టీమిండియా తరఫున అదే చివరిది: విరాట్‌ కోహ్లి | It's The Last: Virat Kohli Confirms His Last Tournament For India | Sakshi
Sakshi News home page

టీమిండియా తరఫున.. నా కెరీర్‌లో అదే చివరిది: విరాట్‌ కోహ్లి

Sep 26 2026 2:32 PM | Updated on Sep 26 2026 2:44 PM

It's The Last: Virat Kohli Confirms His Last Tournament For India

విరాట్‌ కోహ్లి (PC; BCCI/X)

టీమిండియా దిగ్గజ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి కీలక వ్యాఖ్యలు చేశాడు. తన అంతర్జాతీయ కెరీర్‌ చివరి దశకు చేరిందనే సంకేతాలు ఇచ్చాడు. భారత్‌ తరఫున వన్డే వరల్డ్‌కప్‌-2027 ఈవెంట్‌ తన అంతర్జాతీయ కెరీర్‌లో చివరి ఐసీసీ టోర్నమెంట్‌ అని పేర్కొన్నాడు.

ఇప్పటికే టీ20, టెస్టులకు గుడ్‌బై
కాగా టీ20 ప్రపంచకప్‌-2024లో టీమిండియా చాంపియన్‌గా నిలిచిన తర్వాత కోహ్లి అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. అనూహ్య రీతిలో గతేడాది టెస్టులకు కూడా ‘కింగ్‌’ రిటైర్మెంట్‌ ప్రకటించాడు. ప్రస్తుతం వన్డే ఫార్మాట్‌తో పాటు.. ఐపీఎల్‌లో రాయల్‌ చాలెంజర్‌ చాలెంజర్స్‌ తరఫున టీ20 క్రికెట్‌లో కొనసాగుతున్నాడు.

టీమిండియా తరఫున అదే చివరిది
ఇక ప్రస్తుతం కోహ్లి స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగే వన్డే సిరీస్‌కు సన్నద్ధమవుతున్నాడు. ఈ నేపథ్యంలో జియోస్టార్‌తో మాట్లాడుతూ.. ‘‘టీమిండియా తరఫున నేను ఆడబోయే చివరి వరల్డ్‌కప్‌ ఇదే (వన్డే ప్రపంచకప్‌-2027). ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే సిరీస్‌కు పూర్తిస్థాయిలో సిద్ధమయ్యాను.

ఇక వరల్డ్‌కప్‌ ట్రోఫీ గెలవడం అనేదే అంతిమ లక్ష్యం. ఈ ప్రయాణం ఎక్కడిదాకా సాగుతుందో తెలియదు. అన్నింటికీ నేను సిద్ధంగానే ఉన్నాను’’ అని కోహ్లి పేర్కొన్నాడు. కాగా ఈ ఏడాది ఇప్పటికి ఆరు వన్డేలు ఆడిన కోహ్లి 384 పరుగులతో సత్తా చాటాడు. ఇందులో మూడు అర్ధ శతకాలు కూడా ఉన్నాయి.

వరల్డ్‌కప్‌ ఆడటం లాంఛనమే!
ఇక గత 10 వన్డే ఇన్నింగ్స్‌లో కోహ్లి మూడు సెంచరీలు చేయడంతో పాటు ఐదు హాఫ్‌ సెంచరీలు కూడా సాధించాడు. దీనిని బట్టి కోహ్లి సూపర్‌ ఫామ్‌లో ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. కాబట్టి 37 ఏళ్ల కోహ్లిని వన్డే వరల్డ్‌కప్‌ జట్టు నుంచి తప్పించే సాహసం టీమిండియా సెలక్టర్లు చేయరనే చెప్పవచ్చు.

కాగా 2008లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన కోహ్లి.. 123 టెస్టుల్లో 30 శతకాల సాయంతో 9230 పరుగులు సాధించాడు. 125 టీ20లలో ఓ సెంచరీ బాది 4188 పరుగులు చేశాడు. ఇక వన్డేల్లో ఇప్పటికి 314 మ్యాచ్‌లు ఆడి 14941 పరుగులు సాధించాడు. అంతేకాదు యాభై ఓవర్ల ఫార్మాట్లో అత్యధికంగా 54 సెంచరీలు సాధించి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.

చదవండి: సచిన్‌తో అతడికి పోలికేంటి?: సెహ్వాగ్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement