సాక్షి,వరంగల్: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పరిణామాల నేపథ్యంలో మాజీ మంత్రి, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ మౌనం వీడారు. ప్రత్యర్థులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ కొండా సుస్మిత వ్యవహారంలో తలెత్తిన వివాదాల కారణంగా కొండా సురేఖ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొంతకాలం సైలెంట్‌గా ఉన్న ఆమె, తాజాగా జిల్లా రాజకీయాల్లో మళ్లీ యాక్టివ్ అయ్యారు. ప్రత్యర్థులకు చురకలంటించారు.
‘మాపై అవాకులు చవాకులు పేలితే ఊరుకోం.. మగవాళ్ల వరకు కూడా అవసరం లేదు, మా వర్గంలోని ఆడవాళ్లే చాలు, దొరికిన చోటే చిత్తు చిత్తుగా చితకబాదుతాం’ అంటూ ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ
మంగళవారం వరంగల్‌లోని తన క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్, కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో కొండా సురేఖ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు 112 చెక్కులను పంపిణీ చేయడం ఆనందంగా ఉందని తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రత్యర్థుల తీరుపై మండిపడ్డారు.
ఎంజీఎం ఘటనపై స్పందన
ఇటీవల వరంగల్ నగరంలోని ఎంజీఎం ఆసుపత్రిలో పైకప్పు పెచ్చులూడి పలువురికి గాయాలైన ఘటనపై బీఆర్ఎస్, బీజేపీ నేతలు చేస్తున్న నిరసనలపై ఆమె స్పందించారు. ఆ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం జరగకపోవడం అందరి అదృష్టమని, దీనిపై ప్రతిపక్షాలు చేస్తున్న నిరసనలు హాస్యాస్పదంగా ఉన్నాయని కొట్టిపారేశారు. అతి త్వరలోనే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని పేద ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని స్పష్టం చేశారు. నూతన కలెక్టరేట్ భవన నిర్మాణ పనులు కూడా దాదాపు పూర్తయ్యాయని, కొన్ని ఫర్నిచర్, రంగుల పనులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు.
నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యం
మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్త బాధ్యతలు ఉండేవని, ఇప్పుడు ఎమ్మెల్యేగా కేవలం తన నియోజకవర్గ అభివృద్ధి కోసం శ్రమించే అవకాశం దక్కిందని, అందుకు ఎంతో ఆనందంగా ఉందని కొండా సురేఖ పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతలు గాల్లో కత్తులు తిప్పుతున్నారని, కొంతమంది నాయకులు తమ నోరు అదుపులో పెట్టుకోవాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆమె గట్టి వార్నింగ్ ఇచ్చారు.


