ఫండే
లీగలాటా
పేరు మనిషికి గుర్తింపునిస్తుంది. కానీ, అదే పేరు ఒక్కోసారి సమస్యలకూ కారణమవుతుంది. స్పెల్లింగ్ కరెక్టుగా లేకపోతే. అక్షరాలు అటూ ఇటూ అయితే భవిష్యత్తు తారుమారవుతుంది. ఇలాంటి అనుభవమే ఓ యువకుడికి ఎదురైంది. అంతా సజావుగా సాగుతుందనుకున్న తరుణంలో తన తండ్రి పేరులో దొర్లిన తప్పు అతడి ఆశలపై నీళ్లు చల్లింది. అతని విజయానికి అడ్డుపడింది.
తప్పు తనది కాకపోయినా ఫలితం అతడు అనుభవించాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ తప్పును సరిదిద్దే ప్రయత్నం చేసినా ఫలించలేదు. అధికారులు అంగీకరించలేదు. చివరికి ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చింది. ఆ యువకుడి లక్ష్యానికి అడ్డుగోడగా నిలిచిన ఆ అక్షరాల సంగతి ఏంటి? న్యాయస్థానం ఈ సమస్యను ఎలా పరిష్కరించింది. అదే ఈ వారం లీ‘గలాట’...
అంకిత్ అనే యువకుడు ఇండియన్ కోస్ట్‌గార్డ్‌లో నావిక్ (జనరల్ డ్యూటీ) ఉద్యోగానికి దరఖాస్తు చేశాడు. 2022 మార్చి 29న రాత పరీక్షకు హాజరయ్యాడు. అందులో ఉత్తీర్ణత సాధించి శారీరక దారుఢ్య పరీక్షకు అర్హత పొందాడు. అందులోనూ విజయం సాధించాడు. దీంతో తనకు ఉద్యోగం తప్పకుండా వస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు.
ధ్రువపత్రాల పరిశీలనకు వెళ్లాడు. ఇక్కడే కథ అడ్డం తిరిగింది. ఊహించని సమస్య ఎదురైంది. అధికారులు అతని అభ్యర్థిత్వాన్ని తిరస్కరించారు. ఎంపిక చేయలేమని తేల్చి చెప్పారు. కారణం తెలుసుకుని అంకిత్ అవాక్కయ్యాడు. ఆ తప్పును సరిదిద్దే ప్రయత్నం చేశాడు. అయినా అధికారులు అతడి అభ్యర్థిత్వాన్ని పరిశీలించేందుకు ససేమిరా అనడంతో చివరికి హైకోర్టును ఆశ్రయించాడు.
అసలేం జరిగింది
అంకిత్ తండ్రి పేరు సంజిత్. అంకిత్ విద్యా సంబంధిత పత్రాలన్నింటిలో తండ్రిపేరు ఇంగ్లీషులో ట్చn్జ్ఛ్ఛ్ట అనుంది. కానీ కులధ్రువీకరణ పత్రంలో మాత్రం ట్చn్జజ్టీ అనుంది. ఈ అక్షరం తేడానే అధికారులకు అభ్యంతరంగా మారింది. అతడి దరఖాస్తు తిరస్కరణకు కారణమైంది. ఉద్యోగానికి ప్రతిబంధకంగా మారింది. దీంతో కుల ధ్రువీకరణ పత్రం జారీ చేసిన చర్కీదాద్రీ తహసీల్దార్ కార్యాలయంలో సంప్రదించాడు. ‘తన తండ్రి పేరు స్పెల్లింగ్‌లో తప్పు దొర్లింది. సరిచేయాలని’ కోరాడు.
అధికారులు పరిశీలించి సరైన స్పెలింగ్‌తో కొత్త ధ్రువపత్రాన్ని జారీ చేశారు. ఆ పత్రాన్ని కోస్ట్‌గార్డు అధికారులకు సమర్పించాడు. తన పత్రాలను మరోసారి పరిశీలించాలని విజ్ఞప్తి చేశాడు. నియామక ప్రకటనలోని నిబంధనల్లో పేర్కొన్న విధంగా దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీనాటికే అవసరమైన ధ్రువపత్రాలు జారీ అయి ఉండాలి. దరఖాస్తులో పేర్కొన్న వివరాలు, ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసిన పత్రాలు, అసలు ధ్రువపత్రాల్లోని వివరాలు అన్నీ ఒకేలా ఉండాలి. వీటిలో ఏ తేడా ఉన్నా అభ్యర్థిత్వం రద్దవుతుందని అధికారులు చెప్పారు. అతడి విజ్ఞప్తిని తిరస్కరించారు.
హైకోర్టులో పిటిషన్
అధికారుల నిర్ణయాన్ని సవాలు చేస్తూ అంకిత్ పంజాబ్–హర్యానా హైకోర్టును ఆశ్రయించాడు. ఆర్టికల్ 226 కింద రిట్ పిటిషన్ దాఖలు చేశాడు. కుల ధ్రువీకరణ పత్రంలో తన తండ్రి పేరు తప్పుగా రావడానికి తాను కారణం కాదని పేర్కొన్నాడు. తహసీల్దార్ కార్యాలయంలో ఈ పొరపాటు జరిగిందని వివరించాడు.
ఆ తప్పును సరిదిద్ది కొత్త ధ్రువీకరణ పత్రం అందజేసినా తన అభ్యర్థిత్వాన్ని తిరస్కరించడం అన్యాయమని పేర్కొన్నాడు. తనకు న్యాయం చేయాలని, తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించేలా ఆదేశించాలని వేడుకున్నాడు. నోటిఫికేషన్‌లో పేర్కొన్న నిబంధనల ప్రకారం అతని దరఖాస్తు తిరస్కరణ సరైన చర్యగా కేంద్ర ప్రభుత్వం తరపున హాజరైన న్యాయవాది వాదించారు.
గత తీర్పుల పరిశీలన
ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. ఇదే కోర్టుకు చెందిన మరో ధర్మాసనం ‘నితిక వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్’ తీర్పును పరిశీలించింది. ఈ కేసులోనూ విద్యార్థి తండ్రి పేరు విద్యార్హతల పత్రంలో ఒకలా, మార్కుల జాబితాలో మరోలా నమోదైంది. ఈ కారణంతో అభ్యర్థిత్వం తిరస్కరణ సరికాదని, సర్టిఫికెట్‌లో తండ్రి పేరులో అక్షరాలు మారినంత మాత్రాన అనర్హురాలిగా ప్రకటించడం కుదరని తీర్పు వెలువరించింది.
ఆ తీర్పును ఈ కేసు సందర్భంగా న్యాయమూర్తి ప్రస్తావించారు. అంకిత్ కేసులోనూ పొరపాటు సరిదిద్దుకునే అవకాశం ఉందని , ఆ ప్రయత్నం చేసి కొత్త ధ్రువపత్రాన్ని సమర్పించాడని పేర్కొన్నారు. వేరొకరు చేసిన పొరపాటుకు పిటిషనర్ అభ్యర్థిత్వాన్ని తిరస్కరించడం న్యాయసమ్మతం కాదని ధర్మాసనం అభిప్రాయపడింది.
అవకాశం కల్పించాలని ఆదేశం
నోటిఫికేషన్‌లో పేర్కొన్న పోస్టుల్లో ఖాళీ ఉంటే అంకిత్ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని ధర్మాసనం ఆదేశించింది. ఒకవేళ పోస్టుల భర్తీ పూర్తయితే తదుపరి నియామక పరీక్షల్లో అతని దరఖాస్తును పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంది. అయితే ఆ సమయంలో వైద్యపరంగాను అతడు అర్హుడై ఉండాలని స్పష్టం చేసింది. అక్షరదోషాలు, పేర్లలో స్వల్ప తేడాలు కీలక సమయంలో ఎలా అడ్డంకిగా మారతాయనే దానికి ఈ కేసు ఓ ఉదాహరణ.
- దిలీప్ మాదిరెడ్డి
ఇదీ చదవండి: కార్తీక మాసంలో ఈ కథ వింటే కలిగే పుణ్యం..


