మహిళా క్రీడాకారులు బిజినెస్‌నీ ఆడుకున్నారు! | indian female athletes starts personal business | Sakshi
Sakshi News home page

మహిళా క్రీడాకారులు బిజినెస్‌నీ ఆడుకున్నారు!

Oct 3 2026 4:35 AM | Updated on Oct 3 2026 4:35 AM

indian female athletes starts personal business

భారతీయ మహిళా అథ్లెట్లు క్రీడాకారిణులు గానే కాదు... వ్యాపార రంగంలోనూ ఎంతో క్రియేటివ్‌గా గుర్తింపు తెచ్చు కుంటున్నారు.  ఇటీవల ఆసియా క్రీడల్లో కాంస్య పతకం సాధించిన భారతీయ అథ్లెట్‌ హరిత భద్ర ‘దాగీనా’ పేరుతో హ్యాండ్‌ మేడ్‌ ఆర్నమెంట్స్‌ను ఆన్ లైన్  ద్వారా అమ్ముతోంది. పోలో క్రీడాకారిణి రీనాషా ఫ్యాషన్‌ డిజైనర్‌. 

హాకీ క్రీడాకారిణి సాగరిక ఘాట్లే అటు నటనలోనూ, ఫ్యాషన్‌ రంగంలోనూ కూడా రాణిస్తున్నారు. క్రికెటర్‌ స్మృతి మంధాన మహిళా అథ్లెట్లకు సరికొత్త స్పోర్ట్స్‌ వేర్‌ డిజైన్లను రూపొందించే సంస్థలో ఇన్వెస్టర్‌. బ్యాడ్మింటన్  సైనా నెహ్వాల్‌ మహిళల శానిటరీ ప్యా డ్స్‌ తయారీ సంస్థలో కో ఫౌండÆŠ.. గ్రౌండ్‌లోనే కాదు వ్యాపార రంగాన్నీ ఆటగా కొత్త సవాళ్లతో తమ సత్తా చాటుతున్నారు మహిళా క్రీడాకారులు..

స్మృతి మంధాన
సవాళ్లు ఎప్పుడూ ఆసక్తే! 
బ్యాట్‌ పట్టిన చేతులు బట్టలకు కొత్త అర్థాలు చూపుతున్నాయి. భారత మహిళా క్రికెటర్‌ 
స్మృతి మంధాన మహిళలకు స్పోర్ట్స్‌ వేర్‌ డిజైనింగ్‌ తయారీలో ఉన్నారు. పురుషుల స్పోర్ట్స్‌ డ్రెస్‌ డిజైన్లనే కొద్దిపాటి మార్పులతో తీసుకు వస్తున్న సంస్థతో కలిసి దీర్ఘకాలిక ఒప్పందాలు చేసుకున్నారు. అథ్లెట్‌ ఎంట్రప్రెన్యూర్‌గా మహిళా క్రీడాకారుల అభివృద్ధికి తోడ్పడుతున్నారు. ‘సొంతంగా ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించి, కాలక్రమంలో ఆ సంస్థ ఎదగడం చూడాలనే ఆలోచన నాకు ఎప్పుడూ ఆసక్తికరంగా ఉంటుంది. ఏదైనా సాధించాలనుకుంటే దానికి పరిమితి లేదని ముందుగా మనం నమ్మాలి. అప్పుడే వ్యాపార రంగంలోనైనా రాణించగలం’ అంటారు ఈ క్రికెటర్‌.

రీనా షా 
కొత్త ప్రయాణమూ సాధ్యమే!
జీవితంలో ఒక రంగంలో స్థిరపడిన తర్వాత మరో కొత్తరంగంలోకి అడుగుపెట్టాలంటే చాలామంది వెనుకడుగు వేస్తారు. కొత్త సవాళ్లను స్వీకరించడం కష్టమని భావిస్తారు. కానీ ఆసక్తి, పట్టుదల ఉంటే మరో కొత్త ప్రయాణమూ సాధ్యమే అని నిరూపిస్తోంది భారతదేశపు తొలి మహిళా ్రపొఫెషనల్‌ పోలో ప్లేయర్‌గా గుర్తింపు పొందిన 40 ఏళ్ల రీనా షా. ఫుట్‌వేర్, ఫ్యాషన్‌ యాక్సెసరీస్‌ డిజైనర్‌గా ఆమె తనదైన ముద్ర వేశారు.  
‘మొదటినుంచీ డిజైనింగ్‌పై ఆసక్తి. న్యూయార్క్‌లో ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సు చేశాను. రినాల్డి బ్రాండ్‌తో వ్యాపార ప్రయాణాన్ని ప్రారంభించాను. ప్రత్యేకమైన ఫుట్‌వేర్, ఫ్యాషన్‌ యాక్సెసరీస్‌ రూపకల్పనలో గుర్తింపు లభించింది. ప్రముఖులు, సెలబ్రిటీల కోసం ప్రత్యేక డిజైన్లు రూపొందించాను’ అని ఆనందంగా చెబుతారు ఈ పోలో ప్లేయర్‌.

హరిత భద్ర
ట్రాక్‌పై స్ప్రింటర్‌.. ట్రాక్‌ బయట వ్యాపారి
ఆసియా క్రీడల్లో హరిత భద్ర 200 మీటర్ల పరుగులో కాంస్య పతకాన్ని సాధించింది. హరిత క్రీడల్లోనే కాదు తన సృజనాత్మకతను వ్యక్తపరచడానికి మరో మార్గాన్ని ఎంచుకుంది. ఈ స్ప్రింటర్‌ ఆభరణాల తయారీపై ఉన్న ఇష్టంతో ‘దాగీనా’ పేరుతో సొంత ఆన్‌లైన్‌ ఆభరణాల వ్యాపారాన్ని కూడా ప్రారంభించింది. ‘సృజనాత్మకంగా ఏదైనా చేయడం అంటే చాలా ఇష్టం. ఎప్పటినుంచో ఉన్న ఆసక్తిని వ్యాపారంగా ప్రారంభించాను. క్రీడల్లో కఠినమైన శిక్షణ నుంచి ఒక రిలాక్సేషన్‌కి, తిరిగి ఉత్సాహం పొందడానికి, ఈ ఆభరణాల తయారీ ఒక అవకాశాన్ని ఇస్తుంది. నా మనసును మరో పనివైపు  మళ్లించుకోవడానికి ఇలా సృజనాత్మక పనిలో లీనమైపోతాను’ అంటుంది హరిత భద్ర.

సాగరికా ఘాట్గే 
హాకీ మైదానం నుంచి వెండితెరకు 
సాగరికా ఘాట్గే హాకీ ప్లేయర్‌గా జాతీయస్థాయి క్రీడలలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అలాగే, వెండితెరపైన ‘చెక్‌ దే ఇండియా’ ద్వారా నటిగానూ ప్రశంసలు అందుకుంది. మోడల్‌గా రాణిస్తూనే ఫ్యాషన్, లైఫ్‌ స్టైల్‌ రంగంలో అకుటీ బ్రాండ్‌తో మరో క్రియేటివ్‌ ప్రయాణాన్నీ ప్రారంభించింది. ‘ఫ్యాషన్‌ అంటే కొత్త బట్టలు కొనడం కాదు తరతరాలకు అందించగల డిజైన్‌. మన వ్యక్తిత్వానికి నిజంగా సరిపోయేలా ధరించే డ్రెస్‌ ఏదైనా అదే స్టైల్‌ అవుతుంది. మా అమ్మ తన డ్రెస్సులపై అందమైన పూల డిజైన్లను పెయింట్‌ చేసేది. తోటలో పూసిన పూల డిజైన్లు కొన్ని రోజుల తర్వాత ఆమె డ్రెస్సుల మీద కనిపించేవి. ఆ జ్ఞాపకమే ఒక బ్రాండ్‌లా తీసుకువచ్చేలా చేసింది’ అంటుంది సాగరిక.

సైనా నెహ్వాల్‌
 బిజినెస్‌ ఓ కొత్త కోర్ట్‌
బ్యాడ్మింటన్‌ కోర్టులోనే కాదు బిజినెస్‌ రంగంలో కొత్త సవాళ్లనూ స్వీకరిస్తున్నారు సైనా నెహ్వాల్‌.  ‘నాకు బిజినెస్‌ ఐడియాలను అమలులో పెట్టడం చాలా ఇష్టం. ఆట మీద ఎంతటి దృష్టి పెడతానో బిజినెస్‌ వైపు కూడా అంతే. బిజినెస్‌ కూడా నాకు ఓ కొత్త కోర్ట్‌. మొదట్లో ఆటమీదనే నా దృష్టి ఉంది. కాలక్రమంలో రెస్టారెంట్లతో పాటు క్లోధింగ్‌ బ్రాండ్‌లోనూ ఇన్వెస్ట్‌ చేస్తున్నాను. ఆసక్తి ఉంటే రెండు రంగాలనూ సమర్థంగా నిర్వహించవచ్చు’ అని వివరిస్తారు ఆమె.

– నిర్మలారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement