హనుమాన్ చాలీసా.. ఇప్పుడు మరోసారి ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. ఫ్లైదుబాయ్ విమానంలో ప్రాణాపాయ పరిస్థితిని ఎదుర్కొన్న భారత కెప్టెన్ స్మిట్ మచ్చార్.. తీవ్ర గాయాలతో ఉన్న సమయంలో హనుమాన్ చాలీసా పఠించానని, దాని ద్వారా ధైర్యం, బలం కూడగట్టుకుని కాక్‌పిట్ డోర్ తెరిచేందుకు ప్రయత్నించానని ప్రధాని నరేంద్ర మోదీతో జరిగిన వీడియో కాల్‌లో వెల్లడించారు. ఆ ఘటన తర్వాత హనుమాన్ చాలీసా గురించి ఇంటర్నెట్‌లో వెతుకులాట, చర్చ కూడా పెరిగింది.
ఫ్లైదుబాయ్ దుబాయ్–టెల్ అవీవ్ విమానంలో కో-పైలట్ దాడికి గురైన కెప్టెన్ స్మిట్ మచ్చార్ తీవ్రంగా గాయపడ్డారు. విమానం అదుపు తప్పే పరిస్థితుల్లోనూ ప్రయాణికుల భద్రత కోసం కాక్‌పిట్ డోర్ తెరిచేందుకు ఆయన ప్రయత్నించారు. అనంతరం ప్రధాని మోదీతో జరిగిన వీడియో సంభాషణలో ఆ సమయంలో తన పరిస్థితిని వివరించారు. తాను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు హనుమాన్ చాలీసా పఠిస్తానని, ఆ ఘటనలోనూ దానినే పఠిస్తూ ధైర్యం కూడగట్టుకున్నానని చెప్పారు.
ఆ మాటలతో ఆసక్తి
కెప్టెన్ స్మిట్ మచ్చార్ స్వయంగా హనుమాన్ చాలీసా ప్రస్తావన చేయడంతో.. ఆ భక్తిగీతం గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి ఆన్‌లైన్‌లో పెరిగింది. హనుమాన్ చాలీసా ఏమిటి? దాన్ని ఎవరు రచించారు? అందులో ఏముంది? వంటి అంశాలపై నెటిజన్లు వెతకడం, చర్చించడం మొదలైంది. సంక్షోభ సమయంలో తనకు ధైర్యం ఇచ్చిన ప్రార్థనగా కెప్టెన్ చెప్పిన ఈ ప్రస్తావన సోషల్ మీడియాలోనూ విస్తృతంగా చర్చకు వచ్చింది.
రెండింతల వేగంతో అమెరికన్ పఠనం
ఇదిలా ఉండగా టెక్సాస్‌లో ఉంటున్న నిక్ డియర్‌మన్ హనుమాన్ చాలీసాను సాధారణ వేగానికి దాదాపు రెండింతల వేగంతో పఠిస్తూ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. రెండు రెట్ల వేగంతో పఠిస్తానని చెప్పి ప్రారంభించిన ఆయన.. ఎక్కడా తడబడకుండా, లయను కోల్పోకుండా చివరి వరకు కొనసాగించారు. వేగంగా పఠించినప్పటికీ పదాలను స్పష్టంగా పలకడంతో వీడియోకు సోషల్ మీడియాలో మంచి స్పందన వచ్చింది. కొందరు నెటిజన్లు ఆయన పఠనాన్ని ప్రశంసించగా.. మరికొందరు తాము కూడా అంత బాగా పఠించలేమంటూ సరదాగా కామెంట్లు చేశారు.
ఏమిటీ హనుమాన్ చాలీసా?
హనుమంతుడిని స్తుతిస్తూ రచించిన ప్రసిద్ధ భక్తిగీతమే హనుమాన్ చాలీసా. భక్తకవి తులసీదాసు దీనిని అవధీ భాషలో రచించినట్లు సంప్రదాయంగా భావిస్తారు. ఇందులో హనుమంతుడి బలం, ధైర్యం, జ్ఞానం, వినయం, శ్రీరాముడిపై ఆయనకున్న భక్తిని కీర్తించే 40 చౌపాయిలు ఉంటాయి. ‘చాలీసా’ అనే పదానికి నలభై అనే అర్థం ఉండటంతో ఈ గీతానికి హనుమాన్ చాలీసా అనే పేరు వచ్చింది.
భక్తిలోనే కాదు.. ధైర్యానికి ప్రతీకగా
హనుమాన్ చాలీసాను భక్తులు సాధారణంగా ప్రార్థనగా పఠిస్తారు. భయం, ఆందోళన.. కష్టకాలంలో పఠించడం ద్వారా మనసుకు ప్రశాంతత, ధైర్యం, ఏకాగ్రత కలుగుతాయని చాలామంది విశ్వసిస్తారు. అయితే ఇవి విశ్వాసానికి సంబంధించిన అంశాలు. కెప్టెన్ స్మిట్ మచ్చార్ చెప్పిన అనుభవం కూడా ఆయన వ్యక్తిగత విశ్వాసంతో ముడిపడి ఉంది.
ఒకవైపు వేల అడుగుల ఎత్తులో ప్రాణాపాయ పరిస్థితిని ఎదుర్కొన్న భారత పైలట్.. తనకు ధైర్యాన్నిచ్చింది హనుమాన్ చాలీసా అని చెప్పడం, మరోవైపు అమెరికాలోని ఓ వ్యక్తి దానిని రెండింతల వేగంతో పఠిస్తూ వైరల్ కావడం.. ఇలా వరుస ఘటనలతో హనుమాన్ చాలీసా ఇప్పుడు భారతదేశాన్ని దాటి ప్రపంచవ్యాప్తంగా మరోసారి చర్చనీయాంశంగా మారింది.
ఇదీ చదవండి: వారెవ్వా.. ఆమె ఉల్లి కన్నీళ్లు తుడిచిందిగా!


