మహిళల రికర్వ్ టీమ్ విభాగంలో భారత జట్టు పెను సంచలనం
తొలిసారి పసిడి పతకం సొంతం
అంతర్జాతీయ ఆర్చరీలో దక్షిణ కొరియాకున్న రికార్డు అసాధారణం... విభాగంతో సంబంధం లేకుండా... ప్రపంచ చాంపియన్‌షిప్ అయినా... ఒలింపిక్స్ అయినా... ఆసియా క్రీడలైనా... పసిడి పతకాలతో తిరిగి వెళ్లడం కొరియా ఆర్చర్లకు అలవాటుగా మారింది. అందుకే ఇప్పటికి కొరియా 10 సార్లు ఒలింపిక్స్ చాంపియన్‌గా... 10 సార్లు ఆసియా క్రీడల చాంపియన్‌గా నిలిచింది. ఇంతటి ఘనమైన రికార్డు కలిగిన దక్షిణ కొరియాను భారత మహిళల ఆర్చరీ జట్టు బోల్తా కొట్టించి పెను సంచలనం సృష్టించింది.
శుక్రవారం జరిగిన మహిళల రికర్వ్ టీమ్ ఈవెంట్ ఫైనల్లో అంకిత, కీర్తి శర్మ, కుంకుమ్‌లతో కూడిన భారత జట్టు 5–3 (54–54, 56–56, 55–51, 54–54) సెట్ పాయింట్లతో కాంగ్‌చెయంగ్, లీ యున్‌జీ, ఒయెజిన్‌లతో కూడిన దక్షిణ కొరియా జట్టును ఓడించి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. సెట్‌లో భాగంగా ఇరు జట్లు ఒక్కో సిరీస్‌లో ఆరు బాణాల చొప్పున సంధిస్తాయి. సెట్ గెలిచిన జట్టుకు రెండు పాయింట్లు లభిస్తాయి. స్కోరు సమమైతే ఒక్కో పాయింట్ దక్కుతుంది.
భారత్; కొరియా తుది పోరులో తొలి రెండు సెట్‌లలో స్కోర్లు ‘టై’గా ముగిశాయి. దాంతో రెండు జట్లు 2–2తో సమంగా నిలిచాయి. మూడో సెట్‌ను భారత్ గెలిచి 4–2తో ముందంజ వేసింది. చివరిదైన నాలుగో సెట్‌లో స్కోర్లు సమం కావడంతో భారత్ 5–3తో విజయాన్ని ఖాయం చేసుకుంది. 1978 బ్యాంకాక్ ఆసియా క్రీడల్లో మహిళల రికర్వ్ టీమ్ ప్రవేశపెట్టగా... దక్షిణ కొరియా 10 సార్లు స్వర్ణ పతకాలు నెగ్గింది. జపాన్ (1978), చైనా (1994) ఒక్కోసారి విజేతగా నిలిచింది.
ధీరజ్‌కు రెండు రజతాలు
మరోవైపు భారత పురుషుల రికర్వ్ జట్టు రజతంతో సంతృప్తి పడింది. ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ బొమ్మదేవర ధీరజ్, నీరజ్ చౌహాన్, యశ్‌దీప్‌లతో కూడిన భారత జట్టు ఫైనల్లో 1–5 (56–56, 50–57, 54–56) సెట్ పాయింట్లతో కిమ్ జెడియోక్, లీ వూ సియోక్, కిమ్ వూజిన్‌లతో కూడిన దక్షిణ కొరియా జట్టు చేతిలో ఓడిపోయింది. ఆసియా క్రీడల చరిత్రలో కొరియా పురుషుల జట్టుకిది పదో స్వర్ణం కావడం విశేషం. రికర్వ్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో ధీరజ్–కుంకుమ్‌లతో కూడిన భారత జట్టు 3–5 (34–38, 35–37, 37–36, 37–37) సెట్ పాయింట్లతో జు జింగీ–లీ మెంగ్‌కి (చైనా) జంట చేతిలో ఓడిపోయింది.


