కాన్పూర్: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ నౌబస్తా పోలీస్ స్టేషన్‌లో అర్ధరాత్రి కలకలం చెలరేగింది. మహిళను వేధించిన ఆరోపణలపై విచారణ నిమిత్తం స్టేషన్‌కు పిలిపించిన ఆశీశ్ ద్వివేది అనే యువకుడు అక్కడి బాత్‌రూమ్‌లోకి వెళ్లి, టాయిలెట్ క్లీనర్ తాగాడు. నౌబస్తా ప్రాంతానికి చెందిన ఓ మహిళ మామ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆశీశ్ ద్వివేదిని విచారిస్తున్నారు. సర్‌సౌల్ పరిధిలోని మహోలీ గ్రామానికి చెందిన ఆశీశ్ వేర్వేరు నంబర్ల నుంచి సదరు మహిళకు ఫోన్ చేసి వేధిస్తున్నాడని, నిలదీస్తే చంపేస్తామని బెదిరించాడని ఫిర్యాదులో ఆమె మామ పేర్కొన్నారు. ఈ కేసు విచారణ కోసం ఆశీశ్‌ను పోలీసులు స్టేషన్‌కు రావాలని ఆదేశించారు.
మంగళవారం రాత్రి 11:30 గంటల సమయంలో ఆశీశ్ తన స్నేహితుడితో కలిసి మద్యం మత్తులో స్టేషన్‌కు చేరుకున్నాడు. అక్కడికి రాగానే పోలీసులతో వాగ్వాదానికి దిగి, దురుసుగా ప్రవర్తించాడు. అనంతరం గోడకు తల బాదుకోవడానికి ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించే క్రమంలో మూత్రవిసర్జనకని చెప్పి బాత్‌రూమ్‌కు వెళ్లాడు.
అక్కడ ఉన్న టాయిలెట్ క్లీనర్ వెంటనే తాగేశాడు. అయితే అతడు తాగకముందే అడ్డుకుని లాక్కున్నామని పోలీసులు అంటున్నారు. అస్వస్థతకు గురైన అతడిని తొలుత కాన్షీరామ్ ఆస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హాలెట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతను ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు నైట్ ఆఫీసర్ (ఎస్ఐ) వికాస్ గౌడ్, హెడ్ కానిస్టేబుల్ అరవింద్‌లను డీసీపీ (సౌత్) దీపేంద్ర నాథ్ చౌదరి సస్పెండ్ చేశారు.
ఇది కూడా చదవండి: ఇరాన్ యుద్ధం తెచ్చిన విద్యా సంక్షోభం


