చంఢీగఢ్: పంజాబ్‌లోని లుధియానాలో 60 ఏళ్ల మాజీ గ్రామ సర్పంచ్ నవ్‌తేజ్ సింగ్ అలియాస్ నీతూని దుండగులు అత్యంత దారుణంగా కాల్చి చంపారు. భూ వివాదం నేపథ్యంలో ఆయన సోదరుడు, కుటుంబ సభ్యులే ఈ హత్యకు పాల్పడి ఉండొచ్చని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.. నిన్న (శనివారం) నవ్‌తేజ్ సింగ్ తన టయోటా ఇన్నోవాలో ఇంటికి తిరిగి వెళ్తుండగా, లాధువాల్ ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు బైక్‌పై ఆయన వాహనాన్ని వెంబడించారు. అనంతరం 13 రౌండ్లవరకూ కాల్పులు జరిపారు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన నవ్‌తేజ్ సింగ్‌ను కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే వైద్యులు పరీక్షించి ఆయన అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ కాల్పుల ఘటన మొత్తం నవ్‌తేజ్ సింగ్ ప్రయాణిస్తున్న ఇన్నోవాలోని డ్యాష్‌క్యామ్‌లో రికార్డయింది.
అయితే తన తండ్రిని పథకం ప్రకారం హత్య చేశారని మృతుడి కుమారుడు ఆరోపిస్తున్నారు. పోలీసుల ఫిర్యాదులో ఈ హత్యకు సంబంధించి తన బాబాయి పాల్ సింగ్, ఆయన కుటుంబ సభ్యులు, ప్రస్తుత గ్రామ సర్పంచ్ సహా మొత్తం ఎనిమిది మంది పేర్లను ఫిర్యాదులో పేర్కొన్నారు.
డ్యాష్‌క్యామ్‌లో నమోదైన దృశ్యాలు, కాల్పుల ఘటనకు సంబంధించిన ఇతర ఆధారాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. నిందితులను గుర్తించి పట్టుకునేందుకు దర్యాప్తు కొనసాగుతోంది.


