source: X
ఏషియన్ గేమ్స్ 2026 పురుషుల క్రికెట్‌లో నాలుగు క్వార్టర్ ఫైనల్ బెర్త్‌లు ఖరారయ్యాయి. గ్రూప్ దశ మ్యాచ్‌ల తర్వాత నేపాల్, ఆఫ్ఘనిస్తాన్, మలేషియా, హాంగ్‌కాంగ్ చైనా జట్లు ఫైనల్-8కు చేరుకున్నాయి. సీడింగ్, ఐసీసీ ర్యాంకింగ్ ఆధారంగా భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్ జట్లకు నేరుగా క్వార్టర్‌ఫైనల్ బెర్త్‌లు లభించిన విషయం తెలిసిందే.
తాజాగా మలేషియా, ఒమన్ మధ్య జరగాల్సిన చివరి గ్రూప్-బి మ్యాచ్ వర్షం కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడంతో గ్రూప్ టాపర్‌గా నిలిచిన మలేషియా, సెకెండ్ టాపర్ అయిన హాంగ్‌కాంగ్ చైనా క్వార్టర్స్‌కు చేరుకున్నాయి. ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయిన ఒమన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.
అంతకుముందే గ్రూప్-ఏ నుంచి నేపాల్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు క్వార్టర్స్‌కు చేరుకున్నాయి. జపాన్, నేపాల్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో ఈ రెండు జట్లు క్వార్టర్ ఫైనల్ బెర్త్‌లు దక్కించుకున్నాయి. టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా గెలవని జపాన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.
క్వార్టర్స్‌లో ఎవరెవరు..?
గ్రూప్-ఏ టాపర్‌గా నిలిచిన నేపాల్ సెప్టెంబర్ 29న జరిగే మూడో క్వార్టర్ ఫైనల్లో శ్రీలంకను ఢీకొంటుంది. అదే గ్రూప్‌లో రెండో స్థానంలో నిలిచిన ఆఫ్ఘనిస్తాన్ సెప్టెంబర్ 28న జరిగే రెండో క్వార్టర్ ఫైనల్లో భారత జట్టుతో తలపడనుంది.
గ్రూప్-బి టాపర్‌గా నిలిచిన మలేషియా సెప్టెంబర్ 29న జరిగే నాలుగో క్వార్టర్ ఫైనల్లో బంగ్లాదేశ్‌తో తలపడుతుంది. రెండో స్థానంలో నిలిచిన హాంగ్‌కాంగ్ చైనా సెప్టెంబర్ 28న జరిగే తొలి క్వార్టర్ ఫైనల్లో పాకిస్తాన్‌ను ఢీకొంటుంది.
ఇదీ చదవండి: ఏషియన్ గేమ్స్‌లో భారత్‌కు మరో గోల్డ్


