ఉప్పు తగ్గిందని సర్ఫ్‌.. వికటించిన ‘మధ్యాహ్న భోజనం’ | Bihar Midday Meal Horror, 24 Students Fall Ill After Detergent Powder Is Accidentally Mixed In Food | Sakshi
Sakshi News home page

ఉప్పు తగ్గిందని సర్ఫ్‌.. వికటించిన ‘మధ్యాహ్న భోజనం’

Aug 20 2026 8:17 AM | Updated on Aug 20 2026 9:07 AM

Over 24 Children Fall Ill in Bihar After Cook Mistakes Detergent for Salt in Mid-Day Meal

బిహార్‌షరీఫ్: పాఠశాలలో వండిన మధ్యాహ్న భోజనం వికటించి 24 మందికి పైగా విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురైన ఘటన బిహార్‌లోని నూర్ సరాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పరసి మిడిల్ స్కూల్‌లో చోటుచేసుకుంది. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శైలేంద్ర కుమార్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. విద్యార్థులకు అన్నం, సోయాబీన్ కూరను వడ్డించారు. అయితే కూరలో ఉప్పు సరిపోలేదని కొందరు విద్యార్థులు ఫిర్యాదు చేయడంతో, వంట మనిషి ఉప్పుకు బదులుగా పొరపాటున సర్ఫ్ డిటర్జెంట్ పౌడర్‌ను వంటకంలో కలిపారు.

పాఠశాల వంటగదిలో ఉప్పు, డిటర్జెంట్ పౌడర్ రెండూ ఒకేచోట ఉంచడం వల్లే ఈ పొరపాటు జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఆ ఆహారం తిన్న కొద్దిసేపటికే విద్యార్థులకు వాంతులు, కళ్లు తిరగడం వంటి లక్షణాలు కనిపించాయి. మొదట పాఠశాల సిబ్బంది ప్రథమ చికిత్స అందించినప్పటికీ పరిస్థితి విషమించడంతో వెంటనే వారిని బిహార్‌షరీఫ్ సదర్ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో ఆస్పత్రికి చేరుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

ఆస్పత్రిలో సరైన సౌకర్యాలు లేవని, ఒకే బెడ్‌పై ఇద్దరు ముగ్గురు బాలికలకు చికిత్స అందిస్తున్నారని బాధిత కుటుంబాలు ఆరోపించాయి. సివిల్ సర్జన్ డాక్టర్ జయప్రకాష్ సింగ్ ఆస్పత్రిని సందర్శించి, బాధితులకు మెరుగైన వైద్యం అందుతోందని, విద్యార్థులంతా ప్రస్తుతం ప్రమాదం నుంచి బయటపడ్డారని తెలిపారు. అయితే, ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందించినప్పటికీ నూర్ సరాయ్ ఆస్పత్రి నుంచి అంబులెన్స్ గానీ, వైద్య బృందం గానీ పాఠశాలకు రాలేదని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబులెన్స్‌లు అందుబాటులో లేకపోవడంతో చేసేదేమీ లేక ఈ రిక్షాలు, ఆటోల్లో పిల్లలను ఆస్పత్రికి తరలించాల్సి వచ్చిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యతా ప్రమాణాలు, ఆహార పదార్థాల భద్రత, స్థానిక అత్యవసర ఆరోగ్య సేవల పనితీరుపై తీవ్ర ప్రశ్నలను లేవనెత్తింది.

ఇది కూడా చదవండి: ఠాణాలో హల్‌చల్‌: టాయిలెట్ క్లీనర్ తాగిన నిందితుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement