‘నా వికెట్‌ తీశావు.. సంబరాలు చేసుకో.. దూషిస్తే మాత్రం సహించను’ | Dhruv Jurel Reveals What Really Happened Between Yashasvi Jaiswal And Asitha Fernando During Heated Clash, Read Full Story Inside | Sakshi
Sakshi News home page

‘నా వికెట్‌ తీశావు.. సంబరాలు చేసుకో.. కానీ దూషిస్తే మాత్రం సహించను’

Sep 26 2026 11:58 AM | Updated on Sep 26 2026 12:41 PM

You took my wicket but: Jurel reveals What Jaiswal Said To Lanka Pacer

PC: Sonysports X

‘‘ఆరోజు జైసూ అవుట్‌ కాగానే నెమ్మదిగా డ్రెసింగ్‌ రూమ్‌ వైపు కదిలాడు. అతడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మరోసారి ఫుటేజీలో చూసినా ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది. అకస్మాత్తుగా జైస్వాల్‌ వెనక్కి తిరిగినట్లు కనిపిస్తుంది. ఆరోజు శ్రీలంక పేసర్‌ అసభ్య పదజాలంతో జైస్వాల్‌ను దూషించాడు.

అతడు అదే పనిగా తనను దూషిస్తున్నట్లు జైస్వాల్‌తో నాతో చెప్పాడు’’ అని టీమిండియా వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ధ్రువ్‌ జురెల్‌ గత జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నాడు. శ్రీలంక పేసర్‌ అసిత ఫెర్నాండో రెచ్చగొట్టినందు వల్లే జైస్వాల్‌ స్పందించాల్సి వచ్చిందని తాజాగా స్పష్టం చేశాడు.

తీవ్రస్థాయిలో వాగ్వాదం 
కాగా గత నెల (ఆగష్టు)లో టీమిండియా శ్రీలంక పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆతిథ్య జట్టుతో రెండు టెస్టులు ఆడి.. సిరీస్‌ను 1-0తో కైవసం చేసుకుంది. అయితే, రెండో టెస్టు తొలి రోజు ఆట సందర్భంగా భారత ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌- లంక పేసర్‌ అసిత ఫెర్నాండో మధ్య వాగ్వాదం జరిగింది.

మరుసటి బంతికే క్లీన్‌బౌల్డ్‌
టీమిండియా ఇన్నింగ్స్‌లో అసిత.. 17వ ఓవర్‌ వేయగా.. అతడి బౌలింగ్‌లో జైస్వాల్‌ రెండు, నాలుగు, ఐదో బంతులకు ఫోర్లు బాదాడు. అయితే, ఆ మరుసటి బంతికే క్లీన్‌బౌల్డ్‌ అయిపోయాడు. దీంతో జైస్వాల్‌ మైదానం వీడుతున్న క్రమంలో.. అసిత ఏదో అన్నట్లు కనిపించింది.

కొట్టుకునేదాకా వెళ్లారు
ఇందుకు జైసూ ఘాటుగానే బదులిస్తూ.. అసిత మీదకు దూసుకువెళ్లాడు. అసిత కళ్లల్లోకి కళ్లు పెట్టి చూస్తూ కోపంగా తన హెల్మెట్‌తో నెట్టేసే ప్రయత్నం చేశాడు. పరిస్థితిని గమనించిన లంక కెప్టెన్‌ ధనంజయ డి సిల్వ ఇద్దరినీ విడదీసే ప్రయత్నం చేశాడు.

ఈ నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్‌ మండలి జైస్వాల్‌, అసితలపై కఠిన చర్యలు తీసుకుంది. నిబంధనలు అతిక్రమించారన్న కారణంగా ఇద్దరి మ్యాచ్‌ ఫీజులో 25 శాతం కోత విధించడంతో పాటు.. ఇద్దరి ఖాతాలో చెరో డీ మెరిట్‌ పాయింట్‌ జతచేసింది.

నా వికెట్‌ తీశావు.. కాబట్టి దూకుడుగా సంబరాలు చేసుకో.. కానీ
ఈ విషయం గురించి తాజాగా ఆకాశ్‌ చోప్రా ఇంటర్వ్యూలో.. నాడు జైసూతో కలిసి మ్యాచ్‌ ఆడిన ధ్రువ్‌ జురెల్‌ స్పందించాడు. ఆరోజు జరిగిన ఘటనలో జైస్వాల్‌ తప్పేమీ లేదని స్పష్టం చేశాడు. ‘‘ఆరోజు జైస్వాల్‌ అవుటైన తర్వాత వెళ్లిపోతున్న సమయంలో అసిత రెచ్చగొట్టాడు.

ఇందుకు బదులిస్తూ.. ‘నువ్వు నా వికెట్‌ తీశావు.. కాబట్టి దూకుడుగా సంబరాలు చేసుకో. కానీ నన్ను దూషించే హక్కు నీకు లేదు’ అని చెప్పాడు. అయినా జైస్వాల్‌ ఎప్పుడూ ఎవరినీ స్లెడ్జ్‌ చేయడు.

ఎవరైనా తనను రెచ్చగొడితే మాత్రం అస్సలు ఊరుకోడు. వారి ప్రవర్తనకు తగ్గట్లే బదులిస్తాడు. క్రీజులో ఉన్నపుడు కేవలం బ్యాటింగ్‌ మీదే తన దృష్టి ఉంటుంది. కానీ ఎవరైనా ఇలా రెచ్చగొడితే మాత్రం చూస్తూ ఊరుకోడు’’ అని జురెల్‌ చెప్పుకొచ్చాడు.

చదవండి: ఆసియా క్రీడలు- 2026: టీమిండియా క్వార్టర్‌ ఫైనల్‌ ప్రత్యర్థి ఖరారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement