బస్సులపై మళ్లీ ప్రకటనలు | Business Advertisements on RTC buses again in Telangana | Sakshi
Sakshi News home page

బస్సులపై మళ్లీ ప్రకటనలు

Sep 30 2026 2:44 AM | Updated on Sep 30 2026 2:44 AM

Business Advertisements on RTC buses again in Telangana

ఐదేళ్ల క్రితం వివిధ వర్గాల ప్రజల నుంచి ఫిర్యాదులతో నిలిపివేత 

ఆర్టీసీ బస్సుల కేటగిరీ గుర్తించడం ప్రయాణికులకు ఇబ్బందిగా మారడమూ కారణమే

తాజాగా ఆదాయం కోసం మళ్లీ మనసు మార్చుకున్న ఆర్టీసీ

బస్సులపై ప్రకటనలకు వీలు కల్పిస్తూ ఏజెన్సీల ఎంపిక

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ బస్సులపై మళ్లీ వ్యాపార ప్రకటనలు దర్శనమివ్వనున్నాయి. గతంలో బస్సులపై ప్రకటనల వినైల్‌ పోస్టర్లను అతికించేందుకు అవకాశం కల్పిస్తూ తీసుకున్న నిర్ణయం వల్ల బస్సులు కళావిహీనంగా కనిపించడంతోపాటు ఏ బస్సు ఏ కేటగిరీకి చెందినదో గుర్తించడంలో ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవుతున్న దృష్ట్యా 2021లో బస్సులపై ప్రకటనలను ఆర్టీసీ నిషేధించింది. కానీ ఇప్పుడు ఆదాయం పెంచుకొనే చర్యల్లో భాగంగా మళ్లీ పాత నిర్ణయాన్నే అమలు చేసేందుకు ఆర్టీసీ సిద్ధం కావడం గమనార్హం. తాజా నిర్ణయంలో భాగంగా ప్రకటనల కంపెనీలకు ఆర్టీసీ కాంట్రాక్టు అప్పగించింది. 

గతంలో విమర్శల పాలు.. 
వివిధ పద్ధతుల్లో ఆర్టీసీ ఆదాయాన్ని పెంచుకుంటూ ఉంటుంది. బస్సుల వెలుపల ప్రకటనలకు అవకాశం కల్పించడం కూడా అందులో ఒకటి. ఆర్టీసీ బస్సులపై తొలినాళ్లలో ప్రకటనలను పెయింట్‌ చేయించేవారు. ఆ తర్వాత కాలంలో వినైల్‌ పోస్టర్లు అందుబాటులోకి రావడంతో వాటిని అతికించే పద్ధతికి శ్రీకారం చుట్టారు. అయితే ప్రకటనల గడువు ముగిసినప్పటికీ వాటిని తొలగించకపోవడం వల్ల అవి చిరిగిపోయి వేలాడుతూ కనిపించేవి. దీనిపై ఆర్టీసీకి చాలా ఫిర్యాదులొచ్చేవి. కొన్ని సినిమా పోస్టర్లలోని అశ్లీల దృశ్యాల వల్ల ఇబ్బందిపడుతున్నట్లు మహిళల నుంచి ఫిర్యాదులు అందిన దాఖలాలు కూడా వెల్లువెత్తాయి. కొన్ని సందర్భాల్లో ఆర్టీసీ బస్సులనే చులకన చేసిన ప్రకటనలు కూడా ఏర్పాటయ్యాయి. దీనికితోడు బస్సు ఎక్స్‌ప్రెసా, ఆర్డినరీనా అన్నది కనిపించని స్థాయిలో మొత్తం వ్యాపార ప్రకటనల పోస్టర్లతో నిండిపోయే పరిస్థితి ఉండేది. ఈ నేపథ్యంలో 2021లో నాటి ఆర్టీసీ ఎండీ సజ్జనర్‌ బస్సులపై ప్రకటనలను అతికించడాన్ని నిషేధించారు. అప్పట్లో ఈ ప్రకటనల ద్వారా ఆర్టీసీకి సగటున ఏటా రూ. 20 కోట్ల ఆదాయం సమకూరేది. గతంలో నష్టాల ఊబిలో కూరుకుపోయిన సంస్థకు ఈ ఆదాయం కొంత ఊరటనిచ్చేది. అయినప్పటికీ ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల దృష్ట్యా ఆ ఆదాయాన్ని సైతం ఆర్టీసీ వదులుకుంది.  

ఇప్పుడు ఆదాయం కోసమే... 
అయితే ఇటీవల ఆర్టీసీ కార్మికుల వేతన సవరణను అమలు చేయడం వల్ల సంస్థపై జీతాల భారం పెరిగింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి మహాలక్ష్మి బిల్లు రీయింబర్స్‌మెంట్‌ మినహా అదనంగా ఒక్క రూపాయి కూడా ఆర్థిక సాయం అందని పరిస్థితి నెలకొంది. ఆ రీయింబర్స్‌మెంట్‌ నిధులు కూడా పూర్తిస్థాయిలో అందక బకాయిలు పేరుకున్నాయి. ఈ తరుణంలో ఆర్టీసీకి ఆదాయాన్ని పెంచుకోవడం తప్పనిసరిగా మారింది. ఈ అంశంపై సమీక్షించిన క్రమంలో బస్సులపై ప్రకటనలను పునరుద్ధరించాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రకటనల ఏజెన్సీలకు బాధ్యత అప్పగించారు. ఆ ఏజెన్సీలు ప్రకటనకర్తలతో రేటు మాట్లాడుకుంటాయి. ఆర్టీసీకి మాత్రం ఒక్కో బస్సుకు నెలకు రూ. 20 వేల చొప్పున చెల్లిస్తాయి. ఇది ఇప్పటికిప్పుడు ఆర్టీసీకి లాభసాటిగా ఉండనుంది. 2021లో ప్రకటనలను నిషాధించిన సమయంలో ఆర్టీసీ బస్సులన్నీ మళ్లీ నీట్‌గా కనిపించాలన్న ఉద్దేశంతో దాదాపు రూ.5 కోట్లు ఖర్చు చేసి బస్సులన్నింటికీ రంగులు వేయించి కొత్తగా మార్చారు. ఫలితంగా వాటి రంగులు చూసి దూరం నుంచే అది కేటగిరీ బస్సో ప్రయాణికులు సులభంగా గుర్తించగలుగుతున్నారు. ఇప్పుడు మళ్లీ ప్రకటనలతో నిండిపోనుండటంతో ఏ బస్సు ఏ కేటగిరీదో గుర్తించడంలో ప్రయాణికులకు మళ్లీ అయోమయం తలెత్తనుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement