నా మాట వినరా?.. బీజేపీపై అమరీందర్‌ షాకింగ్‌ కామెంట్స్‌ | Capt Amarinder Singh Expresses Disappointment With BJP Over Lack Of Consultation On Punjab Affairs Ahead of Polls | Sakshi
Sakshi News home page

నా మాట వినరా?.. బీజేపీపై అమరీందర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Sep 26 2026 9:27 AM | Updated on Sep 26 2026 10:35 AM

Capt Amarinder Singh upset with BJP party

ఆరు దశాబ్దాల రాజకీయ అనుభవం.. రెండుసార్లు పంజాబ్‌ ముఖ్యమంత్రిగా పనిచేసిన ట్రాక్‌ రికార్డ్‌.. అయినా బీజేపీలో తన మాటకు విలువ లేదంటున్నారు మాజీ సీఎం కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌. పంజాబ్‌ రాజకీయాలపై తన అభిప్రాయాలను పార్టీ అడగడం లేదని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఎన్నికలకు ముందు సొంత పార్టీ తీరుపైనే సీనియర్‌ నేత అసంతృప్తి వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.

మాజీ సీఎం అమరీందర్‌ సింగ్‌ తాజాగా ఓ జాతీయ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పంజాబ్‌ రాజకీయాలను దాదాపు 60 ఏళ్లుగా పరిశీలిస్తున్నాను. రాష్ట్రం అనేక సంక్లిష్ట పరిణామాలను ఎదుర్కొన్న సమయంలోనూ నేను పనిచేశాను. నా అనుభవం ఆధారంగా చెప్పే అభిప్రాయాలను బీజేపీ అడగడం లేదు. నా అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని మాత్రమే నేను కోరుకుంటున్నాను. పంజాబ్‌ వ్యవహారాలను చూసే బీజేపీకి చెందిన కొంతమంది పార్టీ పదాధికారులకు రాష్ట్ర రాజకీయాల్లో ఏడాది అనుభవం కూడా పూర్తికాలేదు. అయినప్పటికీ అలాంటి వారి అభిప్రాయాలను తీసుకుంటున్నారు. కానీ, నా వంటి సీనియర్‌ నేతల అభిప్రాయాలను పార్టీ కోరడం లేదు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  

ఇదిలా ఉండగా.. ఆయన మళ్లీ కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉందన్న ఊహాగానాలపై కూడా స్పందించారు. రాజకీయ పార్టీల్లో మార్పులు సహజమేనని చెప్పిన అమరీందర్‌.. ప్రస్తుతం మాత్రం బీజేపీని వీడే ఆలోచన లేదని స్పష్టం చేశారు. పంజాబ్‌పై తన అభిప్రాయాలను పార్టీకి చెప్పడం బీజేపీ సభ్యుడిగా తన బాధ్యత అని పేర్కొన్నారు. దీంతో, కెప్టెన్‌ వ్యాఖ్యలు బీజేపీ హైకమాండ్‌కు షాక్‌ తగిలేలా చేశాయి. అలాగే, 84 ఏళ్ల వయసుపై అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. వయసు రాజకీయ జీవితానికి తప్పనిసరిగా ముగింపు కాదని అన్నారు. మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్‌ 81 ఏళ్ల వయసులో ప్రధానమంత్రి అయ్యారని గుర్తుచేశారు.

అయితే.. అమరీందర్‌ సింగ్‌ 2022లో తన పార్టీ పంజాబ్‌ లోక్‌ కాంగ్రెస్‌ను బీజేపీలో విలీనం చేశారు. అంతకుముందు కాంగ్రెస్‌తో విభేదాల నేపథ్యంలో ఆ పార్టీని వీడి సొంత పార్టీని ఏర్పాటు చేశారు. కాగా, 117 స్థానాలున్న పంజాబ్‌ అసెంబ్లీకి వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అమరీందర్‌ సింగ్‌ వ్యాఖ్యలు రాష్ట్ర బీజేపీ రాజకీయాలపై చర్చకు దారితీశాయి.

ఇదీ చదవండి: వీరమణి కేసులో డీఎంకేపై విజయ్‌ సంచలన వ్యాఖ్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement