PC: Instagram
వైభవ్ సూర్యవంశీ.. భారత అండర్-19 జట్టు, ఐపీఎల్‌లో రాజస్తాన్ రాయల్స్ తరఫున సత్తా చాటి పదిహేనేళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు ఈ చిచ్చర పిడుగు. యూత్ వన్డే, టీ20, టెస్టుల్లో విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగి.. ఐపీఎల్‌లోనూ శతకాల మోత మోగించాడు ఈ లెఫ్టాండర్ బ్యాటర్.
ఇంపాక్ట్ ప్లేయర్‌గా
ఇక ఈ ఏడాది ఐపీఎల్‌లో ఏకంగా 237కు పైగా స్ట్రైక్‌రేటుతో 776 పరుగులు సాధించిన వైభవ్ సూర్యవంశీ. తద్వారా అత్యధిక పరుగుల వీరుడిగా ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. అయితే, 2026 సీజన్లో వైభవ్ ఎక్కువగా ఇంపాక్ట్ ప్లేయర్‌గానే బరిలోకి దిగాడు. ఫీల్డింగ్ సమయంలో బౌలర్లతో రాయల్స్ యాజమాన్యం అతడి స్థానాన్ని భర్తీ చేసేది.
అది వైభవ్‌కు.. క్రికెట్‌కు ఏమాత్రం మంచిది కాదు
ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ సుబ్రమణ్యం బద్రీనాథ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన కారణంగా వైభవ్ సూర్యవంశీ ఈసారి ఐపీఎల్‌లో చాలా తక్కువసార్లు మైదానంలో ఫీల్డింగ్ చేస్తూ కనిపించాడు. అతడికి ఇప్పుడు కేవలం పదిహేనేళ్లే.
ఇప్పటి నుంచే కేవలం బ్యాటింగ్‌కు పరిమితమై.. ఫీల్డింగ్‌కు తరచుగా దూరంగా ఉండటం.. అతడితో పాటు క్రికెట్‌కు కూడా ఎంతమాత్రం సరికాదు. ఈ ఏడాది శివం దూబే విషయంలోనూ ఇదే జరిగింది’’ అని బద్రీనాథ్ పేర్కొన్నాడు.
కాగా గతేడాది ఐపీఎల్‌లో అడుగుపెట్టిన వైభవ్ సూర్యవంశీ.. ఇప్పటికి 23 మ్యాచ్‌లు పూర్తి చేసుకుని కేవలం రెండు క్యాచ్‌లు మాత్రమే అందుకున్నాడు. ఇదిలా ఉంటే.. ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన కొనసాగించే విషయంలో అభిప్రాయాలు చెప్పాలని బీసీసీఐ ఇటీవల ఫ్రాంఛైజీలను కోరినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
ఫామ్ కోల్పోతే పరిస్థితి ఏమిటి?
ఇక టీమిండియా మాజీ ఫీల్డింగ్ కోచ్ ఆర్. శ్రీధర్.. వైభవ్ సూర్యవంశీ విషయంలో బద్రీనాథ్ అభిప్రాయంతో ఏకీభవించాడు. ‘‘ఐపీఎల్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల మంచి వినోదం దొరుకుతున్న మాట వాస్తవమే. కానీ సూర్యవంశీ వంటి యువ ఆటగాళ్లు మైదానంలోకి ఫీల్డింగ్ చేయకపోవడం సరికాదు.
ఎంతకాలం అతడు కేవలం బ్యాటింగ్ అనే నైపుణ్యంపై మాత్రమే ఆధారపడి జట్టుతో కొనసాగుతాడు. ఒకవేళ ఫామ్ కోల్పోతే అతడి పరిస్థితి ఏమిటి?.. అందుకే అతడు దులిప్ ట్రోఫీలో ఇటీవల బౌలింగ్ చేయడం కూడా మొదలుపెట్టాడు.
ప్రస్తుత పరిస్థితుల్లో క్రికెట్‌లో ఒక్క నైపుణ్యం మాత్రమే ఉంటే సరిపోదు. కచ్చితంగా ఫీల్డింగ్ చేయాల్సిందే’’ అని ఆర్. శ్రీధర్ పేర్కొన్నాడు. కాగా దులిప్ ట్రోఫీ-2026 రెడ్‌బాల్ టోర్నీలో ఈస్ట్ జోన్ వైస్ కెప్టెన్‌గా బరిలోకి దిగిన వైభవ్ సూర్యవంశీ.. లెఫ్టార్మ్ స్పిన్‌తో రెండు వికెట్లు తీశాడు. ప్రస్తుతం అతడు ఆసియా క్రీడలు-2026 టీ20 టోర్నీతో బిజీగా ఉన్నాడు.
చదవండి: IND vs WI: మూడో వన్డే.. అతడికి నో!.. ఆ ఇద్దరికి చోటివ్వాలి!


