ఫ్లైదుబాయ్ విమాన ఘటనపై ఇప్పటివరకు ఉన్న అనుమానాలకు తెరదించే కీలక ప్రకటన వెలువడింది. కెప్టెన్ స్మిట్ మచ్చార్‌పై కాక్‌పిట్‌లోని క్రాష్ యాక్స్‌తోనే కో-పైలట్ హమామ్ అల్-హమ్మామీ దాడికి యత్నించాడని యూఏఈ తెలిపింది. అంతేకాదు.. ఈ ఘటనను ఉగ్రదాడిగా దాదాపుగా నిర్ధారించింది.
దుబాయ్ నుంచి టెల్‌అవీవ్ వెళ్తున్న ఎఫ్‌జెడ్1073 విమానంలో కో-పైలట్ హమామ్ అల్-హమ్మామీ.. కెప్టెన్ స్మిట్ మచ్చార్‌పై కాక్‌పిట్‌లోని క్రాష్ యాక్స్‌తో దాడి చేసి, విమానాన్ని తన నియంత్రణలోకి తీసుకునేందుకు ప్రయత్నించాడని యూఏఈ ప్రాసిక్యూటర్ జనరల్ హమద్ సైఫ్ అల్ షమ్సీ శనివారం వెల్లడించారు. ఈ చర్యను ‘టెర్రరిస్ట్ అటాక్’గా పేర్కొన్నారు. ఘటనకు సంబంధించిన పరిస్థితులు, ఉద్దేశం, ఇతరులతో సంబంధాలు, ఫిజికల్-డిజిటల్ ఆధారాలపై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.
విమానం కంట్రోల్ కోసం ప్రయత్నం
సెప్టెంబర్ 30న దుబాయ్ నుంచి టెల్‌అవీవ్ బయలుదేరిన ఫ్లైదుబాయ్ విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాక్‌పిట్‌లో కో-పైలట్ స్మిట్ మచ్చార్‌పై దాడి చేసిన అనంతరం విమాన నియంత్రణను చేపట్టేందుకు ప్రయత్నించాడని యూఏఈ అధికారులు తెలిపారు. సాధారణంగా విమానాల్లో అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే క్రాష్ యాక్స్ కాక్‌పిట్‌లోనే ఉంటుంది. అదే పరికరాన్ని దాడికి ఉపయోగించినట్లు తాజా దర్యాప్తు వివరాలు వెల్లడిస్తున్నాయి.
వేల అడుగుల మేర ఒక్కసారిగా కిందికి
కాక్‌పిట్‌లో ఘర్షణ జరుగుతున్న సమయంలో విమానం ఒక్కసారిగా వేగంగా కిందికి దిగింది. వివిధ నివేదికల ప్రకారం విమానం దాదాపు 14 వేల నుంచి 17 వేల అడుగుల మేర ఎత్తు కోల్పోయింది. విమానంలో 170 మందికి పైగా ఉన్నారు. తీవ్రంగా గాయపడినప్పటికీ కెప్టెన్ మచ్చార్ కాక్‌పిట్ తలుపు తెరవగలిగారు. దీంతో ప్రయాణికులు, సిబ్బంది లోపలికి వెళ్లి కో-పైలట్‌ను అదుపులోకి తీసుకున్నారు.
ఆ ఇద్దరు పైలట్లతోనే విమానం సేఫ్
విమానంలో ప్రయాణిస్తున్న ఇద్దరు ఆఫ్-డ్యూటీ పైలట్లు పరిస్థితిని చక్కదిద్దేందుకు ముందుకొచ్చారు. వారు విమాన నియంత్రణ చేపట్టి దానిని సౌదీ అరేబియాలోని టబుక్ విమానాశ్రయానికి మళ్లించారు. అక్కడ విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. ఘటన అనంతరం సౌదీ అధికారులు కో-పైలట్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని విచారణ కోసం యూఏఈకి తరలించారు.
హమామ్.. గతంపైనా దర్యాప్తు
కో-పైలట్‌ను హమామ్ అల్-హమ్మామీగా గుర్తించారు. అతడు ఒమన్ జాతీయుడని దర్యాప్తు వర్గాలను ఉటంకిస్తూ రాయిటర్స్ తెలిపింది. అతడి గత రికార్డులపైనా ఇప్పుడు అధికారులు దృష్టి పెట్టారు. 2024లో ఒమన్ ఎయిర్‌లో కో-పైలట్ ట్రైనీగా ఉన్న సమయంలో అతడి వద్ద తీవ్రవాద భావజాలానికి సంబంధించిన మెటీరియల్ లభించడంతో విమానాలు నడపకుండా నిలిపివేసినట్లు అమెరికా అధికారులు తెలిపినట్లు ఏబీసీ న్యూస్ పేర్కొంది. అయితే ఆ తర్వాత అతడు పరిపాలనా విభాగంలో కొనసాగినట్లు సమాచారం. అసలు అలాంటి నేపథ్యం ఉన్న వ్యక్తి తర్వాత ఫ్లైదుబాయ్‌లో కో-పైలట్‌గా ఎలా చేరాడు? అతడికి క్లియరెన్స్ ఎలా లభించింది? అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ప్రశ్నలే ప్రస్తుతం విచారణలో కీలకంగా మారాయి.
ఉగ్ర సంస్థలతో సంబంధాలున్నాయా?
కో-పైలట్ ఒంటరిగానే ఈ దాడికి పాల్పడ్డాడా? లేదంటే ఏదైనా తీవ్రవాద సంస్థతో సంబంధం ఉందా? ముందస్తు ప్రణాళిక ఉందా? ఎవరైనా అతడిని ప్రేరేపించారా? అనే అంశాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. యూఏఈ ప్రాసిక్యూటర్ జనరల్ ప్రకారం భౌతిక, డిజిటల్ ఆధారాలను పరిశీలిస్తున్నారు. దర్యాప్తు పూర్తయ్యాక తుది వివరాలను వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.
మచ్చార్ ధైర్యంతో తప్పిన పెను ప్రమాదం
దాడిలో తీవ్రంగా గాయపడిన కెప్టెన్ స్మిట్ మచ్చార్ మాత్రం పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ కాక్‌పిట్ తలుపు తెరిచారు. దీంతో ప్రయాణికులు లోపలికి వెళ్లి దాడి చేసిన కో-పైలట్‌ను అదుపులోకి తీసుకోగలిగారు. మరోవైపు ఆఫ్-డ్యూటీ పైలట్లు విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేయడంతో పెను ప్రమాదం తప్పింది. మచ్చార్ ప్రస్తుతం కోలుకుంటున్నారు.
ఇదీ చదవండి: సిరియన్ అమ్మ.. ఒమన్ తండ్రి.. అల్‌ఖైదాకు వీరాభిమాని!


