వన్డే సమరం | Indias first ODI match against West Indies today | Sakshi
Sakshi News home page

వన్డే సమరం

Sep 27 2026 4:44 AM | Updated on Sep 27 2026 4:44 AM

Indias first ODI match against West Indies today

నేడు వెస్టిండీస్‌తో భారత్‌ తొలి మ్యాచ్‌ 

మధ్యాహ్నం 2 గం. నుంచి  స్టార్‌ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రసారం

తిరువనంతపురం: వచ్చే ఏడాది ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచకప్‌ జరగనున్న నేపథ్యంలో భారత జట్టు 50 ఓవర్ల ఫార్మాట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా సొంతగడ్డపై వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు సిద్ధమైంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆదివారం భారత్, విండీస్‌ మధ్య తొలి పోరు జరగనుంది. టి20, టెస్టు ఫార్మాట్‌లకు వీడ్కోలు పలికి కేవలం వన్డేల్లోనే కొనసాగుతున్న స్టార్‌ ప్లేయర్లు విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మపై అందరి దృష్టి నిలవనుంది. 

ఈ ఏడాది ఆడిన మూడు వన్డే సిరీస్‌ల్లో రెండింట ఓడిన శుబ్‌మన్‌ గిల్‌ సారథ్యంలోని టీమిండియా... స్టార్‌ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా, పేస్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా లేకుండానే బరిలోకి దిగనుంది. వన్డేల్లో 15 వేల పరుగుల మైలురాయి అందుకునేందుకు మరో 59 పరుగుల దూరంగా ఉన్న విరాట్‌ కోహ్లి... ఈ మ్యాచ్‌తోనే ఆ ఘనత ఖాతాలో వేసుకుంటాడా చూడాలి. పాండ్యా గైర్హాజరీలో ఆంధ్ర ఆల్‌రౌండర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డి ఎలాంటి ప్రదర్శన కనబరుస్తాడనేది కీలకంగా మారింది. 

‘హిట్‌మ్యాన్‌’ రోహిత్‌తో కలిసి కెప్టెన్‌ గిల్‌ ఇన్నింగ్స్‌ ఆరంభించనున్నారు. యశస్వి జైస్వాల్‌ మరికొంతకాలం ఎదురుచూడక తప్పదని బ్యాటింగ్‌ కోచ్‌ సీతాన్షు కొటక్‌ అన్నాడు. ఆసియా క్రీడల కోసం శ్రేయస్‌ అయ్యర్‌ జపాన్‌లో ఉండటంతో నాలుగో స్థానంలో రుతురాజ్‌ గైక్వాడ్‌ బరిలోకి దిగనున్నాడు. కేఎల్‌ రాహుల్, రవీంద్ర జడేజా, నితీశ్‌తో బ్యాటింగ్‌ లైనప్‌ పటిష్టంగా ఉంది. బౌలింగ్‌లో సిరాజ్, ప్రసిధ్‌తో పాటు మూడో పేసర్‌గా ఎవరిని ఎంపిక చేస్తారనేది ఆసక్తికరం. 

గుర్‌నూర్‌ బ్రార్, ఆఖిబ్‌ నబీలో ఒకరికి అవకాశం దక్కొచ్చు. స్పెషలిస్ట్‌ స్పిన్నర్‌గా కుల్దీప్‌ ఎంపిక ఖాయం. మరోవైపు ఈ ఫార్మాట్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోతున్న వెస్టిండీస్‌... వచ్చే ఏడాది జరగనున్న వరల్డ్‌కప్‌నకు నేరుగా అర్హత కూడా సాధించలేకపోయింది. మరి ఇలాంటి దశలో పటిష్టమైన టీమిండియాకు విండీస్‌ ఏమాత్రం పోటీనిస్తుందో చూడాలి. 2002 నుంచి కరీబియన్‌ జట్టు భారత్‌లో వన్డే సిరీస్‌ గెలవలేదు. పిచ్‌ పేస్‌కు సహకరించే అవకాశాలున్నాయి. మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉంది.  

ఇదే చివరి ప్రపంచకప్‌: కోహ్లి  
తిరువనంతపురం: వచ్చే ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్‌ తన కెరీర్‌లో దేశం తరఫున ఆడే చివరి వరల్డ్‌కప్‌ అని భారత స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి వెల్లడించాడు. ఆ ట్రోఫీ గెలుచుకునేందుకు మైదానంలో సర్వశక్తులు ఒడ్డుతానని పేర్కొన్నాడు. 2011లో మహేంద్రసింగ్‌ ధోనీ సారథ్యంలో వన్డే ప్రపంచకప్‌ గెలిచిన భారత జట్టులో సభ్యుడైన విరాట్‌... వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు ముందు తన మనసులో మాట వెల్లడించాడు. 

‘టీమిండియా తరఫున నేను ఆడబోయే చివరి ప్రపంచకప్‌ ఇదే. అదే నాకు ప్రధాన ప్రేరణ. గ్రౌండ్‌లో సర్వస్వం ధారపోయాలనేదే నా లక్ష్యం. కచ్చితంగా ప్రపంచకప్‌ గెలవడమే ధ్యేయం. దాని కోసం ఎంతటి కష్టాన్ని భరించేందుకైనా నేను సిద్ధమే. వన్డే వరల్డ్‌కప్‌లో ఉండే తీవ్రత మరే ఇతర టోర్నీలో ఉండదు’ అని కోహ్లి వెల్లడించాడు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement