బిగ్‌ ఫైట్‌!.. ఖైరతాబాద్‌ ఉప ఎన్నిక అనివార్యం | Khairatabad by-election inevitable following Supreme Court verdict | Sakshi
Sakshi News home page

బిగ్‌ ఫైట్‌!.. ఖైరతాబాద్‌ ఉప ఎన్నిక అనివార్యం

Sep 25 2026 4:55 AM | Updated on Sep 25 2026 4:55 AM

Khairatabad by-election inevitable following Supreme Court verdict

సుప్రీంకోర్టు తీర్పుతో ఖైరతాబాద్‌ ఉప ఎన్నిక అనివార్యం  

మూడు ప్రధాన పార్టీల మధ్య మరోసారి కీలక పోరు 

ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్న కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ 

దానం నాగేందర్‌ రాజకీయ భవితవ్యంపై సర్వత్రా ఆసక్తి 

కాంగి‘రేసు’లో దానంతో పాటు విజయారెడ్డి, రోహిణ్‌ రెడ్డి, గద్వాల విజయలక్ష్మి  

బీఆర్‌ఎస్‌ టికెట్‌ కోసం మన్నె గోవర్ధన్‌రెడ్డి, తలసాని సాయికిరణ్‌ పోటీ పడే చాన్స్‌ 

బీజేపీ ఆశావహుల్లో చింతల రామచంద్రారెడ్డితో పాటు ఎన్‌వీ సుభాష్‌, ఇంద్రసేన్‌రెడ్డి, కీర్తిరెడ్డి 

నియోజకవర్గంలో మైనారిటీలు, బస్తీ ఓటర్లే కీలకం 

హైదరాబాద్‌ భవిష్యత్‌ రాజకీయాలపై ఇక్కడి గెలుపు ప్రభావం!

సాక్షి, హైదరాబాద్‌: దానం నాగేందర్‌పై హైకోర్టు వేసిన అనర్హత వేటును సుప్రీంకోర్టు సమర్థించడం, ఖైరతాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక ఖాయమని తేలడంతో రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పక్షాల నడుమ మరో కీలక ఎన్నికల పోరుకు రంగం సిద్ధమవుతోంది. రాజకీయ వేడి ఎక్కువగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఉప ఎన్నికను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నాయి. మరోవైపు..సుమారు మూడు దశాబ్దాలుగా హైదరాబాద్‌ రాజకీయాల్లో కీలక నేతగా ఉన్న దానం భవిష్యత్‌ను ఉప ఎన్నిక ఎలాంటి మలుపు తిప్పుతుందనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఖైరతాబాద్‌ నుంచి ఆయనకు కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ ఇస్తుందా? లేక ఎమ్మెల్సీ పదవితో పాటు మంత్రి పదవి ఇచ్చి ప్రత్యామ్నాయ మార్గం చూపుతుందా? అని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. అభ్యర్థి విషయం పక్కన పెడితే.. హైదరాబాద్‌ పరిధిలోని సికింద్రాబాద్‌  కంటోన్మెంట్, జూబ్లీహిల్స్‌ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్‌లో ఖైరతాబాద్‌ను కూడా కైవసం చేసుకుంటామనే ధీమా కనిపిస్తోంది. అయితే సిట్టింగ్‌ స్థానాన్ని నిలబెట్టుకోవడం ద్వారా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో తన పట్టును నిరూపించుకోవాలని బీఆర్‌ఎస్‌ భావిస్తోంది. మరోవైపు గతంలో ఈ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించిన బీజేపీ కూడా తమ సత్తాను చాటి కాంగ్రెస్‌కు తామే ప్రత్యామ్నాయం అనే సంకేతాలు పంపాలని అనుకుంటోంది. మొత్తం మీద ఖైరతాబాద్‌ ఉప ఎన్నిక ఫలితం సమీప భవిష్యత్తులో జరిగే గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని మూడు మున్సిపల్‌ కార్పొరేషన్ల ఎన్నికలపైనా ప్రభావం చూపుతుందని ప్రధాన రాజకీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్‌ అంచనా వేస్తున్నాయి. ఇదే అంచనాతో ఖైరతాబాద్‌పై పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించనున్నాయి. అన్ని పార్టీల్లోనూ అశావహులకు కొదవ లేకున్నా గెలుపు గుర్రాల కోసమే అన్వేషణ ప్రారంభించనున్నాయి.  

దానంకు కాంగ్రెస్‌లోనే తీవ్ర పోటీ 
ఆసిఫ్‌నగర్‌లో (1989లో) పోటీ చేసి మజ్లిస్‌ చేతిలో ఓటమి పాలైన దానం నాగేందర్‌ తరువాత 1994,1999 ఎన్నికల్లో అదే నియోజకవర్గంలో విజయకేతనం ఎగరేశారు. అయితే 2004లో ఆసిఫ్‌నగర్‌ టికెట్‌ దక్కక పోవడంతో టీడీపీలో చేరి గెలుపొందిన దానం.. కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంతో టీడీపీలో ఉండలేక కాంగ్రెస్‌లో చేరేందుకు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అప్పుడు జరిగిన ఆసిఫ్‌నగర్‌ ఉప ఎన్నికలో ఓటమి పాలయ్యారు. నియోజకవర్గాల పునర్విభజన తరువాత 2009లో ఖైరతాబాద్‌ నుంచి కాంగ్రెస్‌ పక్షాన పోటీ చేసి విజయం సాధించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో 2014లో బీజేపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి చేతిలో ఓటమి పాలైన దానం ఆ తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరారు. 2018, 2023 ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా వరుసగా రెండు పర్యాయాలు గెలుపొందారు. అయితే 2024 మార్చిలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే, కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కాగా 2023 ఎన్నికల్లో దానం నాగేందర్‌పై కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన పి.విజయారెడ్డి 42 వేలకు పైగా ఓట్లను సాధించారు. ఆమె కూడా ప్రస్తుతం కాంగ్రెస్‌లోనే కొనసాగుతుండటంతో పార్టీ టికెట్‌ కోసంవిజయారెడ్డి కూడా ప్రయత్నించే అవకాశం ఉంది. మరోవైపు సీఎం రేవంత్‌రెడ్డికి సన్నిహితుడు డాక్టర్‌ రోహిన్‌రెడ్డి, మాజీ మేయర్‌ అయిన గద్వాల విజయలక్ష్మి కూడా పోటీలో ఉండడానికి ఆసక్తి కనపరుస్తున్నట్లు సమాచారం. 

సిట్టింగ్‌ సీటుపై బీఆర్‌ఎస్‌ కన్ను 
ఖైరతాబాద్‌ నియోజకవర్గంలో వరుసగా రెండుసార్లు గెలుపొందిన బీఆర్‌ఎస్‌ మరోసారి ఆ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు పావులు కదుపుతోంది. దానం నాగేందర్‌తో పాటు గతంలో బీఆర్‌ఎస్‌ నుంచి కార్పొరేటర్లుగా గెలుపొందిన విజయారెడ్డి, గద్వాల విజయలక్ష్మి ప్రస్తుతం కాంగ్రెస్‌లో చేరారు. ఇక ఉద్యమ కాలం నుంచి పార్టీని అంటిపెట్టుకుని పనిచేస్తున్న మన్నె గోవర్ధన్‌రెడ్డి ఉప ఎన్నికలో తనకు టికెట్‌ ఖాయమనే ధీమాతో ఉన్నారు. ఆయన భార్య మన్నె కవితారెడ్డి వరుసగా రెండుమార్లు జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్‌గా పనిచేశారు. 2018లోనూ ఖైరతాబాద్‌ టికెట్‌ను ఆశించిన గోవర్ధన్‌రెడ్డి బీఎస్‌పీ నుంచి పోటీ చేసి గణనీయమైన ఓట్లు సాధించారు. ఆ తర్వాత తిరిగి బీఆర్‌ఎస్‌లో చేరి క్రియాశీలంగా పనిచేస్తున్నారు. అయితే మాజీ మంత్రి, సనత్‌నగర్‌ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ కుమారుడు తలసాని సాయికిరణ్‌ కూడా ఖైరతాబాద్‌ ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. హైదరాబాద్‌ జిల్లా పరిధిలో బీఆర్‌ఎస్‌ కార్యక్రమాల్లో తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ పెద్ద దిక్కుగా ఉంటున్నారు. యాదవ సామాజికవర్గం, బీసీ కోణంలో తన కుమారుడిని బరిలో దింపేందుకు ఆయన కూడా ఆసక్తి చూపుతున్నారు. సాయికిరణ్‌ పోటీలో ఉంటే తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నీ తానై వ్యవహరిస్తారని పార్టీ కూడా భావిస్తున్నట్టు సమాచారం. అయితే 2019 ఎన్నికల్లో సికింద్రాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన సాయికిరణ్‌ ఓటమి పాలయ్యారు. 

చేజారిన పట్టును తిరిగి సాధించేందుకు.. 
గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు 2020లో జరిగిన ఎన్నికల్లో భారీ ఫలితాలను సాధించిన బీజేపీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం కేవలం గోషామహల్‌లో గెలుపునకే పరిమితమైంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్‌ లోక్‌సభ సీటు నుంచి బీజేపీ ఎంపీగా గెలుపొందిన కిషన్‌రెడ్డి కేంద్ర కేబినెట్‌లో కీలక పదవిలో ఉన్నారు. ఖైరతాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గం ఇదే లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఉండటంతో.. ఉప ఎన్నికను అవకాశంగా తీసుకుని గతంలో కోల్పోయిన పట్టును తిరిగి సాధించాలని భావిస్తోంది. 2014లో టీడీపీ పొత్తుతో ఖైరతాబాద్‌ నుంచి బీజేపీ తరఫున గెలిచిన చింతల రామచంద్రారెడ్డి 2018, 2023లోనూ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. చింతల మరోమారు టికెట్‌ ఆశిస్తుండగా ఎన్‌వీ సుభాష్‌, బి.ఇంద్రసేన్‌రెడ్డి, జూటూరి కీర్తిరెడ్డి పేర్లు కూడా బీజేపీ ఆశావహుల జాబితాలో ఉన్నాయి.  

గెలుపు వ్యూహ రచనలో మూడు పార్టీలు 
ప్రతిష్టాత్మకంగా మారిన ఖైరతాబాద్‌ సీటును దక్కించుకునేందుకు కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీలు వ్యూహం సిద్ధం చేసుకుంటున్నాయి. దానంకు ఉన్న సుదీర్ఘ అనుభవం, గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన విజయారెడ్డి కూడా పార్టీలోనే కొనసాగుతుండటం కలిసి వచ్చే అంశంగా కాంగ్రెస్‌ భావిస్తోంది. టికెట్‌ కేటాయింపులో ఎలాంటి అసంతృప్తికి తావు లేకుండా గెలుపు గుర్రాన్ని బరిలోకి దించాలనే భావన అధికార పార్టీలో కనిపిస్తోంది. అయితే విజయారెడ్డి సోదరుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి బీఆర్‌ఎస్‌లో ఉన్నారు. ఉప ఎన్నిక ప్రచారంలో ఆయన క్రియాశీలంగా పనిచేసే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రంలో రేవంత్‌ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత తీవ్ర స్థాయికి చేరిందని అంచనా వేస్తున్న బీఆర్‌ఎస్‌.. అభ్యర్థి ఎంపికలో ఆచితూచి వ్యవహరించనుంది. నగరంలో బలమైన బీసీ సామాజికవర్గానికి చెందిన మాజీ మంత్రి తలసానికే అభ్యర్థి ఎంపిక మొదలు ఇతరత్రా కీలక బాధ్యతలు అప్పగించే సూచనలు కన్పిస్తున్నాయి. మరోవైపు బీజేపీ కూడా కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌పై ఉన్న వ్యతిరేకతను తన వైపు తిప్పుకునేలా వ్యూహాన్ని అమలు చేయాలని భావిస్తోంది. పార్టీల వ్యూహాలు ఎలా ఉన్నా..నియోజకవర్గంలోని మైనారిటీలు, బస్తీ ఓటర్లు, అభ్యర్థుల వ్యక్తిగత నెట్‌వర్క్, పార్టీల ఓటు బ్యాంకు తదితరాలు ఉప ఎన్నికలో ప్రధానంగా ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయి.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement