న్యూఢిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం వివిధ రాష్ట్రాల ఎన్నికల కమిషన్ కార్యాలయాల ఎదుట నిరసనలను చేపట్టింది. సీఈసీ బాధ్యతల నుంచి జ్ఞానేశ్ కుమార్‌ను తక్షణమే తప్పించాలని కోరింది. సర్ సహా జ్ఞానేశ్ సారథ్యంలో ఈసీ తీసుకున్న అన్ని నిర్ణయాలపై సమీక్ష చేపట్టాలని కోరింది. ఓటరు సమానత్వంపై అసాధారణమైన రీతిలో ఈసీ దాడి చేస్తోందని పేర్కొంది.
అప్రూవర్‌గా మారాలి లేదా విచారణను ఎదుర్కొనాల్సి ఉంటుందని జ్ఞానేశ్ కుమార్‌ను హెచ్చరించింది. గౌహతిలో ఎన్నికల కమిషన్ కార్యాలయంలోకి చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించిన లోక్‌సభలో పార్టీ ఉప నేత గౌరవ్ గొగోయ్ సహా పలువురు నేతలను పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నారు. ఎన్నికల కమిషన్‌లోని ముగ్గురు సభ్యుల మధ్య సర్‌పై విభేదాలు పొడచూపాయంటూ మీడియాలో వచ్చిన కథనాల నేపథ్యంలో కాంగ్రెస్ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. కాంగ్రెస్ కార్యకర్తలు ఢిల్లీలో రౌజ్ అవెన్యూలోని కాంగ్రెస్ ఆఫీసు నుంచి బీజేపీ ప్రధాన కార్యాలయం మీదుగా నినాదాలు చేస్తూ, పోస్టర్లు, బ్యానర్లను ప్రదర్శిస్తూ ఎన్నికల కమిషన్ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లారు.
వీరిలో కొందరు జ్ఞానేశ్ కుమార్‌ను పోలిన మాస్క్ ధరించి, చేతులు సంకెళ్లను ప్రదర్శించారు. లక్నోలో కాంగ్రెస్ కార్యకర్తలు అసెంబ్లీపై వైపు ర్యాలీగా వెళ్తూ అడ్డుకున్న పోలీసులతో తలపడ్డారు. పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ రాజా వారియర్ సారథ్యంలో చండీగఢ్‌లో ధర్నా చేపట్టారు. ‘మా నేత రాహుల్ గాంధీ మాటవిని ఇకనైనా రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారు బ్రో..’అంటూ కాంగ్రెస్ నేత పవన్ ఖేరా సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు మీడియా సమావేశం సందర్భంగా సలహా ఇచ్చారు. లేకుంటే న్యాయవిచారణ ఎదుర్కోక తప్పదన్నారు. ‘జ్ఞానేశ్ కుమార్ సమయం దగ్గరపడింది. ఇకనైనా దిగిపోవాలి. లేదంటే కాంగ్రెస్ దిగిపోయేలా చేయిస్తుంది’అని కేసీ వేణుగోపాల్ అన్నారు.


