చిన్న ఐటీ సంస్థలకూ ఊతమిస్తాం | Sridhar Babu says We will also provide boost to small IT companies | Sakshi
Sakshi News home page

చిన్న ఐటీ సంస్థలకూ ఊతమిస్తాం

Sep 25 2026 4:22 AM | Updated on Sep 25 2026 4:22 AM

Sridhar Babu says We will also provide boost to small IT companies

పరిమిత వనరులతో జీసీసీలు పెట్టే కంపెనీల కోసం షేర్డ్‌ ఆఫీస్‌ స్పేస్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తాం 

150 మందిలోపు ఉద్యోగులతో జీసీసీలు ఏర్పాటు చేసే కంపెనీలను ఆహ్వానిస్తాం 

ఈ కేంద్రం ద్వారా ఆయా సంస్థలకు ప్లగ్‌ అండ్‌ ప్లే సౌకర్యాలు కల్పిస్తాం 

స్టార్టప్‌లకు ఆర్థిక సాయం చేసేందుకు త్వరలోనే స్టార్టప్‌ ఫండ్‌ కార్యాచరణ 

ఏఐ రంగంలో శిక్షణ కోసం ప్రత్యేక ఏఐ స్కూల్‌ తెస్తాం 

క్వాంటం కంప్యూటింగ్‌ రంగంలో సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ నెలకొల్పుతాం 

‘సాక్షి’తో ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

నూగూరి మహేందర్‌ 
భారీ పెట్టుబడులతో వచ్చే పెద్ద సంస్థలకే కాకుండా పరిమిత వనరులతో కార్యకలాపాలు ప్రారంభించాలనుకొనే చిన్నస్థాయి గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీ)కు కూడా హైదరాబాద్‌ను ప్రధాన వేదికగా మార్చడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. ఇందుకోసం ఒక ప్రత్యేక షేర్డ్‌ ఆఫీస్‌ స్పేస్‌ సెంటర్‌ (ఉమ్మడి కార్యాలయ స్థలం) ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు చెప్పారు. ఈ కేంద్రం ద్వారా చిన్న, మధ్యతరహా సంస్థలకు అత్యాధునిక ప్లగ్‌ అండ్‌ ప్లే సౌకర్యాలు లభిస్తాయన్నారు. దీనివల్ల కంపెనీలకు మౌలిక వసతుల వ్యయం తగ్గడంతోపాటు తక్కువ సమయంలోనే కార్యకలాపాలను ప్రారంభించే వీలు కలుగుతుందని పేర్కొన్నారు. జీసీసీలు, షేర్డ్‌ ఆఫీస్‌ స్పేస్‌ సెంటర్‌ ప్రతిపాదన సహా వివిధ అంశాలపై మంత్రి శ్రీధర్‌బాబు ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. 

మరింత మందికి ఉపాధి.. 
అంతర్జాతీయంగా హైదరాబాద్‌కు ఉన్న డిమాండ్‌ను అందిపుచ్చుకుంటూ స్టార్టప్‌లు, చిన్న, మధ్యతరహా ఐటీ సంస్థలకు ఊతమిచ్చేలా ఫ్యూచర్‌ సిటీలో సరికొత్త షేర్డ్‌ ఆఫీస్‌ స్పేస్‌ సెంటర్‌ను రూపొందిస్తాం. ఈ చొరవతో రాబోయే రోజుల్లో భాగ్యనగరంలో మరింత మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. 150 మందిలోపు ఉద్యోగులతో జీసీసీలు ఏర్పాటు చేసే కంపెనీలను షేర్డ్‌ ఆఫీస్‌ స్పేస్‌ సెంటర్‌కు ఆహ్వానిస్తాం. అలాగే ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధ వినియోగం రోజురోజుకూ పెరుగుతుండటంతో ఫ్యూచర్‌ సిటీలో ఏఐ సిటీ నిర్మిస్తాం. ఏఐ రంగంలో శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేక ఏఐ స్కూల్‌ ఏర్పాటు చేస్తాం. క్వాంటం కంప్యూటింగ్‌ విభాగంలో సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ నెలకొల్పుతాం. 

ఆ ప్రత్యేకత వల్లే జీసీసీలు.. 
హైదరాబాద్‌లో 2025–26లో 75 జీసీసీలు అడుగుపెట్టాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 100 జీసీసీలను తీసుకురావాలని లక్ష్యంగా చేసుకున్నాం. 2026 ఏప్రిల్‌–సెపె్టంబర్‌ మధ్య ఇప్పటికే 65 కేంద్రాలు ఏర్పాటయ్యాయి. మెరుగైన మౌలికవసతులు, నిపుణులైన మానవ వనరులు హైదరాబాద్‌ ప్రత్యేకత. అందుకే పెద్ద కంపెనీలు రాష్ట్రాన్ని ఎంచుకుంటున్నాయి. 

దిగ్గజ కంపెనీలు క్యూ.. 
డేటా సెంటర్ల ఏర్పాటుకు దిగ్గజ కంపెనీలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే అమెజాన్, మైక్రోసాఫ్ట్, కంట్రోల్‌–ఎస్‌ కేంద్రాలు కార్యరూపంలోకి వచ్చాయి. కొత్తగా 15 కంపెనీల నుంచి డేటా సెంటర్ల స్థాపనకై నూతన దరఖాస్తులు వచ్చాయి. ఇవన్నీ కలిపి 12 గిగావాట్ల సామర్థ్యంగల ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు చేశాయి. వాటిలో భారత్‌ నుంచి నాలుగు కంపెనీలు ఉన్నాయి. మిగిలినవి అంతర్జాతీయ దిగ్గజాలు. 2034 నాటికి ఈ కొత్త ప్రాజెక్టులు పూర్తి కానున్నాయి. 

యూనికార్న్‌గా ఎదగాలని.. 
టీ–హబ్, టీ–వర్క్స్‌ ద్వారా యువతను ఆవిష్కరణల వైపు ప్రోత్సహిస్తున్నాం. తెలంగాణను లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో గ్లోబల్‌ లీడర్‌గా నిలబెట్టే వ్యూహంలో భాగంగా జీనోమ్‌ వ్యాలీలో ‘1 బయో’ను ప్రారంభించాం. ఇక్కడ ఆవిష్కరణలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. బయోటెక్‌ పరిశ్రమలో కొత్త ఆవిష్కరణలు చేసే స్టార్టప్‌లు, పరిశోధకులు కనుగొనే మందులను క్లినికల్‌ ట్రయల్స్‌ స్థాయికి తీసుకువెళ్లడానికి అవసరమైన అత్యాధునిక మౌలిక వసతులను ఈ కేంద్రం తక్కువ ఖర్చుతో, వేగంగా అందిస్తుంది. స్టార్టప్‌లు యూనికార్న్‌గా ఎదగాలన్నదే మా ఆశయం. మంచి ఆలోచన ఉంటే దానిని తదుపరి స్థాయికి తీసుకెళ్లేందుకు వేదిక కల్పిస్తాం. స్టార్టప్‌లకు ఆర్థిక సాయం చేసేందుకు ఫండ్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. త్వరలోనే దీన్ని కార్యాచరణలోకి తీసుకొస్తాం. ప్రభుత్వపరంగా చేయాల్సిన సాయం చేస్తాం. 

నైపుణ్యం ఉంటేనే పరిశ్రమలు.. 
పరిశ్రమల అవసరాలు, నిపుణులైన మానవ వనరుల మధ్య చాలా గ్యాప్‌ ఉంది. ఈ అంశాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నాం. ఈ గ్యాప్‌ను పూరించడానికే స్కిల్స్‌ యూనివర్సిటీని ప్రారంభించాం. అన్ని జిల్లా కేంద్రాల్లో స్కిల్‌ సెంటర్స్‌ రానున్నాయి. నైపుణ్యం ఉంటేనే పరిశ్రమలు వస్తాయి. ఉద్యోగులకు వేతనాలూ అధికంగా ఉంటాయి. నైపుణ్యంతో కూడిన చదువు ఉండాలన్నదే మా ఆశయం. యువతను వివిధ సాంకేతిక అంశాల్లో సిద్ధం చేసేందుకు పెద్ద సంస్థలతో చేతులు కలుపుతున్నాం. ట్రేడ్‌ కోర్సులకు మంచి డిమాండ్‌ ఉంది. విదేశాల్లో రూ. లక్షల్లో వేతనాలు ఉన్నాయి. అందుకే ఐటీఐలను ఆడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్లుగా తీర్చిదిద్దుతున్నాం.  

పది తరాల వరకు.. 
రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను తీసుకురావడానికి తీవ్రంగా శ్రమిస్తున్నాం. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా స్థానిక యువతకు భారీగా ఉపాధి కల్పించేలా ప్రభుత్వ విధానాలను రూపొందిస్తున్నాం. సురక్షితంగా, స్థిరంగా 10 తరాల వరకు కాలుష్యం లేని పరిశ్రమలను ఏర్పాటు చేసుకోవాలి. హైదరాబాద్‌ను ఇన్నోవేషన్‌ క్యాపిటల్‌గా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం. ప్రభుత్వం నుంచి స్థలం తీసుకొని తయారీ కేంద్రాలు ఏర్పాటు చేయని కంపెనీలను గుర్తించే పనిలో ఉన్నాం. కొన్నింటికి నోటీసులు ఇచ్చాం. నిర్దేశిత సమయంలోగా పరిశ్రమ కార్యరూపం దాల్చకపోతే స్థలాన్ని వెనక్కి తీసుకుంటాం.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement