IND vs WI: తొలి వన్డేకు భారత తుదిజట్టు.. నాలుగో స్థానంలో అతడే! | Play Jaiswal at No 4: Kaif picks India playing 11 IND vs WI 2026 1st ODI | Sakshi
Sakshi News home page

IND vs WI: తొలి వన్డేకు భారత తుదిజట్టు ఇదే! నాలుగో స్థానంలో అతడే

Sep 26 2026 4:29 PM | Updated on Sep 26 2026 4:57 PM

Play Jaiswal at No 4: Kaif picks India playing 11 IND vs WI 2026 1st ODI

శ్రేయస్‌ అయ్యర్‌తో కోహ్లి (ఫైల్‌ ఫొటో PC: BCCI X)

భారత వన్డే జట్టు స్వదేశంలో వెస్టిండీస్‌తో సిరీస్‌కు సిద్ధమైంది. ఇరుజట్ల మధ్య ఆదివారం (సెప్టెంబరు 27) నుంచి మూడు మ్యాచ్‌ల సిరీస్‌ ఆరంభం కానుంది. ఈ క్రమంలో తొలి వన్డే కోసం ఇప్పటికే టీమిండియా తిరువనంతపురం చేరుకుని ప్రాక్టీస్‌ కూడా చేసింది.

ఈ నేపథ్యంలో విండీస్‌తో మొదటి వన్డేకు భారత తుదిజట్టు ఎలా ఉండబోతున్న అంశంపై టీమిండియా మాజీ బ్యాటర్‌ మహ్మద్‌ కైఫ్‌ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. టెస్టుల్లో ఓపెనర్‌గా పాతుకుపోయిన యశస్వి జైస్వాల్‌ను నాలుగో స్థానంలో బరిలోకి దించాలని యాజమాన్యానికి సూచించాడు.

టాపార్డర్‌లో వీరే
ఈ మేరకు తన యూట్యూబ్‌ చానెల్‌ వేదికగా మాట్లాడుతూ.. ‘‘రోహిత్‌ శర్మ- శుబ్‌మన్‌ గిల్‌ ఓపెనింగ్‌ జోడీగా కొనసాగడం ఖాయం. విరాట్‌ కోహ్లి యథావిధిగా మూడో స్థానంలోనే వస్తాడు. అయితే, ఈ సిరీస్‌లో యశస్వి జైస్వాల్‌ను మిడిలార్డర్‌లో కీలకమైన నాలుగో స్థానంలో ఆడించాలి.

శ్రేయస్‌ లేడు కాబట్టి
ఎలాగో శ్రేయస్‌ అయ్యర్‌ జట్టుతో లేడు కాబట్టి ఇది సరైన నిర్ణయమే అవుతుంది. రుతురాజ్‌ గైక్వాడ్‌ ఐదో స్థానంలో బ్యాటింగ్‌ చేయగలడు. ఇక కేఎల్‌ రాహుల్‌ ఆరు, రవీంద్ర జడేజా ఏడో స్థానంలో రాగా.. నితీశ్‌ కుమార్‌ రెడ్డి, కుల్దీప్‌ యాదవ్‌ మిగిలిన స్థానాల్లో బ్యాటింగ్‌ చేస్తారు.

ఇద్దరినీ ఆడించవచ్చు
ఈ సిరీస్‌లో జైస్వాల్‌, గైక్వాడ్‌.. ఇద్దరినీ ఆడించే ఆస్కారం ఉంది. పరిమిత ఓవర్ల క్రికెట్లో ఇలాంటి సర్దుబాట్లు చేసుకోవచ్చు. జైస్వాల్‌ నాలుగో స్థానంలోనూ బ్యాటింగ్‌ చేయగలడు’’ అని కైఫ్‌ అభిప్రాయపడ్డాడు. ఫాస్ట్‌ బౌలర్ల కోటాలో ప్రసిద్‌ కృష్ణ, గుర్నూర్‌ బ్రార్‌ ఆడతారని అంచనా వేశాడు.

కాగా భారత టీ20 జట్టు కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ ప్రస్తుతం జపాన్‌లో ఆసియా క్రీడలు-2026 టోర్నీతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జైస్వాల్‌ను నాలుగో స్థానంలో బ్యాటింగ్‌ పంపి ప్రయోగం చేయవచ్చని కైఫ్‌ చెప్పుకొచ్చాడు. 

కాగా యశస్వి జైస్వాల్‌ ఇప్పటి వరకు ఆరు వన్డేలు ఆడి 285 పరుగులు చేశాడు. చివరగా స్వదేశంలో అఫ్గానిస్తాన్‌తో జూన్‌లో మ్యాచ్‌ ఆడి అజేయ సెంచరీ (110) చేశాడు. మరోవైపు.. రుతురాజ్‌ గైక్వాడ్‌ ఇప్పటికి తొమ్మిది వన్డేల్లో 228 పరుగులు చేశాడు. చివరగా గతేడాది డిసెంబరులో సౌతాఫ్రికాతో వన్డే ఆడాడు.

వెస్టిండీస్‌తో వన్డే కోసం కైఫ్‌ ఎంచుకున్న భారత తుదిజట్టు
రోహిత్‌ శర్మ, శుబ్‌మన్‌ గిల్‌ (కెప్టెన్‌), విరాట్‌ కోహ్లి, యశస్వి జైస్వాల్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, కేఎల్‌ రాహుల్‌, రవీంద్ర జడేజా, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, కుల్దీప్‌ యాదవ్‌, ప్రసిద్‌ కృష్ణ, గుర్నూర్‌ బ్రార్‌.

చదవండి: సచిన్‌తో అర్జున్‌కు పోలికేంటి?: సెహ్వాగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement