బీజేపీ కొత్త జాతీయ కమిటీలో కె.లక్ష్మణ్, డీకే అరుణకు దక్కని చోటు
కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో తెలంగాణ నుంచి ఒకరిద్దరికి పదవులు లభిస్తాయని ప్రచారం
రేసులో ఈటల, ధర్మపురి అర్వింద్, గోడెం నగేశ్ పేర్లు ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ
సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సోమవారం ప్రకటించిన కొత్త జాతీయ కార్యవర్గం తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జాతీయ స్థాయిలో పార్టీని బలోపేతం చేసే క్రమంలో జరిపిన ఈ మార్పుచేర్పుల్లో జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు డా. కె. లక్ష్మణ్, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణకు చోటు దక్కలేదు. అయితే ఈ ‘విరుగుట’ వెనుక బీజేపీ అధిష్టానం ఒక పెద్ద ‘పెరుగుట’ వ్యూహాన్నే అమలు చేస్తోందన్న విశ్లేషణలు ఢిల్లీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
ముందే సంకేతాలు అందాయా?
ఇటీవల ముగిసిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పార్టీ తెలంగాణ ఎంపీలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాబోయే రోజుల్లో జాతీయ కమిటీ పునర్వ్యవస్థీకరణ, రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై సుదీర్ఘంగా చర్చించారు. ఆ భేటీలోనే కొత్త జాతీయ బృందంలో తెలంగాణ నేతలకు చోటు ఉండకపోవచ్చనే సంకేతాలు ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై దృష్టి?
జాతీయ కమిటీలో తెలంగాణకు పదవులు దక్కకపోవడానికి త్వరలో జరగబోయే కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణే ప్రధాన కారణమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పార్టీ రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తి రెండు పదవులు నిర్వహించేందుకు వీల్లేదు. జాతీయ కార్యవర్గ పదవుల కంటే కేంద్ర మంత్రివర్గంలో రాష్ట్రానికి సరైన ప్రాతినిధ్యం కల్పించాలనే ఆలోచనతోనే అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఊహాగానాలు సాగుతున్నాయి. తెలంగాణ నుంచి ఒకరిద్దరికి కేంద్ర మంత్రివర్గంలో చోటు లభించే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది.
మంత్రివర్గ రేసులో ఆ ముగ్గురు!
కేంద్ర కేబినెట్ రేసులో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, ఆదిలాబాద్ ఎంపీ గోడెం నగేశ్‌ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. బీసీ సామాజికవర్గానికి చెందిన ఈటల సీనియర్ నేత కావడం, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండటంతో ఆయనకు బెర్త్ ఖాయమనే ప్రచారం సాగుతోంది. అలాగే నిజామాబాద్‌లో వరుసగా రెండోసారి గెలిచి బలమైన నాయకుడిగా ఎదిగిన అర్వింద్‌కు అవకాశం ఇవ్వడం ద్వారా ఉత్తర తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేయొచ్చని అధిష్టానం భావిస్తున్నట్లు చర్చ నడుస్తోంది. ఇక గిరిజన సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న గోడెం నగేశ్‌కు అవకాశం ఇస్తే సామాజిక సమీకరణలు కలసి వస్తాయని పార్టీ ఆలోచిస్తోంది.


