ఐదు దశాబ్దాల నాటి చేనేతకు పునర్‌జ్జీవం
మరోసారి మగ్గంపైకి తీసుకువస్తున్న నేతన్నలు
ముత్యాలు పొదిగినట్టుగా ప్రత్యేక డిజైన్
పాత కళ... కొత్త రంగులు.. నయా రూపం
యారన్‌కు సబ్సిడీ ఇవ్వాలని కోరుతున్న నేతన్నలు
సాక్షి, సిద్దిపేట: సుమారు 50 ఏళ్ల క్రితం సిద్దిపేటలోని చేనేత కార్మికులు ప్రత్యేకంగా నేసిన చీరల్లో ‘ముత్యంపేట’కు ఓ ప్రత్యేక స్థానం ఉండేది. సిద్దిపేట చేనేతకు ప్రత్యేక గుర్తింపుగా నిలిచిన ‘ముత్యంపేట’చీరలు సరైన గిట్టుబాటు ధర, మార్కెటింగ్ లేక కాలగమనంలో కనుమరుగయ్యాయి. అప్పటి నేతన్నల చేతుల్లో రూపుదిద్దుకున్న ఆ ప్రత్యేక అల్లికను ఇప్పుడు మరోసారి మగ్గంపైకి తీసుకొస్తున్నారు. పాత చీరల నమూనాలను ఆధారంగా చేసుకుని.. వాటి ప్రత్యేకతను చెక్కుచెదరకుండా కాపాడుతూ కొత్తగా ముత్యంపేట చీరలను నేసి పూర్వవైభవాన్ని సిద్దిపేట చేనేత కార్మికుడు ఆకుబత్తిని నర్సింహులు తీసుకువస్తున్నారు.
ముత్యాలు పొదిగినట్టుగా..
‘ముత్యంపేట’చీరకు అసలు ప్రత్యేకత దాని అల్లికలోని డిజైన్ చీరను చూస్తే నూలుపోగుల మధ్య ముత్యాలు పొదిగినట్టుగా ఆకృతులు కనిపిస్తాయి. రంగుల కలయిక, అంచుల డిజైన్, కొంగులోని ప్రత్యేక అల్లిక చీరకు మరింత అందాన్ని తెస్తాయి. ఒక్కో పోగును జాగ్రత్తగా అమర్చి.. డిజైన్ చెక్కుచెదరకుండా మగ్గంపై నేయాల్సి ఉంటుంది. అందుకే సాధారణ చీరతో పోలిస్తే దీనికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. 2,800 నిలువు దారాలతో, అడ్డానికి డిజైన్‌ను బట్టి దారం మిలితమై వివిధ రంగుల్లో తయారు చేస్తున్నారు.
ఈ మగ్గానికి అనుబంధంగా ప్రత్యేకంగా స్మాల్ భీమ్ బిగించి చీరలో ఎంబ్రాయిడరీ థ్రెడ్(చెక్స్)తో ఆకర్షించేలా తీర్చిదిద్దుతుండటం ప్రత్యేకత. ముత్యాలు పొదిగినట్లుగా చుక్కలు ఉండటంతో ముత్యంపేట చీరగా పేరొచ్చిందని చేనేత కార్మికులు చెబుతున్నారు. శ్రమ అవసరం. మగ్గంపై నూలుపోగులు కదులుతున్న ప్రతిసారీ ఓ పాత జ్ఞాపకం కొత్త రూపం దాల్చుతోంది. ఒక తరం నేతన్నల చేతుల్లో పుట్టిన డిజైన్ మరో తరం నేతన్నల చేతుల్లో మళ్లీ ప్రాణం పోసుకుంటోంది.
సంప్రదాయాన్ని తిరిగి తీసుకువచ్చేలా..
పాత డిజైన్ యథాతథంగా పునరావృతం చేయడంతో పాటు.. నేటితరం మహిళల అభిరుచికి తగ్గట్టుగా రంగులు, అల్లికలో స్వల్ప మార్పులు చేస్తూ చీరలను రూపొందిస్తున్నారు. ముత్యంపేట చీర తయారీలో ప్రతి దశలోనూ నైపుణ్యం అవసరం. నూలును సిద్ధం చేయడం నుంచి మగ్గంపై అల్లిక పూర్తయ్యే వరకు నేతన్నలు ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నారు. ఒక్క చీరకు దాదాపు మూడు రోజుల వరకు సమయం పడుతోంది.
మార్కెటింగ్‌తోనే.. మగ్గానికి కొత్త ఊపు!
పాత చేనేత కళకు పునర్జీవం పోసినా.. దాన్ని నిలబెట్టేది మాత్రం మార్కెట్. నేతన్నలు తయారు చేసిన చీరలకు సరైన ప్రచారం, ఎగ్జిబిషన్లు, మార్కెటింగ్ సౌకర్యం, గిట్టుబాటు ధర లభిస్తే మరిన్ని పాత డిజైన్లను తిరిగి మగ్గంపైకి తీసుకురావచ్చని చేనేత వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వం, చేనేత శాఖ, సహకార సంఘాలు ప్రత్యేకంగా దృష్టి సారించి ఇలాంటి అరుదైన సిద్దిపేట చేనేత ఉత్పత్తులకు బ్రాండింగ్, ప్రదర్శనలు, మార్కెటింగ్, యారన్ పై రాయితీలు కల్పిస్తే నేతన్నలకు అండగా నిలవడంతో పాటు పాత చేనేత సంపదను భావితరాలకు అందించవచ్చు అని నేతన్నలు అభిప్రాయపడుతున్నారు. మా తాతలు ఈ చీరలు నేశారు...
మా తాతల కాలంలో ముత్యంపేట చీరనేశారు. చీరలో ముత్యాలు పొదిగినట్టుగా చుక్కలు ఉండటంతో ముత్యంపేట చీరగా పేరు పెట్టారు. రా మెటీరియల్‌ను ప్రభుత్వం సబ్సిడీ ద్వారా అందిస్తే ఎంతో సాయం చేసినవారు అవుతారు. ఒక్కో చీరను మూడు రోజుల పాటు నేస్తాం. దీనిని రూ1,500లకు పైగా విక్రయిస్తున్నా. ప్రభుత్వం ముత్యంపేట చీరలను ప్రోత్సహించాలి. – ఆకుబత్తిని నర్సింహులు, చేనేత కార్మికుడు


