మూడో స్థానంలో నిలిచిన తెలంగాణ
విశ్లేషించిన ఏడీఆర్, నేషనల్ ఎలక్షన్ వాచ్
న్యూఢిల్లీ: 2022–2026 సంవత్సరాల మధ్య జరిగిన లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు, ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత కనీసం 111 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీలు మారినట్లు గుర్తించామని అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫామ్స్(ఏడీఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్ తెలిపాయి. ఇందులో లోక్‌సభ ఎంపీలు 26 మంది ఉండగా, రాజ్యసభ సభ్యులు ఏడుగురు, శాసనసభ్యులు 78 మంది వరకు ఉన్నారని వివరించాయి.
ఈ మేరకు ఈ రెండు సంస్థలు ఒక విశ్లేషణ జరిపాయి. పార్టీలు మారిన ఘటనల్లో అత్యధికం నాగాలాండ్, బెంగాల్‌లలో నమోదయ్యాయని పేర్కొంది. వ్యక్తిగతంగా పార్టీ మారడం, ఇతర పార్టీల్లో విలీనం కావడం, రాజీనామాలు, ఆ తర్వాత ఉప ఎన్నికల్లో విజయాలు, ఉప ఎన్నికలో గెలిచిన తర్వాత అనర్హత వేటు పడటం వంటి పరిణామాలను కూడా నమోదు చేశామని ఏడీఆర్ తెలిపింది. నాగాలాండ్‌లో అత్యధికంగా 32 కేసులు నమోదు కాగా, ఇవన్నీ శాసనసభ్యులకు సంబంధించినవేనని వివరించింది. అత్యధికంగా అధికార నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (ఎన్‌డీపీపీ)కి చెందిన 25 మంది ఎమ్మెల్యేలు నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్‌పీఎఫ్)లో చేరారు.
ఇతర పార్టీలకు చెందిన మరో ఏడుగురు ఎమ్మెల్యేలు కూడా ఎన్‌పీఎఫ్ తీర్థం పుచ్చుకున్నారు. ఫలితంగా అతిపెద్ద పార్టీగా ఎన్‌పీఎఫ్ అవతరించిందని ఏడీఆర్ పేర్కొంది. అదేవిధంగా, బెంగాల్‌లో టీఎంసీ టిక్కెట్‌పై ఎన్నికైన 20 మంది లోక్‌సభ ఎంపీలు నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా(ఎన్‌సీపీఐ)లో విలీనమైనట్లు ప్రకటించారని ఈ విశ్లేషణ పేర్కొంది. ఈ రెండు రాష్ట్రాల తర్వాత తెలంగాణ మూడోస్థానంలో నిలిచింది. తెలంగాణలో 9 మంది ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్ తరఫున ఎన్నికైన కాంగ్రెస్‌లో చేరారు.
ఆతర్వాత గోవాలో.. ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అధికార బీజేపీ పంచన చేరారు. పంజాబ్‌లో 8మంది రాజ్యసభ ఎంపీలు, ఇద్దరు ఎమ్మెల్యేలు బీజేపీలోకి మారారని ఏడీఆర్ తన విశ్లేషణలో పేర్కొంది. ఇలాంటి కేసులు మహారాష్ట్రలో ఆరు, మేఘాలయలో ఆరు, అరుణాచల్ ప్రదేశ్, గుజరాత్‌లతో నాలుగు చొప్పున నమోదైనట్లు గుర్తించింది. అత్యధిక ప్రజాప్రతినిధులు కాంగ్రెస్, టీఎంసీ, ఎన్‌డీపీపీ నుంచే పార్టీలు మారారని ఏడీఆర్ తెలిపింది. సగానికి పైగా ఈ మూడు పార్టీలకు సంబంధించిన కేసులేనని వివరించింది. ఇటీవల చోటుచేసుకున్న ప్రజాప్రతినిధుల పార్టీల మార్పులు కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూలిపోవడానికి కూడా
కారణమయ్యాయని ఏడీఆర్ పేర్కొంది.


