స్లాట్లు.. రోజంతా పాట్లు! | Basic amenities are lacking in Registration Department offices in Telangana | Sakshi
Sakshi News home page

స్లాట్లు.. రోజంతా పాట్లు!

Sep 30 2026 1:50 AM | Updated on Sep 30 2026 1:50 AM

Basic amenities are lacking in Registration Department offices in Telangana

స్లాట్‌ విధానం అమలులో ఉన్నా.. జనానికి తప్పని పడిగాపులు

తరచూ సాంకేతిక సమస్యలతో నిలిచిపోతున్న రిజిస్ట్రేషన్లు 

ఖజానాను నింపుతున్న కార్యాలయాల్లో కనీస వసతులూ కరువు 

కూర్చునేందుకు సరిపడా కుర్చీలు లేవు 

అద్దె భవనాలు, ఇరుకైన గదుల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ 

రాష్ట్రంలో ఇదీ రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల తీరు

చెట్ల కింద పడిగాపులు కాస్తున్న వీరంతా రిజిస్ట్రేషన్ల కోసం సంగారెడ్డి, పటాన్‌చెరు–1, పటాన్‌చెరు–2 కార్యాలయాలకు వచ్చినవారు. స్లాట్‌ బుకింగ్‌ విధానం అమలులో ఉన్నా, రిజిస్ట్రేషన్లు జరగాలంటే ఇలా రోజంతా వేచి ఉండాల్సిన పరిస్థితి. నిత్యం సుమారు 150 వరకు రిజిస్ట్రేషన్లు జరిగే ఈ కార్యాలయాల్లో కనీస వసతులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా మహిళలు, చిన్నారులతో వచ్చిన వారి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. రిజిస్ట్రేషన్‌ ప్రాసెస్‌ జరిగే హాలు కిక్కిరిసి ఉంటుంది.   

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: సర్కారు ఖజానాకు ప్రధాన ఆదాయ వనరుల్లో ఒకటైన రిజిస్ట్రేషన్‌ శాఖ కార్యాలయాల్లో కనీస వసతులు కరువయ్యాయి. రూ.వేలల్లో రిజిస్ట్రేషన్‌ చార్జీలు, స్టాంప్‌ డ్యూటీలు వసూలు చేస్తున్నా, రిజిస్ట్రేషన్ల కోసం వస్తున్న వారికి కూర్చునేందుకు కనీసం బెంచీలు కూడా సరిగ్గా ఉండటం లేదు. నిత్యం సర్వర్‌ సమస్య తలెత్తుతుండటంతో స్లాట్‌ విధానం అమలులో ఉన్నా, రోజంతా కార్యాలయంలో పడిగాపులు కాయాల్సి వస్తోంది.  

అవే తిప్పలు..: వచ్చే వారికి ఇబ్బందులు కలగకుండా.. వీలైనంత త్వరగా రిజిస్ట్రేషన్లు చేసేందుకు ఆ శాఖ స్లాట్‌ బుకింగ్‌ విధానం అమలు చేస్తోంది. స్లాట్‌లో కేటాయించిన నిర్ణీత సమయానికి వస్తే పది నిమిషాల్లో రిజిస్ట్రేషన్‌ చేసి పంపుతున్నామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ క్షేత్ర స్థాయిలో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. స్లాట్‌ సమయానికి కార్యాలయానికి వచ్చినా, రోజంతా కార్యాలయంలో ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. కార్యాలయంలో ఉన్న కుర్చీలు సరిపోకపోవడంతో చెట్ల కింద తిప్పలు పడాల్సి వస్తోంది. రూ.లక్షల్లో రిజిస్ట్రేషన్‌ ఫీజులు, స్టాంప్‌ డ్యూటీలు కడుతున్న తమకు వసతులు కల్పించకపోవడం ఏంటని కార్యాలయానికి వస్తున్న వారు ప్రశ్నిస్తున్నారు. 

సాంకేతిక సమస్యలతో చుక్కలు  
ఎస్‌ఆర్‌ఓ(సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీస్‌)ల్లో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే వారికి చుక్కలు కనిపిస్తున్నాయి. సర్వర్‌ ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియడం లేదు. రిజిస్ట్రేషన్‌ ప్రాసెస్‌ చేస్తున్న సమయంలో సర్వర్‌ డౌన్‌ అవుతుండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కోసారి ఇంటర్నెట్‌ కనెక్షన్‌ (నెట్‌వర్క్‌) సరఫరాలో అంతరాయం కూడా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. సర్వర్‌ డౌన్‌ కారణంగా రోజంతా వేచిచూసి రిజిస్ట్రేషన్లు జరగకుండా వెళ్లిపోయిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఒక్కోసారి స్లాట్‌ను కూడా వాయిదా వేసుకోవాల్సి రావడం పరిపాటవుతోంది.  

జూనియర్‌ అసిస్టెంటే ఎస్‌ఆర్‌ఓలు  
సబ్‌ రిజిస్ట్రార్‌ పోస్టులు ఖాళీగా ఉండటంతో పలు చోట్ల జూనియర్‌ అసిస్టెంట్లకు ఎస్‌ఆర్‌ఓ బాధ్యతలు అప్పగిస్తున్నారు. మెదక్‌ జిల్లా తూప్రాన్‌ ఎస్‌ఆర్‌ఓ డిప్యూటేషన్‌పై వెళ్లిపోవడంతో ఈ కార్యాలయంలో పనిచేస్తున్న జూనియర్‌ అసిస్టెంట్‌ ఇన్‌చార్జ్‌ ఎస్‌ఆర్‌ఓగా వ్యవహరిస్తున్నారు. రూ.కోట్లు విలువ చేసే స్థిరాస్తుల లావాదేవీల దస్తావేజులు రిజిస్టేషన్లు., విలువైన ప్రభుత్వ భూములకు రిజిస్ట్రేషన్లు జరగకుండా నివారించే కీలక బాధ్యతల్లో కింది స్థాయి సిబ్బందిని నియమించడం విమర్శలకు దారితీస్తోంది. అన్ని అర్హతలు ఉన్న వారికే ఎస్‌ఆర్‌ఓ బాధ్యతలు అప్పగిస్తున్నామని ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. 

రాష్ట్రంలో పరిస్థితి ఇలా.. 
– ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 16 ఎస్‌ఆర్‌ఓలు ఉన్నాయి. ఇందులో మూడు చోట్ల జూనియర్, సీనియర్‌ అసిస్టెంట్లు ఎస్‌ఆర్‌ఓలుగా ఇన్‌చార్జ్‌ బాధ్యతల్లో కొనసాగుతున్నారు. సిద్దిపేట ఎస్‌ఆర్‌ఓలో సర్వర్‌ సమస్య కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. కనీస సౌకర్యాలు లేని భవనాల్లో ఈ కార్యాలయాలు కొనసాగుతున్నాయి. జిల్లా రిజిస్ట్రార్‌ వనజాకుమారికి మేడ్చల్‌ జిల్లా ఆడిట్‌ రిజిస్ట్రార్‌గా బాధ్యతలు ఉండటంతో వారంలో మూడు రోజులు మేడ్చల్‌కే పరిమితమవుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 
– ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఎస్‌ఆర్‌లు ఇరుకైన భవనాల్లో కొనసాగుతున్నాయి. దీంతో రిజిస్ట్రేషన్ల కోసం వచ్చేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డాక్యుమెంట్లు ఆలస్యమవుతున్నాయని వాపోతున్నారు.  
– ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 13 ఎస్‌ఆర్‌ఓలు ఉండగా, ఐదుచోట్ల ఇన్‌చార్జ్‌లు ఉన్నారు. పలుచోట్ల ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు స్కానింగ్‌ వంటి పనులు చేస్తున్నారు. సర్వర్‌ సమస్య కారణంగా ఈకేవైసీ, సీఎస్‌ నంబర్‌ రావడం ఆలస్యమవుతోంది.     

– కుమురంభీం ఆసిఫాబాద్‌ ఎస్‌ఆర్‌లో ఎనిమిది రోజులుగా సర్టిఫైడ్‌ కాపీలు, ఈసీలు రావడం లేదు. సరైన సిబ్బంది లేకపోవడంతో ప్రైవేటువారు పనిచేస్తున్నారు. మంచిర్యాల ఎస్‌ఆర్‌ఓలో 2 పోస్టులకుగాను ఒక్కరే ఉన్నారు. నిత్యం 90 వరకు స్లాట్స్‌కు అవకాశం ఉన్నా, సర్వర్‌ స్లో కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 
– ఉమ్మడి ఖమ్మంలో 11 ఎస్‌ఆర్‌ఓలు ఉన్నాయి. వైరా, సత్తుపల్లి, భద్రాచలం, బూర్గంపాడు, ఇల్లందు ఎస్‌ఆర్‌ఓల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో సీనియర్‌ అసిస్టెంట్లకు ఇన్‌చార్జ్‌ బాధ్యతలు అప్పగించారు. తరచు సర్వర్‌ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. 
– ఉమ్మడి నల్గొండ జిల్లాలో 15 ఎస్‌ఆర్‌ఓలు ఉన్నాయి. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట ఎస్‌ఆర్‌ఓ కార్యాలయంలో డాక్యుమెంట్‌ రైటర్లే రాజ్యమేలుతున్నారు. ప్రతి రిజిస్ట్రేషన్‌కు రూ.ఐదు వేల వరకు వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. 110 గజాల ఇంటిని గిఫ్ట్‌డీడ్‌ చేసుకునేందుకు వచ్చిన వ్యక్తి వద్ద రూ.28 వేలు వసూలు చేశారు. 20కి పైగా డాక్యుమెంట్‌ రైటర్‌ ఆఫీసులు ఉన్నాయి.  

ఉదయం వస్తే సాయంత్రం అవుతోంది  
మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని ఎస్‌ఆర్‌ఓకు ఉదయం 11 గంటలకు వెళితే.. డాక్యుమెంట్‌ వచ్చే సరికి సాయంత్రం నాలుగు అవుతోంది. రోజంతా కార్యాలయం వద్దే పడిగాపులు కాయాల్సి వస్తోంది. సర్దుకుని వేచి ఉందామనుకున్నా.. అక్కడ కనీస వసతులు లేవు. సర్వర్‌ సమస్య అని అధికారులు తరచు చెబుతుంటారు. నెలలో 20 రోజులు ఇదే పరిస్థితి ఉంటుంది. 
– పగడం మల్లేశం, మహబూబ్‌నగర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement