టీమిండియా వెటరన్ స్పిన్నర్ యుజువేంద్ర చహల్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. సోషల్ మీడియా వేదికగా శుక్రవారం ఇందుకు సంబంధించి భావోద్వేగ పోస్టు షేర్ చేశాడు. ‘నేను తొలిసారి పట్టుకున్న క్రికెట్ బాల్.. రెడ్ బాల్. అప్పుడు నాకు పదేళ్లు ఉంటాయేమో!
ఎన్నెన్నో విషయాలను నేర్పింది
ఆటతో ఇంతగా.. పీకల్లోతు ప్రేమలో మునిగిపోతానని నేను అప్పుడు అనుకోలేదు. నా దృష్టిలో రెడ్ బాల్ క్రికెట్ కేవలం ఓ ఫార్మాట్ మాత్రమే కాదు. ఓపిక, పట్టుదల, సవాళ్లను అధిగమించే తత్వం, గంటల పాటు మైదానంలో నిలబడటం.. ప్రతీ పరుగు, ప్రతీ వికెట్ కోసం పరుగులు తీయడం..
ఇలా ఎన్నెన్నో విషయాలను రెడ్‌బాల్ క్రికెట్ నాకు నేర్పించింది. ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో నా చివరి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడేశాను. టెస్టు క్రికెట్ క్యాప్ అందుకోవడం ప్రతీ క్రికెటర్ కల. చాలా ఏళ్ల పాటు నేను ఆ కలలోనే జీవించాను. ఏదేమైనా.. నాకు వచ్చిన ప్రతీ అవకాశానికి నేను రుణపడి ఉంటాను.
నా ఆట ఇక్కడితో అయిపోలేదు
నా జీవితంలో రెడ్ బాల్ క్రికెట్ ఎన్నో మధుర జ్ఞాపకాలు మిగిల్చింది. అయితే, నా ఆట ఇక్కడితో అయిపోలేదు. దేశం తరఫున ఆడాలనే తపన, ఆకలి, కసి నాలో ఇంకా మిగిలే ఉన్నాయి. నాలో ఇంకా క్రికెట్ మిగిలే ఉందని నేను నమ్ముతున్నాను.
వన్డే, టీ20 ఫార్మాట్లలో మరో అవకాశం కోసం నేను శాయశక్తులా కృషి చేస్తాను. హర్యానా క్రికెట్ అసోసియేషన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. నా ప్రయాణంలో సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు’’ అని చహల్ ఉద్వేగానికి లోనయ్యాడు.
టెస్టులలో దక్కని చోటు
కాగా హర్యానాకు చెందిన చహల్.. రైటార్మ్ లెగ్ బ్రేక్ స్పిన్నర్. టీమిండియా తరఫున 2016లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన అతడు.. ఇప్పటికి 72 వన్డేల్లో 121, 80 టీ20లలో 96 వికెట్లు పడగొట్టాడు. అయితే, టెస్టుల్లో మాత్రం అరంగేట్రం చేయలేకపోయాడు.
ఇదిలా ఉంటే.. 2009లో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో హర్యానా తరఫున ఎంట్రీ ఇచ్చిన చహల్.. ఇప్పటికి 49 మ్యాచ్‌లు ఆడాడు. మొత్తంగా 148 వికెట్లు పడగొట్టగా.. ఇందులో ఎనిమిది నాలుగు వికెట్ల, తొమ్మిది ఐదు వికెట్ల ప్రదర్శనలు ఉన్నాయి. ఇంగ్లండ్ కౌంటీలతో బిజీగా ఉన్న చహల్.. నార్తాంప్టన్‌షైర్ తరఫున తన కెరీర్‌లోనే చివరి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడేశాడు. ఇక చివరగా టీమిండియా తరఫున 2023లో మ్యాచ్ ఆడాడు.


