టీమిండియా చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీపై మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మరో ఆరు నెలల్లోనే సూర్యవంశీ భారత టీ20 జట్టులో రెగ్యులర్ సభ్యుడిగా మారే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు. అదే జరిగితే తిలక్ వర్మ లేదా శివమ్ దూబేలో ఒకరు తుది జట్టులో చోటు కోల్పోవాల్సి వస్తుందని చెప్పాడు.
ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో భారత్ తరఫున అరంగేట్రం చేసిన సూర్యవంశీ.. జింబాబ్వే పర్యటనలో సత్తా చాటాడు. అయితే ప్రస్తుతం అతడు తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోతున్నాడు. త్వరలోనే పరిస్థితి మారుతుందని కైఫ్ అంచనా వేశాడు.
"తిలక్ జట్టుకు వైస్ కెప్టెన్ అని తెలుసు. కానీ గతంలో వైస్ కెప్టెన్లు కూడా జట్టు నుంచి తప్పించబడ్డ సందర్భాలు ఉన్నాయి. శివమ్ దూబే ప్రతి మ్యాచ్‌లోనూ పరుగులు చేయడం లేదు. అతడు ఇంకా మెరుగుపడాలి. అతడికి ఫీల్డింగ్ బలహీనత కూడా ఉంది. అతడు పూర్తి స్థాయి బౌలింగ్ ఆల్‌రౌండర్ కూడా కాదు.
మరో ఆరు నెలల్లో తిలక్ లేదా దూబేలో ఒకరు జట్టు నుంచి తప్పుకోవాల్సి రావచ్చు. వారి స్థానంలో సూర్యవంశీ తుది జట్టులోకి వస్తాడు" అని కైఫ్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తిలక్, దూబేకు వార్నింగ్ ఇచ్చాడు.
ఇక్కడ కైఫ్ వార్నింగ్‌లో అర్దముంది. ఎందుకంటే తిలక్, దూబే ఇటీవలికాలంలో పెద్దగా రాణించలేకపోతున్నారు. 2025, 2026లో తిలక్ వర్మ స్ట్రైక్‌రేట్ 129, 143గా మాత్రమే ఉంది. అతడు పెద్దగా స్కోర్లు కూడా చేయలేదు. దూబే పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. అతడి బ్యాటింగ్‌లో నిలకడగా రాణించాల్సి ఉంది. బౌలింగ్‌లోనూ అతడి ఎకానమీ రేట్ 11.33కు చేరింది. ఒకవేళ సూర్యవంశీ బౌలింగ్‌లో మరింత మెరుగైతే.. దూబే స్థానానికి ప్రమాదం తప్పదు.
ఇదీ చదవండి: 'కోహ్లితో నాకేంటి?.. నా ఆటయితే పూర్తి కాలేదు'


