ఫండే
భక్త విజయం
తత్త్వనిష్ఠుడు– బ్రహ్మరాక్షసులు
పూర్వం ఆంధ్ర దేశంలో తత్త్వనిష్ఠుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు శాస్త్రకోవిదుడు, దయాళువు, దైవభక్తుడు, తీర్థయాత్రా ప్రియుడు. ఒకసారి అతడు తీర్థయాత్రలకు బయలుదేరాడు. కార్తీకమాసంలో అతడు గోదావరి తీరానికి చేరుకున్నాడు. పవిత్ర గోదావరిలో స్నానమాచరించాలని అనుకుని, నది వద్దకు వడి వడిగా అడుగులు వేయసాగాడు.
గోదావరి ఒడ్డునే ఒక మర్రి చెట్టు ఉంది. ఆ చెట్టు మీద ముగ్గురు భయంకరాకారులు ఉన్నారు. నది ఒడ్డుకు దగ్గరగా వచ్చే సరికి వారు తత్త్వనిష్ఠుడికి కనిపించారు. పరమ భయంకరంగా ఉన్నవారు కత్తులు, కపాలాలు ధరించి ఉన్నారు. వారు బ్రహ్మరాక్షసులు. వారిని చూడగానే తత్త్వనిష్ఠుడికి భయంతో గుండె జారినంత పనైంది. ఒంట్లో వణుకు పుట్టింది.
చెట్టు మీదనున్న రాక్షసులు తత్త్వనిష్ఠుడిని చూశారు. వారు తనను చూడటంతో తత్త్వనిష్ఠుడి భయం రెట్టింపైంది. ప్రాణభయంతో అతడు శ్రీహరిని స్మరిస్తూ మనసులోనే స్తోత్రపఠనం సాగిస్తూ, వెనక్కు తిరిగి పరుగు ప్రారంభించాడు. అతడు పారిపోతుండటం చూసిన బ్రహ్మరాక్షసులు ముగ్గురూ చెట్టు నుంచి కిందకు దూకి, అతడిని వెంబడించడం ప్రారంభించారు.
బ్రహ్మరాక్షసులు తరుముకొస్తుండటంతో తత్త్వనిష్ఠుడు శక్తి కొద్ది పరుగు వేగం పెంచాడు. ‘శ్రీహరీ! నారాయణ! ఆపద్బాంధవా! జగద్రక్షకా! పాహిమాం... పాహిమాం...’ అని కేకలు వేస్తూ పరుగు తీస్తుండగా, బ్రహ్మరాక్షసులు మరింత వేగంగా పరుగెడుతూ అతడికి చేరువగా వచ్చారు. అతడు పలికే హరినామం వారి చెవిన పడింది. మరింత దగ్గరయ్యే సరికి తత్త్వనిష్ఠుడి సాత్విక తేజస్సు ప్రస్ఫుటంగా కనిపించింది. ఈ విప్రుడెవరో జ్ఞానిలా ఉన్నాడని తలచారు వారు. నిర్విరామంగా హరినామం చెవిన పడటంతో ఆ ముగ్గురు బ్రహ్మరాక్షసుల్లోనూ జ్ఞానోదయం కలిగింది.
బ్రహ్మరాక్షసులు ముగ్గురూ పరుగు వేగాన్ని మరింతగా పెంచి, తత్త్వనిష్ఠుడి ఎదుట నిలిచారు. వారిని చూడటంతోనే తత్త్వనిష్ఠుడు భయంతో వణకసాగాడు. బ్రహ్మరాక్షసులు అతడికి దండప్రణామాలు చేశారు. ‘ఓ విప్రుడా! భయపడకు. నీకు మేము ఎలాంటి హాని కలిగించం. నీ దర్శనంతో మా పాపాలు నశించాయి’ అని పలికి మళ్లీ మళ్లీ దండప్రణామాలు చేశారు.
వారి మాటలతో తత్త్వనిష్ఠుడికి మనసు కుదుటపడింది. కాస్త ధైర్యం చిక్కింది. ‘మీరెవరు? ఎలాంటి పాపాలు చేసినందుకు ఇలా మారారు? వివరంగా చెప్పండి. మీ బాధ తొలగే మార్గం చెబుతాను’ అని పలికాడు.
ముగ్గురిలో ఒకడు ముందుకొచ్చి, ‘బ్రాహ్మణోత్తమా! ముందుగా నా కథ చెబుతాను, విను.’ అంటూ తన కథ చెప్పడం మొదలుపెట్టాడు. ‘నేను పూర్వజన్మలో ద్రవిడ దేశంలో ఒక గ్రామాధికారిని. బ్రాహ్మణుడినే కాని, కుటిలుడిని. అధికారాన్ని అడ్డుపెట్టుకుని, చేయరాని పనులన్నీ చేశాను. ఇంటికి వచ్చిన బంధువులకు పట్టెడన్నమైనా పెట్టకపోయేవాణ్ణి. మరణానంతరం నరకబాధలు అనుభవించి, తర్వాత ఈ స్థితికి చేరుకున్నాను’ అని చెప్పి కన్నీళ్లు పెట్టుకున్నాడు.
రెండో బ్రహ్మరాక్షసుడు– ‘విప్రోత్తమా! నేను ఆంధ్రుడిని. భార్యాబిడ్డలతో పంచభక్ష్యాలు తింటూ, తల్లిదండ్రులకు చద్దికూడు పడేసేవాణ్ణి. బంధువులకు, బ్రాహ్మణులకు ఏనాడూ భోజనం పెట్టలేదు. విపరీతంగా ధనార్జన చేసి, ఆ కావరంతో అమాయకులను వేధించేవాణ్ణి. మరణానంతరం నరకానికి చేరుకున్నాను. చివరకు ఇలా పరిణమించాను’ అని దుఃఖిస్తూ చెప్పాడు.
మూడో బ్రహ్మరాక్షసుడు– ‘నేను ఆంధ్ర బ్రాహ్మణుడిని. వైష్ణవాలయంలో పూజారిగా ఉండేవాణ్ణి. విధి విధాయకంగా విష్ణుసేవ చేయక నిర్లక్ష్యంగా తిరిగేవాడిని. భార్యాబిడ్డలను నిర్లక్ష్యం చేసి, వేశ్యాలంపటుడినై చేయరాని పాపాలన్నీ చేశాను. మరణించాక నరకానికి చేరుకుని, తుదకు ఇలా మిగిలాను’ అని కన్నీళ్లతో చెప్పాడు.
‘నీవే మాకు మోక్షమార్గం చూపాలి’ అని ముగ్గురు బ్రహ్మరాక్షసులూ తత్త్వనిష్ఠుడిని ప్రార్థించారు.
‘భయపడకండి. ఇది కార్తీకమాసం, నాతో కార్తీక స్నానానికి రండి’ అని పలికి, తత్త్వనిష్ఠుడు వారిని తనతో పాటు గోదావరిలో స్నానానికి తీసుకువెళ్లాడు. ముందుగా తాను స్నానంచేసి వచ్చి, వారిని స్నానం చేసి రమ్మన్నాడు. వారు స్నానం ముగించుకుని వచ్చాక, తన కార్తీక వ్రతఫలాన్ని ససంకల్పంగా వారికి ధారపోస్తూ, వారిపై నీళ్లు చల్లాడు. వెంటనే వారికి దివ్యరూపాలు వచ్చాయి. వారి ముందు దివ్యరథం నిలిచింది. విష్ణుభటులు వారిని తమతో వైకుంఠానికి తీసుకుపోయారు.
- సాంఖ్యాయన
పురావిశేషం..
శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో మత్సా్యవతారానికి ఆలయాలు అరుదు. ఇలాంటి అరుదైన, పురాతన ఆలయం నేపాల్‌లోని చంద్రగిరి పట్టణానికి చేరువలో ఉన్న మచ్ఛేగాంవ్ గ్రామంలో ఉంది. ఈ ఆలయంలో ఏటా వైశాఖమాసంలో మత్స్యమేళా సందర్భంగాను, కార్తీకమాసంలోను భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. కార్తీక పూర్ణిమ రోజున ఈ ఆలయానికి పెద్దసంఖ్యలో భక్తులు వస్తారు. ఆలయ ప్రాంగణంలోని కోనేరులో స్నానాలు చేసి, దీపదానాలు చేస్తారు. మత్స్యనారాయణుడికి నైవేద్యంగా ‘మాల్‌పువా’ సమర్పిస్తారు.
ఇదీ చదవండి: పున్నమి రాత్రి ఈ నగరాన్ని చూస్తే మైమరచిపోవాల్సిందే!


