breaking news
bus pass holders
-
హైదరాబాద్‌లో సిటీ మెట్రో, ఆర్టీసీ కామన్ పాస్‌లు ప్రారంభం!
సాక్షి,హైదరాబాద్ : నగరవాసులకు మెట్రో రైలు,ఆర్టీసీ బస్సు ప్రయాణాలను మరింత సులభతరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రయాణికులు రెండు వేర్వేరు టికెట్లు లేదా పాస్‌ల కోసం ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా, ఒకే కామన్ పాస్‌తో రెండు రకాల రవాణా సేవలను అందుబాటులోకి తెచ్చింది. రేపు మహత్మా గాంధీ జయంతి (అక్టోబర్2న) సందర్భంగా హైదరాబాద్‌లోని ప్రజా భవన్ వేదికగా రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా ఈ కామన్ పాస్ ప్రారంభమవుతుంది. నగరంలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సేవలను మరింత అనుసంధానం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు గతంలోనే అధికారులను ఆదేశించారు. మెట్రో రైలు, ఆర్టీసీ బస్సు సర్వీసులను జోడించి సంయుక్త ప్రయాణ పాస్‌ను వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్, టీజీఎస్ఆర్టీసీ సంయుక్తంగా ఈ ప్రత్యేక రవాణా సదుపాయాన్ని అమల్లోకి తెస్తున్నాయి. ప్రజా రవాణాను మరింత ప్రోత్సహించడానికి, ప్రయాణ సమయాన్ని ఆదా చేయడానికి ఈ కామన్ పాస్ ఎంతో ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు.కామన్ పాస్ రకాలు,అంచనా ధరలు ప్రయాణికుల సౌలభ్యం కోసం రోజువారీ, నెలవారీ పాస్‌లను అందుబాటులోకి తెస్తున్నారు. రోజువారి జాయింట్ పాస్ రూ.400 నిర్ణయించగా.. నెలవారీ జాయింట్ పాస్‌ను రూ.8,500గా ఖరారు చేసినట్లు తెలుస్తోంది ఇకపై ప్రయాణికులు వేర్వేరుగా టికెట్లు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. మెట్రో స్టేషన్ల నుండి ఆర్టీసీ బస్సులు, సిటీ బస్సులకు మారేటప్పుడు ఈ కామన్ పాస్ సౌకర్యవంతంగా ఉంటుంది. సమయం ఆదా కావడంతో పాటు రవాణా ఖర్చులు కూడా మరింత సులభతరం అవుతాయి. అక్టోబర్ 2న జరిగే లాంచ్ కార్యక్రమంలో ఈ పాస్‌ల కొనుగోలు విధానం, దరఖాస్తు ప్రక్రియ, పూర్తిస్థాయి మార్గదర్శకాలను అధికారులు అధికారికంగా వెల్లడించనున్నారు. -
బస్సులు నడుస్తున్నాయి కానీ...
ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఫిట్మెంట్ ఇస్తే కానీ బస్సులు తిప్పేది లేదంటూ ఆర్టీసీ కార్మికులు భీష్మించుకోవటంతో తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు గట్టి దెబ్బే తగిలింది. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని గట్టున పడేయటంతో పాటు, లాభాలు పుంజుకోవాలంటే అందుకు వేసవి కాలమే అసలైన సీజన్. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్లు ...వేసవితో పాటు మరోవైపు పెళ్లిళ్ల సీజన్ కూడా కలసి రావడంతో ఎంతో కొంత లాభాలు పండించు కోవచ్చని ఆర్టీసీ యాజమాన్యం ఆశపడింది. టైమ్ చూసి దెబ్బ కొట్టినట్లు కార్మికులు సమ్మె రూపంలో ఆ ఆశను ఆడియాశ చేశారు. సమ్మె నేపథ్యంలో ఇరు రాష్ట్రాలలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు యజమానులు, ఆటోవాలాలు ఎంత దండుకోవాలో అంత దండుకుంటున్నారు. వారి రేట్ల దెబ్బకు ఏ వాహనం లేని మధ్య తరగతి ప్రజల జేబులు గుల్ల అవుతున్నాయి. అయితే నగర జీవులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సిటీ బస్సులు నడిపిస్తాంటూ ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రకటించినా అది ఆచరణలో అటకెక్కింది. పంతం కొద్దీ కాంట్రాక్ట్ డ్రైవర్‌కు రూ.1000, కండక్టర్‌కు రూ.800 ఇచ్చి తాత్కాలిక ఉద్యోగులను నియమించి అరా కొరా బస్సులు తిప్పుతున్నా అవి ఎటూ సరిపోవటం లేదు. ప్రైవేట్ ట్రావెల్స్ , ఆటోవాలాల బాదుడు నుంచి తప్పించుకునేందుకు ఆర్టీసీ బస్సుల కోసం పడిగాపులు పడి.. అవి ఎక్కినా...అక్కడ కూడా మరో రకం బాదుడే. బస్సు ఎక్కాక తీరిగ్గా బస్సులో పాస్‌లు చెల్లవు ... టికెట్ తీసుకోవాలంటూ కండాక్టర్లు చెప్పడంతో.. ముందే డబ్బు కట్టి బస్ పాస్‌లు తీసుకున్న వాళ్లకు షాక్. అదేమని ప్రశ్నిస్తే... డిపో మేనేజరే చెప్పారంటూ సమాధానం. అంతేకాకుండా ఏడు రూపాయల టిక్కెట్ ఇచ్చి పది రూపాయలు ముక్కుపిండి మరీ వసూలు చేయటం విశేషం. అదేమంటే...అంతే ఇష్టమైన ఎక్కు...లేకుంటే దిగిపో అని గీరగా సమాధానం వస్తుంది. వెరసి కడుపుమండిన బడుగు జీవులు.. నానా తిట్లు లక్కించుకోవటం, నాశనం అయిపోతారు, నీ బొందలో పెట్టుకో, పబ్లిక్ వెర్రోళ్లా...అంటూ శాపనార్థాలు. ఇంతదానికి బస్సులు తిప్పుడెందుకు అంటూ పాస్ హోల్డర్లు ఆర్టీసీని దుమ్మెత్తి పోస్తున్నారు. బస్సులు నడుస్తున్నాయి కానీ ... బస్ పాస్‌లు నడవటం లేదంటూ గొణుక్కోవటం మినహా మరేమీ చేయలేకపోతున్నారు.


