ఈవీలో పదోస్థానం | Telangana Improves in IEMI | Sakshi
Sakshi News home page

ఈవీలో పదోస్థానం

Oct 2 2026 1:11 AM | Updated on Oct 2 2026 1:11 AM

 Telangana Improves in IEMI

వ్యక్తిగత వాహనాల్లో భేష్‌ 

చార్జింగ్, మౌలిక వసతులు నామమాత్రమే 

‘ఇండియా ఎలక్ట్రిక్‌ మొబిలిటీ ఇండెక్స్‌ 2025’లో తెలంగాణకు 51 పాయింట్లు కేటాయించిన నీతి ఆయోగ్‌  

సాక్షి, హైదరాబాద్‌: ద్విచక్ర వాహనాలు, కార్ల విషయంలో తెలంగాణ ఈవీ పాలసీ మెరుగైన ఫలితాలనిస్తున్నా, వాణిజ్య విభాగం, ఈవీ చార్జింగ్‌ ఇన్‌ఫ్రా విషయంలో బాగా వెనుకబాటుతో ఉందని నీతి ఆయోగ్‌ తేల్చింది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన చర్యలు తీసుకోవటం ద్వారా లోపాలను సరిదిద్దుకొని పర్యావరణ అనుకూల వాహనాల సంఖ్యను పెంచుకోవాలని సూచించింది. దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్‌ వాహనాల విషయంలో ఆయా రాష్ట్రాలకు రేటింగ్‌ పాయింట్లు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ థింక్‌ట్యాంక్‌ నీతి ఆయోగ్‌ తాజాగా విడుదల చేసిన ‘ఇండియా ఎలక్ట్రిక్‌ మొబిలిటీ ఇండెక్స్‌ 2025’గణాంకాలు తెలంగాణ ఈవీ ప్రయాణానికి రెండు భిన్నమైన ముఖాలను చూపిస్తున్నాయి. 

మొత్తం 100కు 51 పాయింట్లతో తెలంగాణ దేశవ్యాప్తంగా 10వ స్థానంలో నిలిచింది. 17 పెద్ద రాష్ట్రాలను పరిగణనలోకి తీసుకుంటే 7వ స్థానంలో ఉంది. 2024తో పోలిస్తే రాష్ట్ర స్కోర్‌ 46 నుంచి 51కి పెరిగింది. తెలంగాణకు అత్యంత బలమైన విభాగం ఈవీ పరిశోధన, ఆవిష్కరణలు. ఈ విభాగంలో 71 స్కోర్‌తో పెద్ద రాష్ట్రాల్లో ఐదో స్థానంలో నిలిచింది. మహారాష్ట్ర 85, కర్ణాటక 82, తమిళనాడు 77, హర్యానా 74 తర్వాత తెలంగాణ ఉంది. రాష్ట్రంలో ఈవీ స్టార్టప్‌ ఎకోసిస్టమ్‌ బలంగా ఉందని నివేదిక సూచిస్తోంది. అయితే పరిశోధన ఫలితాలను పేటెంట్లుగా మార్చడంలో ఇంకా మెరుగుకావాల్సిన అవసరం ఉందని నీతి ఆయోగ్‌ పేర్కొంటోంది. స్టార్టప్‌ ఉంది.. పరిశోధన ఉంది.. కానీ ఆ పరిశోధనను మేధో సంపత్తిగా మార్చే దశలో మరింత వేగం అవసరం అన్నది గణాంకాల నుంచి కనిపిస్తున్న చిత్రం. 

కమర్షియల్‌ వాహనాల్లో వెనుకంజ  
స్కూటర్లు, కార్లు... ఇలా వ్యక్తిగత వాహనాల్లో తెలంగాణ మెరుగ్గా కనిపిస్తోంది. కానీ వాణిజ్య ఎలక్ట్రిక్‌ వాహనాల విషయంలో మరీ వెనుకంజలో ఉంది. వ్యక్తిగత ఈవీ రిజిస్ట్రేషన్ సూచికలో రాష్ట్రానికి 96 స్కోర్‌ వచ్చింది. అదే సమయంలో కమర్షియల్‌ ఈవీ రిజిస్ట్రేషన్ల సూచికలో కేవలం 15 స్కోర్‌తోనే సరిపుచ్చకుంది. వీటి కొనుగోలు ప్రోత్సాహకాల సూచికలో సున్నా స్కోర్‌ నమోదైంది.  

చార్జింగ్‌ వసతి.. అసలు గ్యాప్‌ ఇక్కడే  
తెలంగాణ ఈవీ కథలో అత్యంత కీలకమైన బలహీనత చార్జింగ్‌ మౌలిక వసతులే. ఈ విభాగంలో రాష్ట్ర స్కోర్‌ 43. పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ 12వ స్థానంలో ఉంది. కర్ణాటక 97, మహారాష్ట్ర 91, హర్యానా 91, తమిళనాడు 73, రాజస్థాన్‌64, ఆంధ్రప్రదేశ్‌ 62తో తెలంగాణ కంటే ముందున్నాయి. తెలంగాణలో విద్యుత్‌ లభ్యతకు 100 స్కోర్‌ రావడం మరో ఆసక్తికరమైన అంశం. 

చార్జర్‌–వాహన నిష్పత్తి కూడా 12.6గా ఉంది. అయినా, పబ్లిక్‌ చార్జింగ్‌ మౌలిక వసతుల అభివృద్ధికి అవసరమైన పెట్టుబడులు, ప్రోత్సాహకాలు, భవన నిబంధనల్లో చార్జింగ్‌ సదుపాయాల విస్తరణ వంటి అంశాల్లో ఇంకా మెరుగుదల ఉండాలని నివేదిక సూచిస్తోంది.  

ఉద్యోగులకు 20% వరకు ఈవీ రాయితీ 
తెలంగాణ ప్రత్యేకతగా నివేదిక మరో అంశాన్ని ప్రస్తావించింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎలక్ట్రిక్‌ ద్విచక్ర, ఫోర్‌ వీలర్‌ కొనుగోలు చేస్తే 20 శాతం వరకు రాయితీ అందించే రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని తెలంగాణ ప్రవేశపెట్టింది. ఇలాంటి చర్యలు వ్యక్తిగత ఈవీ వినియోగాన్ని పెంచుతున్నా, కమర్షియల్‌ వాహనాల వైపు కూడా ఇలాంటి ప్రోత్సాహకాలు విస్తరించాల్సిన అవసరాన్ని నీతి ఆయోగ్‌ గణాంకాలు సూచిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement