Photo Credit: Twitter
పాండిచ్చేరి వేదికగా ఆస్ట్రేలియా-ఎతో జరుగుతున్న రెండో అనధికారిక టెస్టును భారత-ఎ జట్టు డ్రాగా ముగించింది. నాలుగోరోజు ఆటకు చివరి రోజు కావడంతో, రోజు ముగిసే సమయానికి 365 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు 9 వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది.
దీంతో ఆస్ట్రేలియా విజయానికి ఒక్క వికెట్ దూరంలో ఆగిపోయింది. తొలి అనధికారిక టెస్టును గెలిచిన భారత్ 1-0తో సిరీస్‌ను సొంతం చేసుకుంది. భారత్‌ను ఓటమి నుంచి తప్పించిన షామ్స్ ములాని రెండు టెస్టులు కలిపి 55 పరుగులతో పాటు 10 వికెట్లు తీసి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు సొంతం చేసుకున్నాడు.
మ్యాచ్‌లో భారత్ ఓటమి ఖాయమనున్న దశలో షామ్స్ ములానీ (131 బంతుల్లో 29) ఆపద్బాంధవుడి పాత్రను పోషించి జట్టును ఓటమి నుంచి తప్పించగా, నచికేత్ భూతే (20 నాటౌట్) అతడికి సహకరించాడు. చివర్లో ఆస్ట్రేలియా బౌలర్లను మార్చి ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినప్పటికీ లాభం లేకపోయింది.
చివరి ఓవర్ వరకు విజయం కోసం ప్రయత్నించిన ఆసీస్‌కు శామ్స్ ములాని, నచికేత్ భూతేలు కొరకరాని కొయ్యలుగా మారి వారి గెలుపును అడ్డుకున్నారు. అంతకముందు యశ్ రాథోడ్ (80), తుషార్ దేశ్‌పాండే (52) అర్థసెంచరీలతో రాణించి భారత ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. ఆస్ట్రేలియా బౌలర్లలో లియామ్ స్కాట్ 5 వికెట్లతో చెలరేగగా.. లియామ్ హాచర్, టాడ్ ముర్ఫీ, కోరె రొచ్చిసియోలి, నాథన్ మెక్‌స్వీనీ తలా ఒక వికెట్ తీశారు.
ఇక తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 358 పరుగులకు ఆలౌట్ కాగా.. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 167 పరుగులకే కుప్పకూలడంతో ఆసీస్‌కు 191 పరుగుల ఆధిక్యం లభించింది. ఆసీస్ తమ రెండో ఇన్నింగ్స్‌ను 173 పరుగుల వద్ద డిక్లేర్ చేసి భారత్ ఎదుట 365 పరుగుల టార్గెట్‌ను ఉంచింది. ఇరుజట్ల మధ్య అనధికారిక వన్డే సిరీస్ అక్టోబర్ 6 నుంచి జరగనుంది. ఈ నేపథ్యంలో తొలి అనధికారిక వన్డేకు పాండిచ్చేరి వేదిక కానుంది.
ఇదీ చదవండి: రేపు పాక్‌తో ఫైనల్.. అందరి కళ్లు ఆ ముగ్గురిపైనే!


