ఎన్నికల కమిషన్‌ను ఆదేశించిన హైకోర్టు
ఉప ఎన్నిక ఆపాలంటూ కాంగ్రెస్ నేత విజయారెడ్డి పిటిషన్
విచారణ చేపట్టిన సీజే ధర్మాసనం
ఈపీ పెండింగ్‌లో ఉన్నందున ఎన్నిక సాధ్యంకాదన్న ఈసీ
సాక్షి, హైదరాబాద్: ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక నిర్వహిస్తారా.. లేదా.. అనే దానిపై సమగ్ర అఫిడవిట్ దాఖలు చేయాలని ఎన్నికల కమిషన్(ఈసీ)ను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. ఖైరతాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నిక ఆపాలని కోరుతూ కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన అభ్యర్థి విజయారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
2023, నవంబర్‌లో జరిగిన ఖైరతాబాద్ అసెంబ్లీ ఎన్నికకు సంబంధించి దాఖలైన ఎన్నికల పిటిషన్ (ఈపీ) పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో ఉప ఎన్నిక ప్రకటించేందుకు ఎన్నికల సంఘానికి అధికారం లేదన్నారు. గురువారం ఉదయం ఈ పిటిషన్ విచారణకు విజ్ఞప్తి చేయడంతో.. మధ్యాహ్నం విచారణకు సీజే ధర్మాసనం అనుమతించింది. మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ వాకిటి రామకృష్ణారెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది.
ఈపీ ఫలితం తేలే వరకు..
పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ వాదనలు వినిపిస్తూ.. 2023 సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఎన్నికైన దానం నాగేందర్.. పార్టీ మారడంతో రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ కింద అనర్హతకు గురయ్యారని చెప్పారు. దీంతో ఏర్పడిన ఖాళీని ‘క్యాజువల్ వేకెన్సీ’గా పరిగణించరాదన్నారు. ఎన్నికల పిటిషన్ (ఈపీ) ఇప్పటికే హైకోర్టు పరిధిలో పెండింగ్‌లో ఉన్నందున, దాని తుది ఫలితం వెలువడే వరకు ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక ప్రకటించకూడదని కోరారు.
ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్లు 84, 98, 101 నిబంధనలను ప్రస్తావిస్తూ.. ఈపీలో ఫలితం తేలే వరకు ఉప ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేయకుండా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని అభ్యర్థించారు. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులను సమర్పించారు. ఎన్నికల సంఘం తరఫున అవినాశ్ దేశాయ్ వాదనలు వినిపిస్తూ.. ఖాళీ ఏర్పడిన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన న్యాయపరమైన అంశాలను వివరించారు. పెండింగ్‌లో ఉన్న ఎన్నికల పిటిషన్ ఫలితం తేలే వరకు ఎలక్షన్ నిర్వహణ సాధ్యం కాదన్నారు. దీంతో అఫిడవిట్ దాఖలు చేయాలని ఎన్నికల సంఘాన్ని ధర్మాసనం ఆదేశించింది.


