గురుకుల విద్యాసంస్థలకు అందని ప్రొవిజన్స్
ఇండెంట్ ఇచ్చి నెల గడిచినా స్పందించని కాంట్రాక్టర్
సరఫరాపై చేతులెత్తేసినా ఎలాంటి చర్యలు తీసుకోని ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ గురుకుల విద్యా సంస్థలు, సంక్షేమ వసతి గృహాలు, కేజీబీవీ (కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు)లకు నిత్యావసర సరుకుల సరఫరా ప్రశ్నార్థకంగా మారింది. సరుకుల పంపిణీకి ప్రభుత్వం కొత్త కాంట్రాక్టర్‌ను ఎంపిక చేసి, సరఫరా బాధ్యతలు అప్పగించింది. ఇందులో భాగంగా క్షేత్రస్థాయిలో విద్యాసంస్థల డిమాండ్‌కు తగినట్టుగా ఇండెంట్లు ఇచ్చినా, సరుకుల జాడ లేదు.
ఆయా విద్యా సంస్థల నిర్వాహకులు ఆగస్టు నెలాఖరులోనే ఇండెంట్లు సమర్పించారు. వాటి ఆధారంగా సెప్టెంబర్ నెల మొదటివారంకల్లా సరుకులు సరఫరా చేయాలి. కానీ అక్టోబర్ నెల ప్రారంభమైనా, ఇప్పటికీ సరుకులు అందలేదు. దీంతో విద్యార్థుల భోజనానికి ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉండడంతో అత్యవసర పరిస్థితిలో విద్యాసంస్థల ప్రిన్సిపాల్స్, వార్డెన్లు పాత కాంట్రాక్టర్‌ను ఆశ్రయించి సరుకులు తీసుకున్నారు. తొలి నెలలోనే బాధ్యతలు తీసుకున్న కాంట్రాక్టరు తొలి నెల కోటాకే కోత పెట్టాడు.
10 లక్షల మంది విద్యార్థులు..: రాష్ట్రవ్యాప్తంగా 1,080 గురుకుల విద్యా సంస్థలు, కేజీబీవీలున్నాయి. ఇవిగాకుండా 2 వేల సంక్షేమ వసతి గృహాలున్నాయి. సంక్షేమ గురుకులాల్లో 6.3 లక్షల మంది విద్యార్థులుండగా, కేజీబీవీల్లో 1.25 లక్షల మంది, వసతి గృహాల్లో 2 లక్షల మంది.. మొత్తంగా 10 లక్షల మందికి విద్యార్థులున్నారు.
గురుకులాలు, హాస్టళ్లు, కేజీబీవీలకు 2026–27 విద్యా సంవత్సరానికి అవసరమైన నిత్యావసర వస్తువుల సరఫరా కోసం ప్రభుత్వం ఈ ఏడాది మే నెలలో టెండర్లు పిలిచింది. మొత్తం 88 రకాల వస్తువులను మూడు కేటగిరీలుగా విభజించింది. ఈ టెండర్ ప్రక్రియలో నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ ప్రొక్యూర్‌మెంట్ ప్రాసెసింగ్ అండ్ రిటైలింగ్ కోఆపరేటివ్స్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సంస్థ అర్హత సాధించడంతో ప్రభుత్వం సరఫరా బాధ్యతలు అప్పగించింది. కేటగిరీ–ఏలో 27, కేటగిరీ–బీలో 28, కేటగిరీ–సీలో 33 రకాల సరుకులను సరఫరా చేయాల్సి ఉంది.
15 రోజుల్లో సరఫరా చేయాలనే నిబంధన
నిర్దేశించిన విద్యా సంస్థల డిమాండ్‌కు తగినట్టుగా సరుకుల ఇండెంట్ తక్షణమే ఇవ్వాలని ఎస్సీ గురుకుల సొసైటీ కార్యదర్శి/ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్(పీఎంయూ) చైర్మన్ ఆగస్టు నెలాఖరులో ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా అధికారులు ఈ–మెయిల్, అనంతరం యాప్ ద్వారా ఇండెంట్లు స్వీకరించారు. వేగంగా సరఫరా చేసేందుకు రాష్ట్రంలోని 33 జిల్లాలను మూడు జోన్లుగా విభజించింది. అయితే ఆర్డర్ ఇచ్చిన 15 రోజుల్లోగా సరుకులు సరఫరా చేయాల్సి ఉండగా, గడువు దాటినా సరుకులు చేరలేదు.
కాంట్రాక్టరు సరుకుల సరఫరాకు సిద్ధంగా ఉన్నాడని, తొలుత అధికారులు చెప్పినా, ఆచరణలో జాడలేదు. సరుకులు అందకపోవడంతో క్షేత్రస్థాయిలో ప్రిన్సిపాల్స్, వార్డెన్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల భోజనాలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఏర్పడింది. మైనార్టీ గురుకుల సొసైటీలోని సంస్థల్లో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ఎస్సీ, ఎస్టీ గురుకుల సొసైటీలోనూ పరిస్థితి దారుణంగా మారింది.
సంక్షేమ వసతిగృహాలు, కేజీబీవీల్లో కూడా సరుకులు నిండుకోవడంతో ఆందోళన తీవ్రమైంది. దీంతో ఆర్‌సీఓలు, ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయి సిబ్బందికి పాత కాంట్రాక్టర్ నుంచే తాత్కాలికంగా సరుకులు సమీకరించాలని మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు సరుకులు తెచ్చుకున్నారు. బీసీ గురుకుల సొసైటీ ముందుగా తేరుకొని సరుకుల నిల్వలు సిద్ధం చేసుకుంది. నిబంధనలు పాటించని కాంట్రాక్టు సంస్థపై ప్రభుత్వం కూడా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం కొసమెరుపు.


