కస్టడీ పోరు : నాలుగేళ్లపాపను కాల్చి చంపి, ఆత్మహత్య | Houston Tragedy, Texas Mom Shoots Daughter Before Taking Her Own Life Hours After Losing Custody Battle, Check Details Inside | Sakshi
Sakshi News home page

కస్టడీ పోరు : నాలుగేళ్లపాపను కాల్చి చంపి, ఆత్మహత్య

Oct 3 2026 3:48 PM | Updated on Oct 3 2026 4:35 PM

Texas mom shoots daughter before taking her own life hours after losing custody battle

టెక్సాస్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. హ్యూస్టన్‌లో సిబెల్లె సావెల్లా (35) అనే మహిళ తన నాలుగేళ్ల కూతురు వివియన్‌ను కాల్చి చంపి, ఆ తర్వాత తను కూడా కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఆ చిన్నారి సంరక్షణ బాధ్యతను (కస్టడీని) ఆమె తండ్రికి అప్పగిస్తూ కోర్టు తీర్పు ఇచ్చిన కొద్ది గంటలకే ఆమె తన ఉసురు తీసుకుంది. సాయంత్రం  పాప తండ్రి వద్దకు వెళ్లాల్సి ఉంది. దీంతో ఆ పూట గడిస్తే తన బిడ్డ తనకు దూరమవుతందనే ఆవేదనతో ఆమె ఈ నిర్ణయం తీసుకోవడం కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

వివియన్‌ను ఆమె తండ్రి ఆరోన్ సావెల్లాకు అప్పగిస్తూ కోర్టు అదే రోజు తీర్పు వెలువరించింది. ఆ సాయంత్రమే పాప తండ్రి వద్దకు వెళ్లాల్సి ఉంది, కానీ ఇంతలోనే ఈ ఘోరం జరిగిందని పోలీసులు ,కుటుంబ తరపు న్యాయవాదులు తెలిపారు. తుపాకీ కాల్పులు జరిగిన సమయంలో సిబెల్లె ప్రస్తుత భర్త, రెస్టారెంట్ యజమాని గ్రెగ్ కుబాలా,ఒక బేబీ సిట్టర్ ఇంట్లోనే ఉన్నారని పోలీసులు, స్థానిక మీడియా నివేదికలు తెలిపాయి. ఈ కాల్పుల ఘటనలో వారికి ఎటువంటి ప్రమేయం లేదని భావిస్తున్నారు.

ఏం జరిగిందంటే
న్యూయార్క్ పోస్ట్  కథనం ప్రకారం బ్రెజిల్‌కు చెందిన సిబెల్, నాలుగేళ్ల వివాహ బంధం తర్వాత 2024 నవంబర్‌లో ఆరోన్‌కు విడాకులు ఇచ్చింది.  కూతురు వివియన్‌ కస్టడీ కోసం కొంతకాలంగా ఈ దంపతుల మధ్య న్యాయపోరాటం జరుగుతోంది. తాజాగా పాపకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునే ప్రత్యేక హక్కులను కోర్టు తండ్రికి కట్టబెట్టింది. టెక్సాస్‌కు చెందిన ఒక సంస్థ పర్యవేక్షణలో మాత్రమే తల్లి సిబెల్‌కు ఆ చిన్నారితో సమయం గడపడానికి  కోర్టు అనుమతించింది. అంతేకాదు సందర్శన సమయంలో ఉన్న పర్యవేక్షకుడికి పోర్చుగీస్ భాషలో ప్రావీణ్యం ఉంటే తప్ప, వివియన్‌తో పోర్చుగీస్‌లో మాట్లాడకుండా కూడా సిబెల్‌ను పరిమితం చేసినట్లు తెలుస్తోంది. 

దీంతో తీవ్ర ఆవేదనకు గురైన ఆమె హ్యూస్టన్‌లోని తమ ఇంట్లోనే ముందుగా చిన్నారిని కాల్చి చంపి, ఆ తర్వాత తనను తాను కాల్చుకుంది.  తీవ్రంగా గాయపడిన ఆమెను ఆసుపత్రికి తరలించినప్పటికీ, మరుసటి రోజు ఆమె మరణించింది.

ఇదీ చదవండి: 12 ఏళ్ల కొడుకు గొంతు నులిమి? కష్టాల్లో ప్రముఖ నటి

 ఆరోన్‌ కుటుంబం ఆవేదన
చట్టాన్ని నమ్మి, న్యాయస్థానం ద్వారా  నాలుగేళ్ల తన బిడ్డను కాపాడుకోవడానికి ప్రయత్నించిన తండ్రి ఆరోన్ పడిన వేదన వర్ణనాతీతమని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.  పాప ఆ సాయంత్రం ఆయన వద్దకు రావాల్సి ఉంది. కానీ ఆమె ఇక ఎప్పటికీ రాలేదని, ఈ నష్టాన్ని మాటల్లో చెప్పలేమని పేర్కొంది. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

ఇదీ  చదవండి : ఈజీగా బరువు తగ్గాలంటే : ఉప్మా-పోహా ఏది బెస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement