2026 1:59 PM

Bihar Teacher Pushpa Prasad Bags National Teachers Award

పట్నా: బిహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లా కుచాయ్‌కోట్ కన్యా మధ్య విద్యాలయ సహాయ ఉపాధ్యాయురాలు పుష్ప ప్రసాద్ ప్రతిష్ఠాత్మక జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికయ్యారు. సెప్టెంబరు 5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా సత్కారం అందుకోనున్న 11 మంది ఉపాధ్యాయుల్లో ఆమె ఒకరు. బిహార్ నుంచి గోపాల్‌గంజ్‌కు చెందిన పుష్ప ప్రసాద్‌తో పాటు బాంకా జిల్లాకు చెందిన ఖుష్బూ కుమారి కూడా ఈ జాబితాలో నిలిచారు.

కంప్యూటర్ ఎడ్యుకేషన్‌లో డిప్లొమా పూర్తి చేసిన పుష్ప తొలుత కంప్యూటర్ సెంటర్ ప్రారంభించి, పిల్లలకు శిక్షణ ఇవ్వాలని భావించారు. అయితే ఆమె భర్త బాల్మీకి ప్రసాద్ ప్రోత్సాహంతో ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్నారు. వైమానిక దళ నేపథ్యం కలిగిన కుటుంబంలో జన్మించిన పుష్ప, తొలినాళ్లలో బెంగళూరు కేంద్రీయ విద్యాలయంలో 9వ తరగతి వరకు చదివారు. తండ్రి బదిలీపై హర్యానాలోని నజఫ్‌గఢ్‌కు వెళ్లడంతో అక్కడ 10, 12 తరగతులు పూర్తి చేశారు. 2004లో బీపీఎస్సీ ఉపాధ్యాయుడైన బాల్మీకి ప్రసాద్‌తో ఆమె వివాహం జరిగింది. పెళ్లయి బాబు పుట్టిన తర్వాత కూడా ఆమె చదువును కొనసాగించారు.

2006లో గోపాల్‌గంజ్ పంచాయతీ నియామక ప్రక్రియ ద్వారా ప్రాథమిక పాఠశాల బలివాన్ సాగర్‌లో పుష్ప ఉపాధ్యాయురాలిగా చేరి ఏడేళ్లు పనిచేశారు. పాఠశాల నిర్వహణ, బోధనలో విశేష ప్రతిభ కనబరిచి గుర్తింపు పొందారు. 2013లో కుచాయ్‌కోట్‌ కన్యా మధ్య విద్యాలయానికి బదిలీ అయ్యారు. అక్కడ గణితం, హిందీ, ఆంగ్ల పాఠాలు బోధించడమే కాకుండా, సెలవు రోజుల్లో బాలికలకు పెయింటింగ్ వంటి అదనపు నైపుణ్యాలను నేర్పిస్తున్నారు. గతంలో ఆమెకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సత్కారంతో పాటు రెండుసార్లు రాష్ట్ర స్థాయి  అవార్డులు లభించాయి. జాతీయ పురస్కారానికి ఎంపికవడంపై పుష్ప ఆనందం వ్యక్తం చేస్తూ, మారుమూల గ్రామీణ ప్రాంత పాఠశాలలో తాను చేసిన కృషికి ఈ గుర్తింపు దక్కడం గర్వకారణమని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: ‘అందరికీ షుగర్ ఉందిగా..’.. మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement