సాక్షి,హైదరాబాద్ : నగరవాసులకు మెట్రో రైలు,ఆర్టీసీ బస్సు ప్రయాణాలను మరింత సులభతరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రయాణికులు రెండు వేర్వేరు టికెట్లు లేదా పాస్‌ల కోసం ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా, ఒకే కామన్ పాస్‌తో రెండు రకాల రవాణా సేవలను అందుబాటులోకి తెచ్చింది.
రేపు మహత్మా గాంధీ జయంతి (అక్టోబర్2న) సందర్భంగా హైదరాబాద్‌లోని ప్రజా భవన్ వేదికగా రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా ఈ కామన్ పాస్ ప్రారంభమవుతుంది.
నగరంలో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ సేవలను మరింత అనుసంధానం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు గతంలోనే అధికారులను ఆదేశించారు. మెట్రో రైలు, ఆర్టీసీ బస్సు సర్వీసులను జోడించి సంయుక్త ప్రయాణ పాస్‌ను వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్, టీజీఎస్‌ఆర్‌టీసీ సంయుక్తంగా ఈ ప్రత్యేక రవాణా సదుపాయాన్ని అమల్లోకి తెస్తున్నాయి. ప్రజా రవాణాను మరింత ప్రోత్సహించడానికి, ప్రయాణ సమయాన్ని ఆదా చేయడానికి ఈ కామన్ పాస్ ఎంతో ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు.
కామన్ పాస్ రకాలు,అంచనా ధరలు
ప్రయాణికుల సౌలభ్యం కోసం రోజువారీ, నెలవారీ పాస్‌లను అందుబాటులోకి తెస్తున్నారు. రోజువారి జాయింట్ పాస్ రూ.400 నిర్ణయించగా.. నెలవారీ జాయింట్ పాస్‌ను రూ.8,500గా ఖరారు చేసినట్లు తెలుస్తోంది ఇకపై ప్రయాణికులు వేర్వేరుగా టికెట్లు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. మెట్రో స్టేషన్ల నుండి ఆర్టీసీ బస్సులు, సిటీ బస్సులకు మారేటప్పుడు ఈ కామన్ పాస్ సౌకర్యవంతంగా ఉంటుంది.
సమయం ఆదా కావడంతో పాటు రవాణా ఖర్చులు కూడా మరింత సులభతరం అవుతాయి. అక్టోబర్ 2న జరిగే లాంచ్ కార్యక్రమంలో ఈ పాస్‌ల కొనుగోలు విధానం, దరఖాస్తు ప్రక్రియ, పూర్తిస్థాయి మార్గదర్శకాలను అధికారులు అధికారికంగా వెల్లడించనున్నారు.


